సాక్షి, మేడిపెల్లి(జగిత్యాల): పంచాయతీల్లో కార్యదర్శులు పాత్ర కీలకం. అభివృద్ధి పనులతోపాటు పారిశుధ్య, ఇతర పనులు పర్యవేక్షిస్తారు. పెరిగిన పని ఒత్తిడికి తోడు కరోనా సమయంలో సెలవులో ఉంటే జీతంలో కోత విధించడం మరింత ఆవేదనకు గురి చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఆరోగ్యభద్రతతోపాటు వందశాతం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
అరకొర జీతం
పల్లెప్రగతితోపాటు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, ఇంటిపన్నులు, ఇతర పన్నుల వసూళ్లు, ఇంటినిర్మాణ పనులతోపాటు ఇతర పనుల నిర్వహణ వీరిపైనే ఉంది. గతేడాది నుంచి ఉపాధి పనుల నిర్వహణతో కరోనా సోకిన వారి ఐసోలేషన్ సహా ఇతర ఏర్పాట్లు చూడడం వీరిపైనే పడింది. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించడం, మండల పరిషత్‌లో మీటింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి. ఏమైనా తేడా వస్తే వీరినే మొదటి బాధ్యుడిగా చేస్తూ మెమోలు జారీ చేస్తున్నారు. ఇంతచేస్తున్నా వారికి ఇచ్చే జీతం అరకొరే. ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అధ్వానంగా తయారైంది.
సెలవుపెడితే జీతం కట్
జిల్లాలో 380 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 107 మంది కార్యదర్శులు కరోనాబారినపడ్డారు. విధి నిర్వహణలో కోవిడ్‌బారిన పడుతున్నారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కరోనా సోకుతోంది. కోవిడ్ బారినపడ్డ వారు 15 రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందే. కానీ పంచాయతీ కార్యదర్శులు హోంక్వారంటైన్‌లో ఉంటే వారి జీతాలు కట్ చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు వచ్చే రూ.15వేల నుంచి సగం జీతం పోతే మిగిలేది రూ.7,500 మాత్రమే. కొన్ని మండలాల్లో మాత్రం ఎంపీడీవోలు మానవతా దృక్పథంతో కోవిడ్ వచ్చిన వారికి జీతాలు కట్ చేయక చెల్లిస్తున్నారు. ప్రభుత్వమే కోవిడ్ వచ్చిన వారికి మంచి చికిత్స చేయించడంతోపాటు జీతంలో కోతలేకుండా చేయాల్సిన అవసరం ఉంది.
ఆరోగ్యభద్రత కరువు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆరోగ్యభద్రత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన లేదా ఏ ఇతర అనారోగ్య సమస్యలతో చేరినా ఆరోగ్యభద్రత కార్డులు లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఆసుపత్రుల్లో చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా హెల్త్‌కార్డులు ఉంటే ఆర్థికంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు వందశాతం హాజరు కూడా వీరికి ఇబ్బందికరంగా మారింది.
పని భారం పెరిగింది
గతంతో పోల్చితే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏడాది నుంచి అదనంగా ఉపాధి పనుల నిర్వహణ అప్పగించడంతోపాటు కరోనా మహమ్మారితో పనిభారం పెరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హెల్త్‌కార్డులు లేకపోవడంతోపాటు పెంచిన జీతాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం.
– నవీన్‌రావు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment