కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్‌లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్‌ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు.
మల్లేశం మాస్కులు ధరించి బైక్‌పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్‌పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్‌కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు.
హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ వివరించారు.
సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్‌కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్‌లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు.
ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్‌పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు.
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు..
ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్‌డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది.
పోలీసుల లుక్‌ఔట్ నోటీసు..
యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్‌పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్‌ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment