భారత్ సినిమాలను కాదంటే పాక్‌కే నష్టం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ దాడులకు నిరసనగా భారతీయ సినిమాల ప్రదర్శనను ఆ దేశంలో నిలిపివేయడం మనకన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం. పాక్‌లో భారతీయ సినిమాలపై కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని 2008లో అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఎత్తివేశారు. అప్పటివరకు పాకిస్థాన్ సినిమాలకు ప్రజాదరణ కరువవడంతో పలు నిర్మాణ సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
పాకిస్థాన్ మార్కెట్లోకి భారతీయ సినిమాల ప్రవేశంతో అక్కడ సినీ పరిశ్రమ మళ్లీ ఊపిరిపోసుకుంది. ప్రేక్షకుల రాక పెరగడంతో మూతపడ్డ పలు సినిమా హాళ్లు పునరుద్ధరణకు నోచుకుని కొత్తకళను సంతరించుకున్నాయి. కొత్త థియేటర్లూ వెలిశాయి. భారతీయ సినిమాల స్ఫూర్తితో కొత్త తరం పాక్ సినీరంగంలో అడుగుపెట్టడంతో వారి సినిమా కూడా ఊపందుకుంది. అనతికాలంలోనే అది లాభదాయక పరిశ్రమగా మారిపోయింది.
పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను ఎందుకు నిషేధించారనే నేపథ్యంలోకి వెళితే.. అలనాటి బాలీవుడ్ హీరో దేవానంద్ నటించిన ‘జాల్’ చిత్రం 1952లో పాకిస్థాన్ సినిమా హబ్‌గా పేరుపొందిన లాహోర్‌లోని రీజెంట్ సినిమా హాల్లో విడుదలైంది. దేవానంద్ లాహోర్ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఉండడం, సినిమా కథ కూడా కొంత లాహోర్‌లో నడుస్తుంది కనుక ఆ సినిమాకు పాక్ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. పాక్‌లో డామినేట్ చేస్తున్న భారతీయ సినిమాలను నిషేధించకపోతే మనుగడ లేదని భావించిన పాక్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆ థియేటర్ ముందు ఆందోళన చేశారు. అరెస్టు అయ్యారు. జైలుకు కూడా వెళ్లారు.
అక్కడ ఆందోళన ఉధృతం అవడంతో ‘ఒక సినిమా ఎగుమతికి ఒక సినిమా దిగుమతి’ అనే ఆంక్షలను పాకిస్థాన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 1965లో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో భారతీయ సినిమాలను అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో నటించడమే కాకుండా తన పాటలతో ఎంతోమంది భారతీయులను అలరించిన పాకిస్థాన్ ప్రముఖ సింగర్ నూర్ జెహాన్ కూడా అప్పుడు పాక్ నిర్ణయాన్ని సమర్థించారు. పాక్ దేశభక్తి గీతాలను కూడా ఆలపించారు.
భారతీయ సినిమాపై పాకిస్థాన్ నిషేధం విధించినప్పుడు పాక్ సినీ పరిశ్రమ అంతా ఎలా ప్రశంసించారో, ఇటీవల భారతీయ సినిమాల పదర్శనను నిలిపివేయడం పట్ల కూడా వారు అలాగే స్పందించారు. కళలు, సినిమా, సాహిత్య రంగాల్లో భారత్, పాక్ మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇరు దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు కారణమవుతున్న రంగాలపై నిషేధం విధించడం వల్ల ఎవరికి ప్రయోజనం?..