Employees Problems
-
ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడిచినా, ఉద్యోగుల సమస్యల పట్ల సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడం ఇదే మొదటిసారి అని, ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం టీఎన్జీఓ కార్యాలయంలో టీజేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి వినతులు సమరి్పస్తున్నా, స్పందన మాత్రం రావడం లేదన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని డీఏలు మంజూరు చేస్తుందని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూశారని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి తీపికబురు రాలేదని చెప్పారు. ఆర్థిక సంబంధిత అంశాలే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా పరిష్కరించాల్సిన సమస్యలు కూడా ఉన్నాయని, కనీసం వాటి పట్ల అయినా సీఎం చొరవ తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. ఉద్యోగుల సమస్యలు వినే తీరిక ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని తెలిపారు.సీఎస్ శాంతికుమారిని కలిసేందుకు జేఏసీ తరఫున ప్రయత్నాలు చేసినా, ఆమె సమయం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ నెల 23న మంత్రివర్గ సమావేశమున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆ రోజు ఉద్యోగుల సమస్యల పట్ల నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. లేకుంటే దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతామని, వారం రోజుల్లో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాల అభిప్రాయాలు స్వీకరించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని సీఎం సూచించడంతో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల తరఫున వినతులు ఇచ్చామన్నారు. ఉద్యోగ జేఏసీతో కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని, ఉద్యోగులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను సైతం ప్రభుత్వం నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం శుభపరిణామమే అయినా, సప్లిమెంటరీ, మెడికల్ తదితర బిల్లులన్నీ పెండింగ్‌లో నెలల తరబడి ఉంటున్నాయని, హెల్త్ కార్డుల అంశం తేలలేదన్నారు. ఇప్పుడు సంఘాల మాటలు కూడా ఉద్యోగులు వినే పరిస్థితి లేకుండా పోతోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలపై జోక్యం చేసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేత సదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున వినతిపత్రాన్ని అందచేశారు. -
కష్టాల్లో కాంటింజెన్సీ ఉద్యోగులు
మునగాల (కోదాడ) : ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంటింజెన్సీ ఉద్యోగుల తలరాత మారడం లేదు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా.. వారిని పట్టించుకునే నాథులే లేకుండా పోయాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కంటే ముందుగా నియమితులైన తమను నేటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు కాంటింజెన్సీ ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో దాదాపు 2,500మందికి పైగా ఉద్యోగులు చాలీచాలని జీతాలతో బతుకుబండిని లాగిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం రూ.75ల వేతనంతో ఉద్యోగంలో చేరిన వీరికి ప్రస్తుతం నెలకు రూ.2వేలలోపు వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఈ వేతనంతో నెలంతా కుటుంబం గడవం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నైట్ వాచ్‌మన్, వాటర్‌మన్ లాంటి విధులు నిర్వర్తిస్తున్న వీరు వెట్టిచాకిరీ పేరుతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. జిల్లాలో 2,500మందిలో మునగాల మండలంలోనే దాదాపు 30మంది వరకు కాంటింజెన్సీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఉదయం నుంచి సాయింత్రం వరకు వివిధ కార్యాలయాల్లో రకరకాల పనులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేటర్ లేకపోయినప్పటీకీ వారి విధులను కూడా వీరే నిర్వర్తిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ సిబ్బంది, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు కాంటింజెన్సీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్న ఈ తరుణంలో చాలీచాలని వేతనాలతో పస్తులుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నామని.. అర్హత ఉండి ఏళ్ల తరబడి సర్వీసు ఉన్న తమను ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (యుఆర్ఎస్) పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేయనున్నట్లు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ నెల 19, 20 తేదీల్లో భోజన విరామ ప్రదర్శనలు, 29న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 10న డీఎస్సీ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొంది. కేజీబీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీహెచ్ దుర్గా భవాని అధ్యక్షతన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనాథలు, డ్రాప్అవుట్ల కోసం నిర్వహిస్తున్న స్కూళ్లల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాధ్యతతో పని చేస్తున్నారని, వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకపోవటం అన్యాయమన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి మాట్లాడుతూ, విద్యార్థుల కోసం ఐక్యంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఐక్యతను సమస్యల సాధన కోసం జరిపే పోరాటంలోనూ చూపించాలన్నారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాలు ఇలా.. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, ఉపాధ్యాయుల పేస్కేలులోని కనీస వేతనాన్ని కేజీబీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాలి, వేసవి సెలవుల వేతనం, హెల్త్ కార్డులు జారీ చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లోని రెగ్యులర్ మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వర్తించే ప్రసూతి, శిశు సంరక్షణ సెలవులతోపాటు అన్నిరకాల సెలవులను వర్తింపచేయాలి, ఆదివారాలు, పండుగ సెలవుల్లో పని చేసిన వారికి మరుసటి రోజు సెలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వాలి. రెండో శనివారం సెలవుగా ప్రకటించాలి. -
భారంగా బతుకు బండి
- బరువుగా సగటు ఉద్యోగి జీవనం - పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నాన్చుడు ధోరణి రెవెన్యూ శాఖలో రామకష్ణ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రూ.24 వేలు జీతం. ఇద్దరు సంతానం. ఒకరు పదవ తరగతి, మరొకరు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. చూసేవారికి ఈయన జీతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కుటుంబ ఖర్చుల వరకే సరిపోతోందని ఆయనకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం దుబారా ఖర్చులకు వెళ్లినా అప్పు చేయాల్సిందే. ఇదీ సగటు ఉద్యోగి పరిస్థితి. అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగం అంటే మంచి జీతం.. విలాసవంత జీవితం అని అందరూ అనుకుంటారు. అయితే అందరి జీవితాలూ అలా సాఫీగా లేవు. సగటు ఉద్యోగులు బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, రవాణా, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా వేతనాలు పెరగడం లేదు. దీంతో సంపాదనకు - కుటుంబ అవసరాలకు మధ్య అంతరం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నచిన్న సరదాలు, కోరికలు కూడా పెద్ద భారంగా పరిణమిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాలకు బడ్జెట్ పెరిగిపోతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సగటు వేతనం రూ.10వేల నుంచి రూ.30వేల మధ్య తీసుకుంటున్న ఉద్యోగులు నెలసరి బడ్జెట్ సంపాదనకు మించుతోంది. జిల్లా వ్యాప్తంగా సగటు వేతన జీవులు దాదాపు 50వేల మంది దాకా ఉంటారు. వీరంతా పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు మేరకు వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. మా కష్టాలు మాకే తెలుసు నాకు రూ.33 వేల వేతనం వస్తుంది. అమ్మ, భార్య, ఇద్దరు పిల్లలు. ఇంటి బాడుగ రూ.6వేలు. మిగిలిన డబ్బుతో ఎంతో పొదుపుగా సంసారం నెట్టుకొస్తున్నాను. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో మాకే తెలుసు. పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చదివించలేకపోతున్నా. పండుగలు వచ్చాయంటే అదో అదనపు ఖర్చు. – మంజూనాథ్, సీనియర్ అడిటర్, ఆడిట్ శాఖ భారంగా నెట్టుకొస్తున్నాను అన్ని కటింగ్‌లు పోనూ చేతికి రూ.21 వేల వేతనం వస్తుంది. ఇద్దరు సంతానం. అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, అమ్మాయి డిగ్రీ చేస్తోంది. వారి చదువులకు, ఇంటి ఖర్చులకు వస్తున్న వేతనం సరిపోతోంది. ఇక ఇంటి ఖర్చులకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పిల్లల కోసం పొదుపు చేసేందుకు కూడా జీతం డబ్బులు మిగలడం లేదు. – ఫకృద్ధీన్, ప్రచార సహాయకుడు, సమాచార శాఖ, అనంతపురం ఖర్చులకు సరిపోవడం లేదు నాకు రూ.10 వేలు వేతనం వస్తుంది. ఈ కొద్ది జీతం సరిపోవడం లేదు. ఇంటి బాడుగ రూ.2,500. కనీస అవసరాలకు ఆ మొత్తం సరిపోతోంది. ఎంతో గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ఏమాత్రం దుబారాకు వెళ్లినా కష్టాలు కొనితెచ్చుకోవడమే అన్నట్లుగా ఉంది. పండుగలు, శుభకార్యాలు ఉంటే ఆ నెల మరీకష్టంగా ఉంటోంది. – రాఘవేంద్ర, సెక్యూరిటీ గార్డ్, అనంతపురం కుటుంబపోషణ భారంగా నాకు నెలసరి రూ.10 వేలు వేతనం వస్తుంది. కుటుంబపోషణ భారంగా నెట్టుకొస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బీటెక్, మరొకరు డిగ్రీ చదువుతున్నారు. వస్తున్న వేతనం ఏ మాత్రం సరిపోదు. ఇంటి బాడుగ, ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాలాంటి చిరుద్యోగులకు వేతనం పెంచితే కొంతైనా బాగుటుంది. – మల్లికార్జున, కాంట్రాక్టు ఉద్యోగి, నగరపాలక సంస్థ. -
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి
అనంతపురం అర్బన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఏపీ జేఏసీ (అమరావతి) రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక కృష్ణ కళామందిర్లో జరిగిన జేఏసీ సమావేశానికి, జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల అంశాలపై ప్రభుత్వం శ్రద్ధం పెట్టడం లేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని సాధించుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫణిపేర్రాజు, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యోగేశ్వరరెడ్డి, ప్రభుత్వ డైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. -
'రాష్ట్ర ఉద్యోగులకు అండగా ఉంటా'
► టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రామయ్య ఖమ్మంసహకారనగర్: తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తమవంతు కృషి చేస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు పి.రామయ్య అన్నారు. ఆదివారం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద ఆ సంఘం నగరశాఖ సమావేశం జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత జరిగే బదిలీల్లో అందరికీ న్యాయం చేసేలా చూస్తామన్నారు. ఇళ్ల స్థలాలు అందరికీ ఇప్పించేందుకు కృషి చేస్తానని, విద్యార్హత ఉన్న 4వ తరగతి సిబ్బందికి పదోన్నతులు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన మహిళలకు క్రీడలు నిర్వహించాలని తీర్మానించారు. నగరశాఖ అధ్యక్షుడు వట్టికొండ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు వెంకన్న, నాయకులు చావా నారాయణరావు, వెంకటరమణ, ప్రసాద్, కృష్ణవేణి, భాగ్యమ్మ, అక్కమ్మ, సుగుణారావు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో షాడో ఎండీ!
► ప్రతి పనికీ ఆయన కటాక్షం కావాల్సిందే.. ► ఈడీలు చెప్పినా ఎండీని కలిసేందుకు అనుమతి ససేమిరా ► షాడో దెబ్బకు విలవిలలాడుతున్న ఉద్యోగులు సాక్షి, అమరావతి బ్యూరో: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది ఆర్టీసీలో ఎండీ పేషీలో పనిచేసే ఓ కీలక అధికారి వ్యవహారం. షాడో ఎండీగా చలామణి అవుతున్న ఈయన కొన్నేళ్లుగా పేషీలోని తిష్ట వేయడంతో వేసుక్కూర్చుకున్నారు. ఆయన కనుసన్నల్లోనే పాలనా వ్యవహారాలు నడిపిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులు ఎండీని కలవాలంటే ముందుగా షాడో ఎండీని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ప్రతి పనికీ ఓ రేటు.. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్‌గానీ ఇతరత్రా ఉద్యోగులు ఏదైనా పని మీద కార్యాలయంలోకి వస్తే షాడో ఎండీ ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నా.. కనికరం లేదు ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఆర్టీసీ చిరుద్యోగి తాను పని చేసే డిపోలో ఓ అధికారితో వాదనపడ్డాడు. దీంతో ఆయనను సన్పెండ్ చేశారు. ఉద్యోగం పోవడంతోపాటు పక్షవాతానికి గురయ్యారు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. ఉద్యోగం లేక కుటుంబ పోషణ కరువై ఎండీకి తనగోడు విన్నవించుకునేందుకు వచ్చాడు. కానీ షాడో ఎండీ రెండు రోజుల వరకు ఎండీని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. అతని దీనస్థితి చూసి ఇతర ఉద్యోగులు ఎండీని కలిసేందుకు అవకాశం ఇప్పించారు. బస్సులో డ్యూటీ చేసేందుకు ఇబ్బంది కావడంతో ఆన్‌డ్యూటీపై ఆర్టీసీ కార్యాలయంలోనే పని చేసేందుకు ఎండీ అవకాశం కల్పించినా, చివరకు షాడో ఎండీని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఇద్దరు శ్రామిక్ ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు. డిపోల్లో కాలుష్యం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయి. వారు పని చేసే డిపోలోనే అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో అందులో పని చేసుకొనేందుకు ఓడీ కోసం ఎండీని కలిసేందుకు వచ్చారు. నాలుగు రోజులపాటు పడిగాపులు కాసినా ఎండీని కలిసే అవకాశం షాడో ఎండీ కల్పించలేదు. దీంతో ఊసూరుమంటూ వెళ్లిపోయారు. ఇలా సుమారు 40 మందికిపైగా అనారోగ్య బాధితులు తమ గోడును చెప్పుకొనేందుకు ఎండీ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రాకు చెందిన ఓ చిరుద్యోగి విధి నిర్వహణలో మద్యం సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్లలో వచ్చింది. కానీ ఆ ఉద్యోగి మద్యం సేవించలేదు. చివరకు బ్రీత్ ఎనలైజర్‌లో సాంకేతిక లోపంలో అలా వచ్చినట్లు తేలింది. కానీ ఆ ఉద్యోగిని మాత్రం సస్పెండ్ చేశారు.ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. తనకు జరిగిన అన్యాయం గురించి ఎండీకి చెప్పుకోనేందుకు వచ్చినా అవకాశం రాలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రిటైడ్ ఉద్యోగులు, ప్రమాద బాధిత ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎండీని కలిసేందుకు వస్తుంటారు. ఇక్కడకొచ్చాక రోజుల తరబడి ఎండీ వద్దకు వీలులేక పస్తులతో అల్లాడుతున్నారు. ఈడీల స్థాయి మాటా బేఖాతరు ఆర్టీసీలో ఎండీ స్థాయి అధికారి కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు ఇతర జిల్లాల నుంచి ఎంతో మంది ఉద్యోగులు వస్తుంటారు. వారికి ఎండీ కలిసే అవకాశం లేకపోవడంతో స్థానిక అధికారుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వారు ఎండీని కలిసేందుకు సిఫార్సు చేసినా షాడో ఎండీ అడ్డుకుంటున్నారు. అధికారి మంచి వారైనా.. ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఎండీనే పెద్ద దిక్కు. తన దృష్టికి వచ్చిన సమస్యలను బాస్ పరిష్కరిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఇలాంటి షాడో ఉద్యోగులతో ఎండీపైనా దురాభిప్రాయం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. -
నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తాం
⇒ తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై షీలాబిడే కమిటీ సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి మరో నెల రోజుల్లో పరిష్కారం చూపుతామని షీలాబిడే కమిటీ శుక్రవారం తెలిపింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి తుది నివేదికలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులను కమిటీ ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు, ఉద్యోగుల విభజన సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు విన్పిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణా విద్యుత్ సంస్థలు 1252 మంది ఉద్యోగులను తొలగించాయి. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయి, తెలంగాణ సంస్థల్లో చేరారు. ఉద్యోగుల ఆస్తుల విభజన కోసం నియమించిన షీలా బిడే కమిటీ అనేక పర్యాయాలు చర్చలు జరిపింది. స్థానికత మార్గదర్శకాలు రూపొందించే ప్రక్రియలో రెండు రాష్ట్రాల అధికారులు ఏకతాటిపైకి రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశం కొంత సానుకూలంగా ఉన్నట్టు ఇరుపక్షాల అధికారులు చెబుతున్నారు. జనవరిలో నిర్ణయం వెల్లడి 2014 జనవరి ఒకటవ తేదీ నాటికి విద్యుత్ సంస్థల ఆడిట్ బ్యాలెన్స షీట్స్‌ను పరిగణలోనికి తీసుకోవాలని, దీని ఆధారంగా ఆస్తుల విభజన చేయాలని కమిటీ సూచించింది. రెండు రాష్ట్రాలు వీటిని అందించాలని పేర్కొంది. దీనిపై ఏపీ, తెలంగాణ సమగ్ర వివరాలతో ముసాయిదాలను రూపొందించాలని తెలిపింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోగా వాస్తవ పరిస్థితిని వివరించాలని కోరింది. ఉద్యోగుల విభజన చేపట్టడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని రెండు రాష్ట్రాలు తమ నివేదికల్లో పేర్కొనాలని తెలిపింది. ఇరు పక్షాలు ఈ నివేదికలపై చర్చించుకుని డిసెంబర్ 30లోగా తమ అభ్యంతరాలు తెలపాలని కమిటీ సూచించింది. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని జనవరి మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని షీలాబిడే కమిటీ పేర్కొంది. కమిటీ సమావేశానికి ఏపీ తరపున ట్రాన్సకో సీఎండీ విజయానంద్, జేఎండీ దినేష్ పరుచూరి, జెన్కో డెరైక్టర్ (ఫైనాన్స) ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. -
సంగారెడ్డి మున్సి‘పల్టీ’!
గ్రేడ్-1 మున్సిపల్లో 55 పోస్టులు ఖాళీ ఏ విభాగం చూసినా.. బాధ్యులే కరువు ఉన్నవారిని సరెండర్ చేసి.. నియామకాలు నిలిపివేత రెగ్యులర్ అధికారులు లేక ప్రజలకు ఇక్కట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో ప్రధానమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇన్‌చార్జీలే బాధ్యతలు మోస్తున్నారు. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోలందరూ డిప్యుటేషన్లపై వస్తుండటంతో అక్రమాలకు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. రెగ్యులర్ కమిషనర్ కరువు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీకి నిత్యం ప్రముఖుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రధాన రహదారిని శుభ్రం చేయడం, లైనింగ్ (సున్నం) తదితర పనులు చేయాల్సి ఉంటుంది. దీని పర్యవేక్షణకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆదినారాయణను 2014లో నల్లగొండ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో ప్రత్యేకాధికారి పాలనలో మున్సిపాలిటీ ఉండగా.. సంగారెడ్డి ప్రత్యేకాధికారి, జేసీ శరత్ ఇన్చార్జి కమిషనర్ వీరారెడ్డి సూచనల మేరకు ఎస్సైను అక్కడి నుంచి తొలగించారు. కానీ, ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరూ నియమితులు కాలేదు. అనంతరం టౌన్‌ప్లానింగ్ అధికారి నర్సింగరావును కొంతకాలం జోగిపేట నగర పంచాయతీకి ఇన్చార్జిగా టీపీఎస్ హోదాలో పంపించారు. అక్కడ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని సరెండర్ చేశారు. ఆయన స్థానంలోనూ ఎవరూ రాలేదు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అప్పటి ఇన్చార్జి కమిషనర్ వీరారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కృష్ణారెడ్డిని సంగారెడ్డి కమిషనర్‌గా నియమించారు. కానీ, ఆరు నెలలు తిరగకుండానే కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆయన పనితీరుపై అసంతృప్తితో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ ఇంజినీర్ గయసోద్దీన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన సైతం పనిచేయడం లేదని ఆగ్రహించిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్.. గయసోద్దీన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి సాయిలుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉన్నారు. అనంతరం అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టర్ కోరడంతో జెడ్పీ సీఈఓ మధుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. కానీ, ఆరు నెలలు తిరగకుండానే బదిలీపై వెళ్లారు. దీంతో మరోసారి ఇన్చార్జి కమిషనర్‌గా సాయిలు నియమితులయ్యారు. నెలరోజులకే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున అదనపు సంయుక్త కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు అప్పగించారు. రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు రెగ్యులర్ కమిషనర్‌ను ఇవ్వలేకపోయారు. ఫలితంగా అభివృద్ధి పనులు నిలిచిపోవడమేకాకుండా, పరిపాలన పరంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏ విభాగంలోనూ రెగ్యులర్ ఉద్యోగులు లేనందున ఆర్థిక పరమైన విషయాల్లో ఎవరికి అదనపు బాధ్యతలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బిల్లుల వసూలు బాధ్యతను అప్పగించగా భారీ అవనీతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మున్సిపాల్లో ఖాళీల వివరాలు సక్రమంగా పనిచేయడం లేదంటూ ఒక వైపు ఉన్నతాధికారులు.. మరో వైపున పాలకవర్గ సభ్యులు అధికారులను సరెండర్ చేశారు. కానీ, వారి స్థానంలో ఎవరినీ నియమించడం లేదు. ఫలితంగా మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, టీపీఆర్వో, నాలుగు సీనియర్ స్టెనోగ్రాఫర్లు‡ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెజిటెడ్ పోస్టులు మూడూ ఖాళీగా ఉన్నాయి. నాన్‌గెజిటెడ్ పోస్టులు 58, నాల్గవ తరగతి ఉద్యోగులు 66కు కేవలం 24 మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ఇంకా 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా టౌన్‌ప్లానింగ్ సెక్షన్లో 9, ఇంజినీరింగ్ విభాగంలో 13, శానిటేషన్ విభాగంలో పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్, 2 శానిటరీ జవాన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. మాది ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలం రామకూర్ గ్రామం. నేను ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు రాలేదు. స్థానిక బీఎల్వోను సంప్రదిస్తే స్పందన లేదు. వెరిఫికేషన్ సమయంలో ఇంటివద్ద ఉండాలంటున్నారు. నేను నూజివీడు త్రిబుల్‌ఐటీలో చదువుతున్నాను. ధ్రువీకరణ పత్రాలన్నీ నా తల్లిదండ్రులు చూపారు. ఆన్లైన్లో ఆధార్ చూపించాను. అయినా ఓటరు కార్డు రాలేదు. - ఎం.నాగూర్ మస్తాన్ వలీ మీ పేరు ఓటర్ల జాబితాలో చేర్చేందుకు జిల్లా కలెక్టరుకు సిఫారసు చేస్తున్నాం. విద్యార్థులు స్థానికంగా లేకపోయినా వారి స్వగ్రామంలో ఓటుహక్కు కల్పించేలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మీ ధ్రువీకరణ పత్రాలను మీ తల్లిదండ్రులు ఎన్నికల సిబ్బందికి చూపితే ఓటర్ల జాబితాలో పేరు చేరుతుంది. మా కోడలు అంజుమ్ ఆరా పేరు షేర్లింగంపల్లి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు జనవరి 1 కన్నా ముందే దరఖాస్తు చేశాను. నా కోడలు తాను పేర్కొన్న అడ్రస్‌లో ఉండట్లేదని తిరస్కరించారు. దయచేసి మా కోడలు పేరు షేర్లింగంపల్లి ఓటర్ల జాబితాలో చేర్పించగలరు. - అనజీర్ అహ్మద్ ceoandhrapradesh@eci.gov.in కు మీ పూర్తి వివరాలు తెలుపుతూ మెయిల్ చేయండి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి. ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్ లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి.