మునగాల గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కాంటింజెన్సీ ఉద్యోగులు
మునగాల (కోదాడ) : ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంటింజెన్సీ ఉద్యోగుల తలరాత మారడం లేదు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా.. వారిని పట్టించుకునే నాథులే లేకుండా పోయాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కంటే ముందుగా నియమితులైన తమను నేటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు కాంటింజెన్సీ ఉద్యోగులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో దాదాపు 2,500మందికి పైగా ఉద్యోగులు చాలీచాలని జీతాలతో బతుకుబండిని లాగిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం రూ.75ల వేతనంతో ఉద్యోగంలో చేరిన వీరికి ప్రస్తుతం నెలకు రూ.2వేలలోపు వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఈ వేతనంతో నెలంతా కుటుంబం గడవం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నైట్ వాచ్‌మన్, వాటర్‌మన్ లాంటి విధులు నిర్వర్తిస్తున్న వీరు వెట్టిచాకిరీ పేరుతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. జిల్లాలో 2,500మందిలో మునగాల మండలంలోనే దాదాపు 30మంది వరకు కాంటింజెన్సీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరు ఉదయం నుంచి సాయింత్రం వరకు వివిధ కార్యాలయాల్లో రకరకాల పనులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేటర్ లేకపోయినప్పటీకీ వారి విధులను కూడా వీరే నిర్వర్తిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు కాంటింజెన్సీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్న ఈ తరుణంలో చాలీచాలని వేతనాలతో పస్తులుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నామని.. అర్హత ఉండి ఏళ్ల తరబడి సర్వీసు ఉన్న తమను ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment