అడవంటే పూర్తిగా అడవీ కాదు, నది పాయ అందామంటే అవి మాత్రమే కాదు. సముద్రతీరం అనుకుందామంటే కచ్చితంగా అలా కూడా చెప్పలేం. గంగ, మేఘన, బ్రహ్మపుత్ర వేటికవి తమ దారిన తాము పయనిస్తూ అటవీప్రాంతానికి పచ్చదనాన్ని అద్దుతూ ఉంటాయి. నదులు పాయలు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. నీటి పాయల తీరాన ఎల్తైన మడ అడువులు తెచ్చిన ప్రాకృతిక సౌందర్యం మాటల్లో వర్ణించలేనిది. ఆ చెట్ల వల్లనే ఈ అడవికి సుందర్‌వన్ అనే పేరు వచ్చింది. బెంగాలీ, ఒడిషా భాషల్లో ‘వ’ అనే అక్షరం ఉండదు. ‘వ’ కు బదులుగా ‘బ’ ఉపయోగిస్తారు. అందుకే ఈ సుందరవనం సుందర్‌బన్ అయింది.
నీటిలో పులి నేల మీద మొసలి
అడవి అంటే... పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే... సుందర్‌బన్‌లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు... మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్ రాయల్ టైగర్‌లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి.
అడవిలో ఊళ్లు
మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు.
సరిహద్దు దీవి
మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు.
సాహిత్యవనం
సుందర్‌బన్ అటవీప్రదేశం కోల్‌కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ నేచర్’ కేటగిరీలో లిస్ట్ అయింది. బెంగాలీ రచయితలు సుందర్‌బన్ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు.
సుందరబన్‌కు ప్రత్యేక హోదాలు
► 1973 టైగర్ రిజర్వ్
► 1987 వరల్డ్ హెరిటేజ్ సైట్
► 1989 నేషనల్ పార్క్
Comments
Please login to add a commentAdd a comment