పాపం పసివాళ్లు
వెట్టిచాకిరీలో భారీగా పసివాళ్లు
నిన్న గాజుల కంపెనీలు... నేడు చీరలు, ప్లాస్టిక్ కంపెనీల్లో
వెలుగు చూస్తున్న వరుస ఉదంతాలు
పోలీసుల చొరవతో 238 మందికి విముక్తి బాలికలు సైతం
అదో కీకారణ్యం. వందలాది మంది పిల్లలు ఆ అరణ్యంలో కౄరమృగం లాంటి వ్యక్తి వద్ద వెట్టిచాకిరీ చేస్తుంటారు. రొట్టె ముక్కలనే ఆహారంగా వేస్తూ... వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడా వ్యక్తి. మరణం తప్ప... తప్పించు కోవడానికి మరో మార్గంలేని దుస్థితి ఆ చిన్నారులది.... సుమారు పాతికేళ్ల క్రితం చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలోని దృశ్యమిది. ప్రస్తుతం నగరంలో అదే తరహా దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. పాపం... పుణ్యం... ప్రపంచ ‘మార్గం’ తెలియని చిన్నారులు... కూటి కోసం... కూలి కోసం... గనులలో... కర్మాగారాలలో... వెట్టి చాకిరి అనే భూతం కోరల్లో చిక్కుకుంటున్నారు. బాల్యానికీ... బంధువులకు దూరంగా... ఆకలితో అలమటిస్తూ... బాధలతో దోస్తీ చే స్తున్నారు.
సిటీబ్యూరో: ‘మెరుపు మెరిస్తే... వాన కురిస్తే...ఆకశాన హ రివిల్లు విరిస్తే’... చిందులేయలేరు ఆ చిన్నారులు. ఆకలేస్తే అమ్మ దగ్గరకు వెళ్లి మారాం చేయలేని దైన్యం వారిది. జ్వరం వ స్తే అమ్మ కొంగు చాటున విశ్రాంతి తీసుకుంటూ... ఆమె ప్రేమగా ఇచ్చే మందు వేసుకోలేని దౌర్భాగ్యం వారిది. కనీసం తోటి పిల్లలకు సాయం చేద్దామన్నా వీలులేని దయనీయ స్థితి. కంటి నిండా నిద్ర పోవడానికి సైతం కుదరని హీన స్థితి. ఇదంతా వెట్టిచాకిరి ప్రభావం. అవును పసిపిల్లల వెట్టి చాకిరీకి పాతబస్తీ కేరాఫ్ అడ్రస్సుగా మారింది. చిన్నారుల రక్తాన్ని... శ్రమను అక్కడి వ్యాపారులు జలగల్లా పీల్చేస్తున్నారు. పోలీసుల వరుస దాడుల్లో వెలుగు చూస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనం. భవానీనగర్‌లో 14 గాజుల పరిశ్రమల్లో పని చేస్తున్న 216 మంది పిల్లలను ఇటీవల వెట్టి నుంచి రక్షించిన పోలీసులు... గురువారం కంచన్‌బాగ్‌లో చీరల తయారీ, ప్లాస్టిక్ కంపెనీల్లో పనిచేస్తున్న మరో 22 మందిని రక్షించారు. వీరిలో బాలికలూ ఉండడం గమనార్హం. పలకా బలపం పట్టాల్సిన పిల్లలను కారాగారాల్లాంటి కర్మాగారాల్లో బంధించి... రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయించుకుంటున్నారు. బీహార్ నుంచి పిల్లలను అక్రమ రవాణా చేస్తూ... ఇక్కడి వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టి... వారి బంగారు జీవితాన్ని నాశనం చేస్తున్నారు.
అనారోగ్యం పాలైనా పట్టించుకునే వారుండరు. తీవ్ర అస్వస్థతకు గురైతే వారిని తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులిపేసుకుంటారు. కార్మిక చట్టాలకు ఇవి కొన్ని యోజనాల దూరంలో ఉంటాయి. పని గంటల ‘లెక్క’లు అక్కరకు రావు. దాహంతో అలమటిస్తున్నా.... తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరు. ఇరుకైన గదుల్లో 20 మంది చొప్పున కుక్కేస్తున్నారు. పిల్లికూనల్లా ఒకరిపై ఒకరు ఒదిగి నిద్రపోవాల్సిందే. వారం రోజుల్లో పోలీసులు సుమారు 16 కంపెనీలలో వరుస దాడులు చేయడంతో వీరి కష్టాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. ఈ మాఫియా వెనుక సూత్రధారుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 24 మంది నిందితులను అరెస్టు చేశారు.
వెలుగులోకి రాని మరిన్ని కేంద్రాలు....
పాతబస్తీలో గల్లీగల్లీలో బాల కార్మికులు పని చేస్తుంటారు. బల పాలు, రంగుల తయారీ, గాజుల తయారీ, పతంగులు, విస్తరాకులు, దారాల తయారీ వంటి పరిశ్రమల్లో పిల్లలనే పనులకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా శాలిబండ, ముర్గిచౌక్, కోళ్ల ఫారాలు, కామాటిపుర, గాజుబండ, చాంద్రాయణగుట్ట, చందులాల్ బారాదరి, దూద్‌బౌలి, హుస్సేనీఆలం, పటేల్‌మార్కెట్, గుల్జార్‌హౌస్, మొగల్పురాలో ఈ వెట్టిచాకిరి ఎక్కువగా ఉంది. ఇక్కడి వ్యాపారులు సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటూ... ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శివార్లలోని పారిశ్రామిక వాడల్లో సైతం బాల కార్మికులతో పని చేయించుకుంటున్నట్లు తెలిసింది.
వ్యాపారుల క క్కుర్తి
పెద్ద వాళ్లను పనిలో పెట్టుకుంటే వారికి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వారు కేవలం 8 గంటలే పని చేస్తారు. యాజమాన్యాల మాట అన్నివేళలా చెల్లుబాటు కాదు. అదే చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే జీతాలు తక్కువ ఇవ్వవచ్చు, ఎక్కువ గంటలు పని చేయించుకోవచ్చుననేది వ్యాపారుల ఉద్దేశం. దీంతో వారు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా పిల్లలను తీసుకొచ్చి... వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. వారికి రోజుకు రూ.50 నుంచి రూ.150 వరకు చెల్లిస్తున్నారు.
నిందితుల్లో 20 మంది బీహారీలే...
భవానీనగర్ ఉదంతంలో పట్టుబడిన నిందితుల్లో 20 మందిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు నాంపల్లి కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ 14 కంపెనీల్లో 213 మంది బాలలతో వెట్టిచాకిరి చేయిస్తున్న కేసుల్లో 22 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వారిలో 20 మంది బీహారీలే కావడం గమనార్హం. నిందితుల్లో ఇద్దరు మాత్రమే భవానీనగర్‌కు చెందిన తండ్రీ కొడుకులైన వ్యాపారులు మహ్మద్ అక్రమ్ ఖాన్ (32), మహ్మద్ యాసీన్ ఖాన్ (62). ఇక పిల్లల విషయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, జార్ఖండ్‌కు చెందిన నలుగురు మినహా మిగతా వారంతా బీహార్ రాష్ట్రంలోని గయ, పాట్నా, నలందా జిల్లాలకు చెందిన వారు.
సూత్రధారుల కోసమే...
వెట్టిచారికి ఉదంతం వెనుక సూత్రదారులు ఎవరున్నారనే కోణంలో ఆరా తీసేందుకే నిందితులను కస్టడీ కోసం పిటిషన్ వేశామని పోలీసులు అంటున్నారు. పిల్లలను ఇతర దేశాలకేమైనా పంపించారా అనే విషయంపైనా ఆరా తీస్తామన్నారు. ఇతర జిల్లాలు, పట్టణాలకు చిన్నారులను అక్రమ రవాణా చేశారా? అనే విషయాలు త్వరలో వెలుగు చూస్తాయంటున్నారు. బీహార్‌కు చెందిన నిందితులను విచారిస్తే పిల్లలను ఎత్తుకొచ్చారా లేక తల్లిదండ్రుల ఇష్టంతో తీసుకొచ్చారా? అనేది తేలుతుందంటున్నారు. వారికి డబ్బులు ఎలా పంపిస్తున్నారు? బ్యాంకు అకౌంట్లు తదితర వివరాలు త్వరలో బయటికి వస్తాయని చెబుతున్నారు.
సీడబ్ల్యూసీ సమన్వయం
రామంతాపూర్‌లోని డాన్‌బోస్కో స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఇక్కడి చైల్డ్ వెల్ఫేరకమిటీ (సీడబ్ల్యూసీ)... బీహార్ సీడబ్ల్యూసీ అధికారులతో ఇప్పటికే సంప్రదించింది. మరోవైపు పిల్లల వయసు నిర్ధారణకు ఉస్మానియా వైద్యులకు పోలీసులు లేఖ రాశారు. త్వరలో ఉస్మానియా వైద్యులు పిల్లల వద్దకే వెళ్లి... వయసు నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి.