సాక్షి, హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (యుఆర్‌ఎస్) పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేయనున్నట్లు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ నెల 19, 20 తేదీల్లో భోజన విరామ ప్రదర్శనలు, 29న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 10న డీఎస్సీ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొంది. కేజీబీవీ, యుఆర్‌ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీహెచ్ దుర్గా భవాని అధ్యక్షతన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనాథలు, డ్రాప్‌అవుట్ల కోసం నిర్వహిస్తున్న స్కూళ్లల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాధ్యతతో పని చేస్తున్నారని, వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకపోవటం అన్యాయమన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి మాట్లాడుతూ, విద్యార్థుల కోసం ఐక్యంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఐక్యతను సమస్యల సాధన కోసం జరిపే పోరాటంలోనూ చూపించాలన్నారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాలు ఇలా..
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, ఉపాధ్యాయుల పేస్కేలులోని కనీస వేతనాన్ని కేజీబీవీ, యుఆర్‌ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాలి, వేసవి సెలవుల వేతనం, హెల్త్ కార్డులు జారీ చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లోని రెగ్యులర్ మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వర్తించే ప్రసూతి, శిశు సంరక్షణ సెలవులతోపాటు అన్నిరకాల సెలవులను వర్తింపచేయాలి, ఆదివారాలు, పండుగ సెలవుల్లో పని చేసిన వారికి మరుసటి రోజు సెలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వాలి. రెండో శనివారం సెలవుగా ప్రకటించాలి.
సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం
Published Sat, Jan 13 2018 3:48 AM | Last Updated on Sat, Jan 13 2018 3:48 AM
Advertisement
Advertisement