low salaries
-
సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?
వివిధ కంపెనీల సీఈవోలు ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు అనే దానిపై జనానికి ఈ మధ్య ఆసక్తి పెరిగింది. కోట్లలో జీతాలు తీసుకుంటున్న సీఈవో గురించి వింటున్నాం. అయితే దానికి భిన్నంగా అతి తక్కువ వేతనం పొందుతున్న ఈ సీఈవో గురించి తెలుసుకోవాల్సిందే. కునాల్‌షా... క్రెడ్(CRED) అనే ఫిన్‌టెక్ కంపెనీ సీఈవో. ఆయన తీసుకుంటున్న నెలవారీ జీతం రూ.15వేలు. (చదవండి : నోకియా కొత్త లోగో చూశారా?...్ల రియాక్షన్స్ మాత్రం..!) కునాల్ షా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవోగా తాను ఎంత జీతం తీసుకుంటున్నది తెలియజేశారు. ఆయన చెప్పిన జీతాన్ని విని ఆశ్చర్యపోయిన ఓ యూజర్.. ఇంత తక్కువ జీతంలో ఎలా బతుకుతున్నారు సార్ అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్తూ.. కంపెనీ లాభదాయకంగా మారే వరకు తాను ఎక్కువ మొత్తంలో జీతం తీసుకోకూడదనుకున్నానని, అందుకే నెలకు కేవలం రూ. 15 వేలు జీతం తీసుకుంటున్నట్లు షా వివరించారు. తన మునుపటి కంపెనీ ఫ్రీచార్జ్‌ను విక్రయించగా వచ్చిన డబ్బుతో బతుకుతున్నానని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్! కోడ్‌నేమ్ ఏంటో తెలుసా?) ప్రారంభంలో ఇలా తక్కువ జీతం తీసుకున్నట్లు చెప్పిన సీఈవోలు చాలా మందే ఉన్నారు. 2013లో జుకర్‌బర్గ్ కేవలం 1 డాలర్ వార్షిక వేతనం తీసుకుని ఫేస్బుక్లో అతి తక్కువ వేతనం పొందే ఉద్యోగిగా నిలిచారు. కాకపోతే బోనస్‌లు, స్టాక్ అవార్డుల రూపంలో పరిహారం అందుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేలు కూడా తాము సంవత్సరానికి 1 డాలర్ జీతం మాత్రమే తీసుకున్నామని అప్పట్లో చెప్పారు. (ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!) -
ప్రైవేటు టీచర్ల ‘ఉపాధి’ తిప్పలు
► కొత్తపేటకు చెందిన సత్యనారాయణ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేటు స్కూల్లో సోషల్ టీచర్‌గా ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. కరోనాకు ముందు నెలసరి వేతనం రూ.16 వేలు వచ్చేది. కరోనా నేపథ్యంలో యాజమాన్యం నష్టాలను సాకుగా చూపి వేతనాన్ని రూ.12 వేలకు తగ్గించింది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నా రూ.12 వేల వేతనాన్నే కొనసాగిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే పని చేయండి..లేకుంటే రిజైన్ చేయొచ్చని యాజమాన్యం సెలవిచ్చింది. ► ఉప్పల్‌కు చెందిన సునీత సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు స్కూల్లో రూ.15 వేల వేతనంపై ఆంగ్లం టీచర్‌గా పనిచేసేది. కరోనా నేపథ్యంలో తొలగింపునకు గురైంది. తాజాగా నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా తిరిగి విధుల్లో తీసుకునేందుకు నిరాకరించారు. మరో స్కూల్‌కు వెళ్లి సంప్రదించగా నెలసరి వేతనం రూ.6 వేలు ఇస్తామని సెలవిచ్చారు. ఇది వీరిద్దరికి ఎదురైన సమస్య కాదు...ఇప్పుడు మహానగరంలోని వేలాది మంది ప్రైవేటు టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు టీచర్లకు ఉపాధి తిప్పలు తప్పడం లేదు. కరోనా వైరస్‌తో వేతనాలు కోతబడి, ఉద్యోగాలు కోల్పోయి బజారున పడగా, తాజాగా ప్రైవేటు విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. కరోనా నేపథ్యంలో తగ్గించిన వేతనాలను పెంచేందుకు, విధుల నుంచి తొలగించిన టీచర్లను తిరిగి చేర్చుకుంనేందుకు విద్యా సంస్థలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు తక్కువ జీతాలతో కొత్త వారిని భర్తీ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాథమిక తరగతుల టీచర్లకు రూ.ఐదు వేల నుంచి ఏడు వేల వరకు, ఉన్నత తరగతుల టీచర్లకు రూ.8 నుంచి 12 వేల వరకు వేతనాలు స్లాబ్‌గా నిర్ణయించి అమలు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో గతంలో ఉద్యోగాలు కొల్పోయిన టీచర్లు దిక్కుతోచక తక్కువ వేతనాలపై కూడా పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రైవేటుపై ఆసక్తి మొన్నటి వరకు సర్కారు స్కూల్స్‌లో విద్యా వాలంటీర్లుగా పనిచేసిన అభ్యర్థులు సైతం ప్రైవేటు స్కూల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలోబడులు మూతపడటంతో విద్యావాలంటీర్లు తొలగింపునకు గురయ్యారు. గత విద్యా సంవత్సరం ఆలస్యంగా పాఠశాలలు పునప్రారంభమైనా విద్యా వాలంటీర్ల భర్తీ జరగలేదు. దీంతో వీరంతా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ మరింత పెరిగింది. (క్లిక్: నెలలోనే 2,500 నకిలీ వేలిముద్రలు.. రూ. 40 లక్షలు హాంఫట్) బతుకులు ఆగం.. కరోనా కష్టకాలంలో ప్రైవేటు టీచర్ల బతుకులు ఆర్థికంగా చిధ్రమయ్యాయ. ఆర్ధిక కష్టాలు భరించలేక కొందరు తనువు చాలించగా, మరికొందరు భారంగా బతుకు బండిలాగిస్తున్నారు. మరికొందరు వలస వెళ్లారు. నెలవారి ఖర్చులు తగ్గించుకున్నా పూట గడవని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. కొందరు కూరగాయలు, పండ్ల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. బడ్జెట్ స్కూల్స్‌తో పాటు కార్పొరేట్ స్కూల్స్ టీచర్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. రోజంతా చాకిరీ చేయిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వేతనాలు మాత్రం పెంచడం లేదు. మరోవైపు పిల్లల నుంచి ఫీజులు దారుణంగా పెంచి వసూలు చేస్తున్నారు. -
వర్క్ ఫ్రమ్ హోం: జీతపు కోతలు.. అనూహ్య స్పందన
వర్క్‌ఫ్రమ్ హోం-ఆఫీస్ వ్యవహారంలో టెక్ కంపెనీలు-ఉద్యోగుల మధ్య హైడ్రామా నడుస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడంతో ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీలు అడుగుతుంటే.. ఉద్యోగాలైనా వదిలేసుకుంటాం తప్ప రాబోమంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు ఉద్యోగులు. ఈ తరుణంలో కంపెనీలు మాత్రం మొండిపట్టు వీడడం లేదు. ఒకవేళ రిమోట్ వర్క్‌కే పట్టుబడితే కట్టింగ్లు తప్పవని ఉద్యోగులకు కరాఖండిగా చెప్పేశాయి కూడా. ఈ తరుణంలో ఉద్యోగుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించిన నేపథ్యంలో.. జీతాల కట్టింగ్‌కు తాము సిద్ధమేనని గూగుల్ ఉద్యోగులు బదులిచ్చారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతి ఇస్తే.. కట్టింగ్‌లపై తమకూ ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని, కాకపోతే పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏడాదికి ఒకసారి ఇచ్చే హైకులను మాత్రం కొనసాగించాలంటూ వేల మంది ఉద్యోగుల నుంచి రిప్లై మెయిల్స్ వెళ్తున్నాయి గూగుల్‌కి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కండిషన్స్‌కు కంపెనీ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాబ్ లొకేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా లొకేషన్ టూల్ జీతభత్యాల చెల్లింపునకు గూగుల్ సిద్ధపడుతుండగా.. అందుకు కూడా తాము సిద్ధమేనని సమ్మతి తెలిపారు ఉద్యోగులు. ఇది చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: అమెజాన్ నిర్ణయం ఇది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌కి సుమారు లక్షా 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో గతంలో చాలామంది వర్క్‌ఫ్రమ్ హోం రిక్వెస్ట్‌లు పెట్టుకోగా.. కేవలం గత రెండు నెలల్లోనే సుమారు పది వేల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అర్జీలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో 85 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని గూగుల్ నిర్ణయించుకుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోం, రీ లొకేషన్ విజ్ఞప్తులు తిరస్కరణకు గురైన ఉద్యోగులు.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా గూగుల్ నిర్ణయించింది. ఇక గూగుల్ నుంచి ఈ స్పందన వచ్చిన వెంటనే.. మరికొన్ని టెక్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టగా.. ఉద్యోగుల నుంచి ఇలాంటి స్పందనే వస్తోంది. ఇదీ చదవండి: ఆఫీసులకు వెళ్తేనే కదా అసలు మజా! వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని భారం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ కరోనా వైరస్ భయం, ఉద్యోగాల్లో అభద్రతా భావం, ఎక్కువ సేపు ఇంట్లోనే గడిపే వీలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, డబ్బు సేవింగ్స్, ఇతర పనులు చక్కబెట్టుకునే వీలు!.. తదితర కారణాలతో కట్టింగ్లు అయినా సరే ‘వర్క్ ఫ్రమ్ హోం’కే ఉద్యోగులు మొగ్గుచూపిస్తున్నారు. ఇక డెల్టా వేరియెంట్ విజృంభణతో ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ను అక్టోబర్ 18 వరకు వాయిదా వేశాయి గూగుల్, యాపిల్ సహా ఇతరత్రా టెక్ కంపెనీలు. -
కరోనా వచ్చినా జీతం కట్ .. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
సాక్షి, మేడిపెల్లి(జగిత్యాల): పంచాయతీల్లో కార్యదర్శులు పాత్ర కీలకం. అభివృద్ధి పనులతోపాటు పారిశుధ్య, ఇతర పనులు పర్యవేక్షిస్తారు. పెరిగిన పని ఒత్తిడికి తోడు కరోనా సమయంలో సెలవులో ఉంటే జీతంలో కోత విధించడం మరింత ఆవేదనకు గురి చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఆరోగ్యభద్రతతోపాటు వందశాతం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అరకొర జీతం పల్లెప్రగతితోపాటు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, ఇంటిపన్నులు, ఇతర పన్నుల వసూళ్లు, ఇంటినిర్మాణ పనులతోపాటు ఇతర పనుల నిర్వహణ వీరిపైనే ఉంది. గతేడాది నుంచి ఉపాధి పనుల నిర్వహణతో కరోనా సోకిన వారి ఐసోలేషన్ సహా ఇతర ఏర్పాట్లు చూడడం వీరిపైనే పడింది. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించడం, మండల పరిషత్‌లో మీటింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి. ఏమైనా తేడా వస్తే వీరినే మొదటి బాధ్యుడిగా చేస్తూ మెమోలు జారీ చేస్తున్నారు. ఇంతచేస్తున్నా వారికి ఇచ్చే జీతం అరకొరే. ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. సెలవుపెడితే జీతం కట్ జిల్లాలో 380 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 107 మంది కార్యదర్శులు కరోనాబారినపడ్డారు. విధి నిర్వహణలో కోవిడ్‌బారిన పడుతున్నారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కరోనా సోకుతోంది. కోవిడ్ బారినపడ్డ వారు 15 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉండాల్సిందే. కానీ పంచాయతీ కార్యదర్శులు హోంక్వారంటైన్లో ఉంటే వారి జీతాలు కట్ చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు వచ్చే రూ.15వేల నుంచి సగం జీతం పోతే మిగిలేది రూ.7,500 మాత్రమే. కొన్ని మండలాల్లో మాత్రం ఎంపీడీవోలు మానవతా దృక్పథంతో కోవిడ్ వచ్చిన వారికి జీతాలు కట్ చేయక చెల్లిస్తున్నారు. ప్రభుత్వమే కోవిడ్ వచ్చిన వారికి మంచి చికిత్స చేయించడంతోపాటు జీతంలో కోతలేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యభద్రత కరువు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆరోగ్యభద్రత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన లేదా ఏ ఇతర అనారోగ్య సమస్యలతో చేరినా ఆరోగ్యభద్రత కార్డులు లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఆసుపత్రుల్లో చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా హెల్త్‌కార్డులు ఉంటే ఆర్థికంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు వందశాతం హాజరు కూడా వీరికి ఇబ్బందికరంగా మారింది. పని భారం పెరిగింది గతంతో పోల్చితే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏడాది నుంచి అదనంగా ఉపాధి పనుల నిర్వహణ అప్పగించడంతోపాటు కరోనా మహమ్మారితో పనిభారం పెరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హెల్త్‌కార్డులు లేకపోవడంతోపాటు పెంచిన జీతాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. – నవీన్‌రావు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల -
హెచ్1బీ వీసాలు... తక్కువ జీతాలిచ్చేందుకే!
వాషింగ్టన్: స్థానిక ఉద్యోగులకన్నా తక్కువ జీతాలిచ్చి పనిచేయించుకునేందుకే చాలా మటుకు అమెరికన్ సంస్థలు హెచ్1బీ వీసాల మార్గాన్ని ఉపయోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశాల నుంచి ఉద్యోగులను హెచ్1బీ వీసాలపై అత్యధికంగా నియమించుకునే టాప్ 30 సంస్థలపై ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఈపీఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిర్దిష్ట నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్1బీ వీసాలు ఉపయోగపడతాయి. అయితే, ఇలా నియమించుకున్న ఉద్యోగుల్లో దాదాపు 60 శాతం మందికి స్థానిక సగటు వేతనాల కన్నా కంపెనీలు తక్కువగా చెల్లిస్తున్నాయని ఈపీఐ పేర్కొంది. నిపుణులని చెబుతున్నా పెద్దగా నైపుణ్యాలు అవసరం లేని, తక్కువ జీతాలుండే లెవెల్ 1 (ఎల్1), లెవెల్ 2 (ఎల్2) స్థాయి ఉద్యోగాల్లో సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. లిస్టులో ఏడో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్.. సుమారు 77 శాతం మంది హెచ్1బీ ఉద్యోగులను ఎల్1, ఎల్2 స్థాయుల్లో నియమించుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న అమెజాన్‌డాట్‌కామ్ ఏకంగా 86 శాతం మంది హెచ్1బీ ఉద్యోగులను ఎల్1, ఎల్2 స్థాయిల్లో నియమించుకుంది. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లోనూ దాదాపు ఇదే ధోరణి ఉన్నట్లు ఈపీఐ పేర్కొంది. 2019లో 53,000 కంపెనీలు హెచ్1బీ వీసాలను వినియోగించుకున్నాయి. మొత్తం 3,89,000 దరఖాస్తులు ఆమోదం పొందగా ప్రతి నాలుగింటిలో ఒకటి .. టాప్ 30 హెచ్1బీ కంపెనీలకి చెందినదే ఉంది. -
19 సంవత్సరాలుగా జీవచ్ఛవాలుగా....
సాక్షి, కడప కల్చరల్ : కడప రాయుని సన్నిధిలో పని చేస్తున్న పదకొండు మంది చిరుద్యోగులు చాలీ చాలని జీతంతో బతుకులీడుస్తున్నారు. ఒకటి రెండు కాదు 19 ఏళ్లుగా నెలకు రూ. 5010ల జీతంతోనే జీవితం కొనసాగిస్తున్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల పరిధిలోకి వెళ్లినా ఫలితం లేక.. ఆ నిత్య దైవ సేవకులు కఠిన పేదరికంతో ‘ఏ దేవుడైనా కరుణించకపోతాడా!’ అన్న ఆశతో జీవచ్ఛవాలుగా కాలం గడుపుతున్నారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం 2006లో టీటీడీలో విలీనమైంది. ఆ నిర్ణయం ఆలయంలో పనిచేస్తున్న దిగువ స్థాయి ఉద్యోగులకు శాపంగా మారింది. 19 సంవత్సరాలుగా కేవలం రూ. 5 వేల జీతంతో కుటుంబా లను పోషించుకోలేక ఒక ఉద్యోగి ఆకలి చావుకు గురికాగా, ఇంకొకరికి మతి చలించింది. మరొకరు ఎటు వెళ్లిపోయారో తెలియదు. ఒక ఉద్యోగికి జబ్బు చేసి చికిత్స పొందే ఆర్థికస్థితి లేక మరణించారు. వీరి కుటుంబాలన్నీ ప్రస్తుతం రోడ్డున పడ్డాయి. ఎప్పుడైనా తమకు మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో ఈ ఆలయానికి చెందిన 11 మంది చిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కోర్టు సూచించినా.... తమకు టీటీడీ టైం స్కేల్ ఇవ్వాలని కోరుతూ ఈ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లగా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా సంబంధిత ఏ అధికారి ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలో ఇలాంటి విలీన ఆలయాల్లోనే మిగతా అందరూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చిన టీటీడీ తమను మాత్రం ఉపేక్షించడం ఎందుకో తెలియదని వాపోతున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన దేవదాయశాఖ ఉద్యోగులు ప్రస్తుతం మంచి హోదాలో రూ. 60 వేలకు పైగా జీతాలు తీసుకుంటూ ఉండగా...నిత్యం స్వామి, అమ్మవార్ల ఆరాధనలో గడుపుతున్న తాము మాత్రం ఉండీ లేని ఉద్యోగాలతో...కేవలం రూ. 5 వేలతో కుటుంబాలను లాక్కురాక చస్తూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే దిక్కు అడిగిన వారిని, అడగని వారిని కూడా అర్హతను బట్టి మంచి జీతాలు ఇచ్చి కొత్త ఉత్సాహం ఇస్తున్న కడప వాసి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే తమ కష్టాలను తొలగిస్తారని ఆశిస్తున్నట్లు దేవునికడప ఆలయ చిరుద్యోగులు తెలుపుతున్నారు. తమ ఆకలి బాధలను ఆయన తప్పక అర్థం చేసుకుని ఆదుకుంటారన్న నమ్మకం ఉందంటున్నారు. ఇన్నేళ్లు దైవ సేవలో గడిపిన తమను ఆదుకునేందుకు దేవుడే ఆయనను పంపినట్లు ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇలా జరిగింది... దేవునికడప ఆలయం దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉండేది. 2006లో టీటీడీ పరిధిలోకి వెళ్లింది. తమ జీవితాలు మరింత బాగుపడతాయని ఆలయ చిరుద్యోగులు సంతోషించారు. కానీ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా టీటీడీ గుర్తించలేదు. టైం స్కేల్ ఇవ్వలేదు. సొసైటీగా ఏర్పడితే ఔట్సోర్సింగ్ కింద గుర్తిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగాలను రెన్యూవల్ చేయించుకుంటూ నెలకు రూ. 5010 జీతంతో గడుపుతున్నారు. దేవునికడప ఆలయానికి సంబంధించి మొత్తం 11 మంది చిరుద్యోగులు ఉన్నారు. వారిలో పి.కృష్ణమూర్తి సీనియర్ అర్చకులు. తమను టీటీడీ ఉద్యోగులుగా గుర్తించాలని పలుమార్లు తిరుపతికి వెళ్లి అధికారులందరికీ మొర పెట్టుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకూ అర్జీలు ఇచ్చారు. జిల్లావాసి టీటీడీ చైర్మన్ అయినా ఫలితం లేకపోయింది. ఏ దేవుడూ వారిని కరుణించలేదు. ప్రస్తుతం తమ ఆశలన్నీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. -
వేతనం కోసం..వేదన
భీమవరం(పశ్చిమగోదావరి) : ఆటవీ శాఖ విభాగంలో నడిచే నర్సరీల్లో పనిచేస్తున్న వన సేవకులు, ఇతర సిబ్బందికి 8 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ విభాగంలో పనిచేసే ఈనర్సరీలకు ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తారు. ఆ నిధుల ద్వారా సిబ్బంది వేతనాలు, నర్సరీ అభివృద్ధి పనులు నిర్వహిస్తారు. అయితే ఈవిభాగానికి ఉపాధి హామీ పథకం నిధులు రాక గత 8 నెలలుగా వనసేవకులకు వేతనాలు అందడం లేదు. పట్టించుకోని గత ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా వన సేవకులు జీతాలు రాక అప్పులు చేసుకుని బతకాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వన సేవకుడికి సుమారు నెలకి రూ.8,800 వేతనం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారు రూ.70 వేల వరకు వేతన బకాయిలు అందాల్సి ఉంది. జిల్లాలో నర్సాపురం డివిజన్లో వీరవాసరం మండలం కొణితివాడ, నర్సాపురం మండలం సీతరామాపురం, రుస్తుంబాదు, యర్రంశెట్టివారి పాలెం,పెరవలి మండలంలోని కాకరపర్రు, మొగల్తూరు మండలంలంలో కేపీ పాలెంలో మొత్తం 7 నర్సరీలు ఉన్నాయి వాటిలో మొత్తం 10 మంది వరకు వన సేవకులు ఇతర సిబ్బంది ఉన్నారు. మట్టి పనులు చేసినవారికి అందని బిల్లులు ఈనర్సరీల్లోని మొక్కల అభివృద్ధి కోసం ఎర్రమట్టి తీసుకువచ్చి వాటిలో ఈమొక్కలు ఉంచి సంరక్షణ చేస్తారు. మట్టితోలకం పనులు కాంట్రాక్టర్లు చేశారు. వారికి బిల్లులు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తే వారికి బిల్లులు వస్తాయి. గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు వినియోగించుకోవడంతో వీరంతా నానా పాట్లు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వనసేవకులు కోరుతున్నారు. జిల్లాలో 40 నర్సరీలు జిల్లాలో∙40 నర్సరీలు ఉన్నాయి. వీటిలో 40 మంది వన సేవకులతో పాటు ఉపాధి కూలీలుగా పనిచేసిన సిబ్బంది నర్సరీకి 5 నుంచి 8 మంది చొప్పున ఉన్నారు. వీరికి ఉపాధి కూలీలకు ఇచ్చే విధంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు వన సేవకులుగా పనిచేస్తున్న మాకు 8 నెలలుగా జీతాలు రావడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. విధులకు రావడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఎనిమిది నెలల వేతనాలు ఇవ్వకపోతే ఏమి తిని బతకాలి. ఉన్నతాధికారులు పట్టించుకుని మాకు వెంటనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – డి.వెంకటేశ్వరరావు, వన సేవకుడు, కొణితివాడ నర్సరీ నిధులు విడుదల కావాల్సి ఉంది నర్సరీల్లో పనిచేసే సిబ్బందికి, నర్సరీల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చెల్లింపులు చేస్తారు. ప్రతి నెల సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనాలు మేము జనరేట్ చేస్తాము. నిధులు విడుదలయిన వెంటనే వారి ఖాతాకు జమవుతాయి. నిధులు విడుదలయిన వెంటనే వేతనాలు జమవుతాయి. – కె.శ్రీనివాసరావు, అటవీశాఖాధికారి, ఏలూరు -
10 వేలతో నెట్టుకొస్తున్నారు!
ఓ పక్క స్థూల జాతీయోత్పత్తి రేటు పెరుగుతున్నా మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య సైతం అదేస్థాయిలో ప్రమాదకరంగా పెరుగుతోంది. గత 20 ఏళ్లలో భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఢిల్లీలోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఉన్న సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2018 నివేదిక తేల్చింది. దేశంలో నిరుద్యోగుల స్థాయి క్రమంగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. జనాభాలో ప్రస్తుతం నిరుద్యోగ స్థాయి 5 శాతానికి పెరిగి ఆందోళన రేకెత్తిస్తోంది. ఇందులో అత్యధికంగా 16 శాతం చదువుకున్న యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది. మన దేశంలో గత 20 ఏళ్లలో నిరుద్యోగుల సంఖ్య అత్యధికంగా పెరిగిన సందర్భమిదేనని స్పష్టం చేసింది. చేతి నిండా పనేదీ! నిరుద్యోగ సమస్యకంటే పూర్తిస్థాయిలో పనిలేకపోవడం మన దేశాన్ని పట్టిపీడిస్తోంది. అంటే చేతినిండా పనిలేని కారణంగా అతి తక్కువ వేతనాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువత మన దేశంలో 16 శాతం ఉన్నట్లు తేలింది. ఉత్తరాదిలో నిరుద్యోగం ఎక్కువగా నమోదైంది. అయితే ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో నిరుద్యోగుల శాతం ఆ స్థాయిలో పెరగట్లేదని తేల్చింది. తక్కువ వేతనాలు.. సాధారణ జీవన ప్రమాణానికి సరితూగే వేతనాలు లేని పరిస్థితి దేశంలో ఉంది. అతి తక్కువ జీవన వేతనాల్ని మన స్త్రీ, పురుషులు పొందుతున్నారు. మనదేశంలో స్త్రీలలో 92 శాతం మంది, పురుషుల్లో 82 శాతం మంది నెలకు 10 వేల లోపే సంపాదిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 67 శాతం కుటుంబాల నెలసరి ఆదాయం 2015లో 10 వేలేనని తేల్చింది. జాతీయ పే కమిషన్ నిర్ణయించిన కనీస వేతనం 18 వేల కన్నా కూడా ఇది అతి తక్కువ. దురదృష్టవశాత్తూ 90 శాతం పరిశ్రమల్లో చివరకు సంఘటితరంగంలో సైతం అతి తక్కువ వేతనాలున్నట్లు ఈ నివేదిక తేల్చి చెప్పింది. అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు పొంతనలేని పరిస్థితులున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. 1970–80ల్లో స్థూలజాతీయోత్పత్తి రేటు 3 నుంచి 4 శాతంగా ఉన్నప్పుడు ఉపాధి వృద్ధిరేటు ఏడాదికి 2 శాతంగా ఉంది. 1990 నుంచి, ప్రధానంగా 2000 సంవత్సరం నుంచి జీడీపీ పెరుగుదల 7 శాతానికి చేరినా ఉపాధి వృద్ధి మాత్రం ఒక్కశాతం కంటే తక్కువే. జీడీపీ రేటు 10 శాతం పెరిగితే ఉద్యోగావకాశాలు మాత్రం ఒక్కశాతం అభివృద్ధినే సూచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. -
చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి
వేములవాడఅర్బన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక చేసేది ఏమీ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్సీల్లో 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారు. తమకు కనీస వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వన్ని కోరుతున్నారు. అప్పట్లో వీరిని ఎంపిక చేసి ఔట్ సోర్సింగ్‌పై నియమించారు. వీరు అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ విభాగం, కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేశారు. ఎమ్మార్సీ కార్యాలయంలో డేటా ఎంట్రీ మండల విద్యావనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల సమన్వయ కర్తలుగా నియామకమైన వీరు మండ కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల నెలవారీ వేతనాలతో పాటు పాఠశాలకు మంజూరయ్యే నిధులు, ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవోల అసిస్టెంట్లుగా ఉంటున్నా వీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. చాలీచాలని వేతనం.. పదేళ్ల క్రితం నియామకమైన వీరికి కనీస వేతనాల ఊసేలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మార్సీ కార్యాలయాల్లో అన్ని పనులు చేస్తుంటారు. కానీ వారికి వేతనం రూ.15 వేలు మించదు. దాంతో వారి కుటుంబాలు గడవక వీధిన పడే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. అయినా ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇవే.. ∙సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ∙ఏడాదికి 22 సెలవులు ఇవ్వాలి. ∙మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ∙రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తున్న జీవో నెం 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ∙ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు అందించాలి. ∙ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు, అలవెన్సులు కల్పించాలి. -
కష్టాల్లో కాంటింజెన్సీ ఉద్యోగులు
మునగాల (కోదాడ) : ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంటింజెన్సీ ఉద్యోగుల తలరాత మారడం లేదు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా.. వారిని పట్టించుకునే నాథులే లేకుండా పోయాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కంటే ముందుగా నియమితులైన తమను నేటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు కాంటింజెన్సీ ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో దాదాపు 2,500మందికి పైగా ఉద్యోగులు చాలీచాలని జీతాలతో బతుకుబండిని లాగిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం రూ.75ల వేతనంతో ఉద్యోగంలో చేరిన వీరికి ప్రస్తుతం నెలకు రూ.2వేలలోపు వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఈ వేతనంతో నెలంతా కుటుంబం గడవం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నైట్ వాచ్‌మన్, వాటర్‌మన్ లాంటి విధులు నిర్వర్తిస్తున్న వీరు వెట్టిచాకిరీ పేరుతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. జిల్లాలో 2,500మందిలో మునగాల మండలంలోనే దాదాపు 30మంది వరకు కాంటింజెన్సీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఉదయం నుంచి సాయింత్రం వరకు వివిధ కార్యాలయాల్లో రకరకాల పనులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేటర్ లేకపోయినప్పటీకీ వారి విధులను కూడా వీరే నిర్వర్తిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ సిబ్బంది, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు కాంటింజెన్సీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్న ఈ తరుణంలో చాలీచాలని వేతనాలతో పస్తులుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నామని.. అర్హత ఉండి ఏళ్ల తరబడి సర్వీసు ఉన్న తమను ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ట్రామాలో భారీ డ్రామా
► కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి ప్రేమ ► కొత్తగా చేరిన ఉద్యోగులకు వేతనాలెక్కువ ► అదే క్యాడర్లోని పాతవారికి అన్యాయం ట్రామాలో భారీ డ్రామా నడుస్తోంది.. కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వ సవతి ప్రేమ చూపుతోంది. íసీనియారిటీతో పని లేకుండా కొత్తగా చేరిన ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగా ఇస్తూ.. అదే క్యాడర్లో ఉన్న సీనియర్లకు అన్యాయం చేస్తోంది. ఇటీవల డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు విడుదల చేసిన నోటిఫికేషన్‌తో ఈ వ్యవహారం బయటపడింది. నెల్లూరు(అర్బన్): హైవేలపై ప్రమాదాలు జరిగినప్పుడు వారికి అత్యవసర సేవలు అందించేందుకు నెల్లూరులోని పెద్దాస్పత్రిలో ఏడేళ్ల క్రితం ట్రామా కేర్, ఐసీయూ యూనిట్ల ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాలపరిమితి తీరాక రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని అప్పట్లో ఒప్పందం జరిగింది. అప్పట్లో ట్రామాలో 65 మంది ఉద్యోగులు చేరారు. వీరిలో నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు, డ్రైవర్లు ఉన్నారు. జీతం రూ.12,900 మాత్రమే: అప్పట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరిన స్టాఫ్ నర్సులకు వేతనం ఇప్పటికీ రూ.12,900 మాత్రమే ఇస్తున్నారు. గత నెలలో పెద్దాస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై స్టాఫ్ నర్సులుగా చేరిన 198 మందికి రూ.15,000 ఇస్తున్నారు. సర్వీసు ఉండి, ఒకే చోట పని చేస్తున్నప్పటికీ పాత వారికి వేతనాల్లో అన్యాయం చేస్తున్నారు. డీసీహెచ్ నోటిఫికేషన్లోనూ అన్యాయమే: గత వారంలో పెద్దాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు, డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్ తదితర 51 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ పరిశీలిస్తే ల్యాబ్ టెక్నీషియన్లకు, డిజిటల్ టెక్నీషియన్లకు నెలకు రూ.21,000 జీతంగా నిర్ణయించారు. అయితే ఏడేళ్లుగా ట్రామా కేర్ యూనిట్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.11,500 ఇస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లో కొత్తగా చేరేవారికి మాత్రం రూ.21,000 ఇవ్వాలని నిర్ణయించడం, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి రూ.11,500 ఇవ్వడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం పెంచకుండా పనిచేయించుకుంటున్నారు: అన్ని శాఖల రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింప చేశారు. ట్రామా కేర్‌లో పనిచేసే వారికి మాత్రం లేదు. జీతం పెంచకుండా ఏళ్ల తరబడి పని చేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది. --- టి.మధు, బి.వెంకటేశ్వర్లు, ఆంబులెన్స్ డ్రైవర్లు ఎలా బతకాలో అర్థం కావడం లేదు: ట్రామా కేర్‌లో క్యాడర్‌ను బట్టి కేవలం రూ.7,200 నుంచి రూ.12,900 ఇస్తున్నారు. మాకు సీనియారిటీ ఉన్నప్పటికీ తక్కువ జీతాలు ఇస్తున్నారు. కొత్తగా చేరేవారికి ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఇంత తక్కువ జీతాలతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు.---షేక్.రఫీ, ట్రామాకేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి