డేటా ఎంట్రీ చేస్తున్న చిప్ప నవీన్ ఎమ్‌ఐఎస్ కో ఆర్డినేటర్..
వేములవాడఅర్బన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక చేసేది ఏమీ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్సీల్లో 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారు. తమకు కనీస వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వన్ని కోరుతున్నారు. అప్పట్లో వీరిని ఎంపిక చేసి ఔట్ సోర్సింగ్‌పై నియమించారు. వీరు అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ విభాగం, కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేశారు.
ఎమ్మార్సీ కార్యాలయంలో డేటా ఎంట్రీ
మండల విద్యావనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల సమన్వయ కర్తలుగా నియామకమైన వీరు మండ కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల నెలవారీ వేతనాలతో పాటు పాఠశాలకు మంజూరయ్యే నిధులు, ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవోల అసిస్టెంట్‌లుగా ఉంటున్నా వీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
చాలీచాలని వేతనం..
పదేళ్ల క్రితం నియామకమైన వీరికి కనీస వేతనాల ఊసేలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మార్సీ కార్యాలయాల్లో అన్ని పనులు చేస్తుంటారు. కానీ వారికి వేతనం రూ.15 వేలు మించదు. దాంతో వారి కుటుంబాలు గడవక వీధిన పడే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. అయినా ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
వారి డిమాండ్లు ఇవే..
∙సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
∙ఏడాదికి 22 సెలవులు ఇవ్వాలి.
∙మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
∙రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తున్న జీవో నెం 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
∙ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు అందించాలి.
∙ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు, అలవెన్సులు కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment