ఎలుకలు కరిచి ఐదుగురు విద్యార్థినులకు గాయాలు | Five female students were injured by rats | Sakshi
Sakshi News home page

ఎలుకలు కరిచి ఐదుగురు విద్యార్థినులకు గాయాలు

Aug 28 2024 5:13 AM | Updated on Aug 28 2024 5:13 AM

Five female students were injured by rats

నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స 

శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్షియల్‌ కళాశాలలో ఘటన 

కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి బీఆర్‌ అంబేడ్కర్‌ మహిళా రెసిడెన్షియల్‌ కళాశాలలో మంగళవారం ఐదుగురు ఇంటర్‌ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. గాయపడిన విద్యార్థినులకు నరసన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే... రెసిడెన్షియల్‌ కళాశాల భవనంలోని డారి్మటరీలో ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని రోహిణి, ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినులు స్రవంతి, హారిక, బాలామణి, సౌజన్య ఉండగా రెండు పెద్ద ఎలుకలు ఒకేసారి వచ్చి దాడి చేశాయి. 

ఐదుగురు విద్యార్థినుల కాళ్లను కరిచాయి. దీంతో వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థినులను నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని ఏఆర్‌వీ(యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌) చేస్తే సరిపోతుందని అక్కడి వైద్యులు వెల్లడించారు. 

కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెసిడెన్షియల్‌ కళాశాలల జిల్లా సమన్వయకర్త బాలాజీ నాయక్‌ వెంటనే కళాశాలకు చేరుకున్నారు. ఎలుకల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ కృష్ణతారను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement