![Azadi Ka Amrit Mahotsav: Prohibition of East India Company Foreign Labor System - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/1/Labor-System.jpg.webp?itok=ePJ372hu)
1834లో ఓడ నుండి మారిషస్ ద్వీపాన్ని చూస్తున్న మొదటి భారతీయ కార్మికులు
1837 నాటి ఈస్టిండియా కంపెనీ ‘కార్మిక వలసల కొత్త విధానం’ పై బ్రిటన్‌లోను, భారతదేశంలోనూ బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్థాయిలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 1838 ఆగస్టు 1న భారతీయ కార్మికుల ఎగుమతి వ్యవహారంపై విచారణకు ఒక కమిటీని నియమించారు. కమిటీ నివేదిక అనంతరం 1839 మే 29న విదేశీ కార్మిక వ్యవస్థను నిషేధించారు. అలాంటి వలసలను చేపట్టే ఏ వ్యక్తి అయినా 200 రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షకు గురవుతాడు. నిషేధం తర్వాత కూడా, కొంతమంది భారతీయ కార్మికులను పాండిచ్చేరి (అప్పట్లో ఫ్రెంచ్ వారి అధీనంలో) మీదుగా మారిషస్‌కు పంపడం కొనసాగింది.
భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ బ్రిటిషు వారు 19 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఒక పరిమిత కాలానికి చేసుకునే ఒప్పందం ప్రకారం కార్మికులు పనిచేస్తారు కాబట్టి దీన్ని ఒప్పంద కార్మిక వ్యవస్థ అనే వారు. అది బానిసత్వం లాంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో పదహారు లక్షలకు పైబడిన సంఖ్యలో భారతీయులను శ్రామికులుగా వివిధ ఐరోపా వలస రాజ్యాలకు రవాణా చేశారు.
బ్రిటిషు సామ్రాజ్యంలో 1833లోను, ఫ్రెంచ్ వలస దేశాల్లో 1848 లోను, డచ్ సామ్రాజ్యంలో 1863 లోనూ బానిసత్వాన్ని నిర్మూలించిన తర్వాత ఈ వ్యవస్థ విస్తరించింది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ 1920 ల వరకు కొనసాగింది. నేడు కరిబియన్ దేశాలు, నాటల్ (దక్షిణాఫ్రికా), తూర్పు ఆఫ్రికా, మారిషస్, శ్రీలంక, మలేషియా, మయన్మార్, ఫిజీ వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సమాజం ఉందంటే దానికి మూలం ఈ కార్మిక వ్యవస్థే. ఇండో–కరిబియన్, ఇండో–ఆఫ్రికన్, ఇండో–ఫిజియన్, ఇండో–మలేషియన్, ఇండో–సింగపూర్ జనాభా పెరుగుదలకూ ఈ వ్యవస్థే దోహదం చేసింది.
ఈ వ్యవస్థలో ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా కూలీ అని పిలిచేవారు. వివిధ వలస దేశాల్లో వారి పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవి. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఒప్పందంలో నియమాలు ఉన్నప్పటికీ వాటిని పాటించేవారు కాదు. ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కూడా ఏదో విధంగా వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్లు. భారతదేశంలో కార్మికుల నియామకాల్లో కూడా అనేక అక్రమాలు జరిగేవి. తమ పని ఏమిటో, పని చెయ్యబోయేది ఎక్కడో వాళ్లకు చెప్పేవారు కాదు. ఓడ ఎక్కేముందు రేవు లోను, ఓడలోనూ వాళ్ల నివాస పరిస్థితులు అమానవీయంగా ఉండేవి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు బ్రిటిషు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ అక్రమాలు కొనసాగాయి. చివరికి దేశవ్యాప్తంగాను, బ్రిటన్‌లోను, ఇతర దేశాల్లోనూ ప్రజల నుండి వచ్చిన వత్తిడి కారణంగా 1917లో ఈ వెట్టి చాకిరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసారు.
Comments
Please login to add a commentAdd a comment