Panchayat Secretaries
-
ఉద్రిక్తతల నడుమ ముగిసిన జేపీఎస్ సోనీ అంత్యక్రియలు
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి (జేపీఎస్) బైరి సోని(31) ఆత్మహత్య జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జేపీఎస్‌లు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 11 రోజుల నిరవధిక సమ్మేలో పాల్గొన్న తదనంతరం విధులకు హాజరైన తొలిరోజే పంచాయతీ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది సోనీ. అయితే ఉద్యోగ భద్రత లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని జేపీఎస్‌లు, కుటుంబసభ్యులు అంటుంటే, భర్త వేధింపుల వల్లే చనిపోయిందని పోలీసుల చెప్పడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె మృతి పలు అనుమానాలకి తావివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆఖరికి పోస్ట్‌మార్టం నిర్వహించి సోనీ మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్న సయమంలోనూ ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. బాధితురాలి అంబులెన్స్‌ని అడ్డుకుని జేపీఎస్‌లు నిరసనలు చేశారు. దీంతో పోలీసులు కూడా వెన్నక్కి తగ్గారు. ఈ ఉద్రికత్తల నడుమే సోనీ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఈ అంతిమయాత్రలో జేపీఎస్‌లు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జేపీఎస్‌లు గట్టిగా డిమాండ్ చేశారు. మృతురాలు పంచాయతీ కార్యదర్శి సోని అంతమ యాత్రలో మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి , కాంగ్రస్, బీజేపి నాయకులు తదితరలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, కుటుంబ కలహాలతో సోని ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న సోని కూతురికి ఉచిత విద్యను అందించడం తోపాటు కుటుంబ సభ్యులు సూచించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అధికారలు హామీ ఇచ్చారు. (చదవండి: సోని ఆత్మహత్య కలకలం.. ఊరుకో తాత.. నీ కుమార్తెను ఇక నేనే..) -
అగ్రిమెంట్ లోని అంశాలను గుర్తు చేస్తోన్న జేపీఎస్ లు
-
తగ్గేదేలే.. డెడ్‌లైన్ దాటినా సమ్మెలోనే జీపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మె కొనసాగుతోంది. కాగా, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా జీపీఎస్‌లు విధుల్లో చేరలేదు. ప్రభుత్వం హెచ్చరించినా తగ్గేదేలే అన్నట్టుగా జీపీఎస్‌లు సమ్మెలో ఉన్నారు. అయితే, కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేపీఎస్‌లు తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. గతంలో సమర్పించిన ఒప్పందాన్ని ఉల్లఘించవద్దని ఉద్యోగులకు చెప్పారు. ఇదిలా ఉండగా.. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. తమను రెగ్యులర్ చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. ఇక, రేపటి నుంచి కుటుంబ సభ్యులతో సమ్మెలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు. -
TS: ‘జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తప్పిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో, వారికి మంగళవారం సాయంత్రం 5గంటలలోపు విధుల్లోకి చేరాలని గడువు ఇచ్చింది. ఈ క్రమంలో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. తాజాగా జేపీఎస్‌ల సమ్మెకు కరీంనగర్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దుర్మార్గం. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదు. వెంటనే జేపీఎస్‌ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి’ అని సీరియస్ అయ్యారు. మరోవైపు, జేపీఎస్‌ల సమ్మెపై టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. జేపీఎస్‌లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! -
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల సమ్మె
-
జేపీఎస్‌లను రెగ్యులర్ చేయండి.. కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది. మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
పెళ్లయిన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ వధూవరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వివరాలివి. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం రామన్నపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి నాగుల శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక వివాహం బుధవారం కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగింది. పెళ్లితంతు అనంతరం వధూవరులిద్దరూ.. ‘జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి..’ అనే ప్లకార్డు ప్రదర్శించారు. (చదవండి: నో పార్కింగ్.. అయితే ఏంటి?) -
ఔట్సోర్సింగ్ సెక్రటరీలను విధుల్లోకి తీసుకోవాలి’
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం తొలగించిన ఔట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ ఔట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ 2018లో పరీక్ష రాసి మెరిట్ లిస్టుతోపాటు రోస్టర్ పద్ధతి ద్వారా ఎంపికైన 370 మంది జూనియర్ పం చాయతీ కార్యదర్శులను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిరుద్యోగులంతా రోడ్డుపై తిరుగుతుంటే రిటైర్మెంట్ అయినవారికి ఎక్కువ జీతాలిచ్చి నియమించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షురాలు అనసూర్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ హిమామ్ వల్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
వామ్మో ఆ యాప్.. మెడ మీద కత్తిరా బాబోయ్!
సాక్షి,కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నూతనంగా తీసుకొచ్చిన డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే అదనపు భారం మోస్తున్న తమకు ఈ యాప్ మెడ మీద కత్తిలా ఉందని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యంతో సహా పల్లె ప్రగతి పనుల పురోగతి నమోదు కోసం ప్రభుత్వం డీఎస్ఆర్ యాప్ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి పనులు పరిశీలన, వీధుల శుభ్రం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు ఇలా ప్రతి సమాచారాన్ని ప్రస్తుత డీఎస్ఆర్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఈ యాప్‌ను మార్చారు. కొత్త ఆప్షన్లను ఇందులో చేర్చారు. కొత్త డీఎస్ఆర్ ఆప్‌ను ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కాని చాలా మంది ఇంకా ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోలేదు. దీన్ని వినియోగించడానికి నిరాకరిస్తున్నారు. నేటి నుంచి దీన్ని వాడకంలోకి తేవాలని కోరుతుండగా, కొద్ది మంది మాత్రమే ఇన్స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి ఇది.. పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఉన్న యాప్‌ను తొలగించి కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి అనుసంధానం చేయాలి. ఇది ఈ కార్యాలయ, ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రోడ్లు వీధులు, తదితర ఐదు ఫొటోలు అప్లోడ్ చేయాలి. పాత తేదీని తీసిన ఫొటో అయితే అప్లోడ్ కాదు. పంచాయతీ కార్యదర్శులు ఖచ్చితంగా లోకేషన్లో ఉండి పనిచేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇది ప్రధానంగా ఇబ్బందికి కారణం. దీని ప్రకారం కార్యదర్శులు తప్పక ఉదయం 5 గంటలలోపు హాజరును యాప్‌లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా తెరచుకోదు. స్వీయా చిత్రం తీసుకుంటేనే హాజరు నమోదవుతుంది. తర్వాత డైయిలీ శానిటేషన్ రిపోర్టును ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అదనపు పనిభారంతో సతమతమవుతున్న తమకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. సిగ్నల్స్ రాని వారి పరిస్థితి? కొత్త విధానంతో కార్యదర్శులు సంకట స్థితిలో పడ్డారు. కార్యదర్శులు అందరూ స్థానికంగా నివాసం ఉండడం లేదు. నివాసిత ప్రాంతానికి దూరంగా ఉన్నా పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము లేచి బయలుదేరితే తప్పా 5 గంటల్లోపు కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇక మహిళా కార్యదర్శులు ఇక్కట్లకు గురికావాల్సిందే. వేళాపాళా లేకుండా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి రావడంతో లోలోనా కుమిలిపోతున్నారు. జిల్లాలో సెల్‌ఫోన్ సంకేతాలు సరిగా అందని పంచాయతీలు దాదాపు 200 వరకూ ఉన్నాయి. అక్కడ ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ విధానం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.కొత్తయాప్‌ను మెడ మీద కతిక్తలాంటిదని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు పనులు తామే చేస్తున్నామని, పాఠశాలల్లో స్వీపర్లను తొలగించడంతో తమ సిబ్బంది ద్వారా పనిచేయించాల్సి వస్తుందని అంటున్నారు. ఊర్లో అన్ని సమస్యలు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. నాయకులు, పై స్థాయి అధికారులు వచ్చినా ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌లో పేర్కొన్న నిబంధనలు మార్చాలని విన్నవిస్తున్నారు. చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే.. -
కరోనా వచ్చినా జీతం కట్ .. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
సాక్షి, మేడిపెల్లి(జగిత్యాల): పంచాయతీల్లో కార్యదర్శులు పాత్ర కీలకం. అభివృద్ధి పనులతోపాటు పారిశుధ్య, ఇతర పనులు పర్యవేక్షిస్తారు. పెరిగిన పని ఒత్తిడికి తోడు కరోనా సమయంలో సెలవులో ఉంటే జీతంలో కోత విధించడం మరింత ఆవేదనకు గురి చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఆరోగ్యభద్రతతోపాటు వందశాతం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అరకొర జీతం పల్లెప్రగతితోపాటు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, ఇంటిపన్నులు, ఇతర పన్నుల వసూళ్లు, ఇంటినిర్మాణ పనులతోపాటు ఇతర పనుల నిర్వహణ వీరిపైనే ఉంది. గతేడాది నుంచి ఉపాధి పనుల నిర్వహణతో కరోనా సోకిన వారి ఐసోలేషన్ సహా ఇతర ఏర్పాట్లు చూడడం వీరిపైనే పడింది. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించడం, మండల పరిషత్‌లో మీటింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి. ఏమైనా తేడా వస్తే వీరినే మొదటి బాధ్యుడిగా చేస్తూ మెమోలు జారీ చేస్తున్నారు. ఇంతచేస్తున్నా వారికి ఇచ్చే జీతం అరకొరే. ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. సెలవుపెడితే జీతం కట్ జిల్లాలో 380 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 107 మంది కార్యదర్శులు కరోనాబారినపడ్డారు. విధి నిర్వహణలో కోవిడ్‌బారిన పడుతున్నారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కరోనా సోకుతోంది. కోవిడ్ బారినపడ్డ వారు 15 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉండాల్సిందే. కానీ పంచాయతీ కార్యదర్శులు హోంక్వారంటైన్లో ఉంటే వారి జీతాలు కట్ చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు వచ్చే రూ.15వేల నుంచి సగం జీతం పోతే మిగిలేది రూ.7,500 మాత్రమే. కొన్ని మండలాల్లో మాత్రం ఎంపీడీవోలు మానవతా దృక్పథంతో కోవిడ్ వచ్చిన వారికి జీతాలు కట్ చేయక చెల్లిస్తున్నారు. ప్రభుత్వమే కోవిడ్ వచ్చిన వారికి మంచి చికిత్స చేయించడంతోపాటు జీతంలో కోతలేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యభద్రత కరువు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆరోగ్యభద్రత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన లేదా ఏ ఇతర అనారోగ్య సమస్యలతో చేరినా ఆరోగ్యభద్రత కార్డులు లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఆసుపత్రుల్లో చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా హెల్త్‌కార్డులు ఉంటే ఆర్థికంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు వందశాతం హాజరు కూడా వీరికి ఇబ్బందికరంగా మారింది. పని భారం పెరిగింది గతంతో పోల్చితే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏడాది నుంచి అదనంగా ఉపాధి పనుల నిర్వహణ అప్పగించడంతోపాటు కరోనా మహమ్మారితో పనిభారం పెరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హెల్త్‌కార్డులు లేకపోవడంతోపాటు పెంచిన జీతాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. – నవీన్‌రావు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల -
పంచాయతీ ప్రెసిడెంట్ అయిన స్వీపర్!
స్వీపర్‌గా పంచాయతీ కార్యాలయ గదుల్ని శుభ్రం చేసిన ఆనందవల్లి చేతులు ఇకపై పంచాయతీ ప్రెసిడెంటుగా శుభ్రమైన పాలనను అందివ్వబోతున్నాయి. పదేళ్లుగా ప్రతిరోజూ పఠాన్‌పురం పంచాయతీలోని ‘ఆ’ బ్లాకును శుభ్రం చేస్తున్నారు అనందవల్లి. స్వీపర్ ఆమె తాత్కాలిక ఉద్యోగి. ఆమె శుభ్రం చేసే బ్లాకులోనే పంచాయతీ ప్రెసిడెంట్ కుర్చీ ఉంటుంది. మంగళవారం ఆమె తన స్వీపర్ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె గురువారం నుంచీ ఆ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబోతున్నారు! అవును. స్వీపర్ ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. అసలిదంతా ఆమె ఊహించని, ఊహించలేని విధంగా జరిగింది. ‘కొంచెం భయంగా ఉంది’ అంటున్న ఆనందవల్లి, ‘కష్టపడి పని చేస్తాను’ అని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఆమె ఆత్మవిశ్వాసం కేరళ, కొల్లం జిల్లాలోని ఆ పఠాన్‌పురం పంచాయతీకి కొత్త వెలుగులు తేబోతున్నదన్న నమ్మకం కలిగిస్తోంది. స్వీపర్ ఏంటి! పంచాయతీ ప్రెసిడెంట్ అవడం ఏంటి! ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతే ఇది. పఠాన్‌పురం పంచాయతీ.. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించిన సీటు. మొత్తం 13 వార్డులు ఉన్నాయి. వాటిల్లో తలవూరు వార్డు నుంచి ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ అభ్యర్థిగా కాక.. ఎస్సీ, ఎస్టీ జనరల్ ఆభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆనందవల్లి. సీపీఐ (ఎం) పార్టీ సభ్యత్వం ఉండటంతో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అభ్యర్థిగా సీపీఐ(ఎం) ఆమెను తలవూరు వార్డుకు నిలబెట్టింది! పదమూడు సీట్లలో ఎల్డీఎఫ్కు ఏడు సీట్లు, ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు (యూడీఎఫ్) ఆరు సీట్లు లభించాయి. మెజారిటీ సీట్లున్న పార్టీలోని వార్డు మెంబరుగా ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆనందవల్లి భర్త మోహనన్ పెయింటర్. ఆయన కూడా సీపీఐ(ఎం) స్థానిక కమిటీ సభ్యుడే. ఇద్దరు పిల్లలు. మిథున్, కార్తీక్. స్కూల్లో చదువుతున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో స్వీపర్‌గా చేరినప్పుడు మొదట ఆనందవల్లి జీతం రెండు వేలు. తర్వాత మూడు వేలు, తర్వాత ఆరు వేలు అయింది. పార్టీ సభ్యుల సహకారంతో ఈ కొత్త బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెబుతున్నారు. (2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు) -
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
దోమకొండ: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరి చేసి ఖాళీ స్థలాన్ని డాక్యుమెంట్ చేసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ సోమవారం తెలిపారు. పంచాయితీ కార్యదర్శి తన సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు. గ్రామానికి చెందిన నందాల ఈశ్వరవ్వ అనే మహిళకు చెందిన 130 గజాల స్థలాన్ని ఆగస్టు 24న బొడపుంటి రవి అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో పంచాయతీ ధ్రువీకరణ పత్రంతో పాటు, కార్యదర్శి స్టాంప్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తమ విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు సదరు డాక్యుమెంట్‌ను రద్దు చేసినట్లు సబ్ రిజిస్ట్రర్ స్వామిదాస్ తెలిపారన్నారు. నిందితుడ బొడపుంటి రవితో పాటు నందాల ఈశ్వరవ్వపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలి
సాక్షి, ములుగు: పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోలు రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జాతీయ రహదారి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం డీఆర్వో కూతాటి రమాదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తట్టుకోలేక నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటమండలం గుమ్మడిగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గురువారం ఆత్మహత్య చేసుకుందన్నారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు పేస్కేల్ , ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న స్రవంతి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్సిగ్రేషియ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కొండల్‌రెడ్డి, చిరంజీవి, ఇమ్మడి దామోదర్ ఆయా గ్రామల పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
కొలువిచ్చారు సరే.. జీతాలు మరీ..?
సాక్షి, నేలకొండపల్లి: మూడునెలలుగా జీతం రాక కొత్తగా కొలువులో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 422 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఏప్రిల్ 12న విధుల్లో చేరారు. వారు విధుల్లో చేరి మూడునెలలు దాటింది. అయినా ఇంకా ఒక్కసారి కూడా జీతం పొందలేదు. ఎప్పుడు వస్తోందో అన్నసమాచారం కూడా లేదు. దీంతో వారి రోజు వారి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోంది. రవాణా, కార్యాలయ నిర్వహణ.. ప్రతీ రోజు 10 నుంచి 20కిలో మీటర్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాలంటే రవాణా ఖర్చు, దానికి అదనంగా పంచాయతీ కార్యాలయానికి అవసరమైన స్టేషనరీ ఖర్చులను కూడా పంచాయతీ కార్యదర్శులే భరించాలి. ప్రభుత్వ కొలువొచ్చిందని సంబరపడ్డ యువకులకు ఈ ఉద్యోగం కొత్త ఆర్థికకష్టాలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. గ్రాంట్ విడుదలైంది.. జిల్లాలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలకు సంబంధించిన గ్రాంటు ప్రభు త్వం విడుదల చేసింది. ఎంపీడీఓల ద్వారా వారికి వేతనాలు అందించే ఏర్పాట్లు చేశాం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. – సుధీర్‌కుమార్, ఏఓ, జిల్లా పంచాయతీ కార్యాలయం -
వీళ్లకు జీతాలు అందేదెన్నడో ?
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి కేవలం 112 మంది కార్యదర్శులు మాత్రమే ఉండగా ఏప్రిల్ 11న కొత్తగా 294 మంది జూనియర్ కార్యదర్శులు విధుల్లో చేరారు. అంతకు ముందు ఒక్కో కార్యదర్శికి రెండు నుంచి నాలుగు గ్రామాల బాధ్యతలు ఉండగా ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాకతో 55 గ్రామాలకు మినహా జిల్లాలోని అన్ని పంచాయతీలకు కార్యదర్శులున్నారు. అయితే గ్రామ పరిపాలనను గాడిన పెట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి రెండు నెలలు దాటినా వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉద్యోగం వచ్చిందని సంతోషంలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెండునెలలు దాటినా వేతనాలు అందడం లేదు. ఏప్రిల్ 11న నియామక ఉత్తర్వులు అందుకుని మరుసటి రోజునే విధుల్లో చేరిన వారు కొత్త ఉత్సాహంతో పనిచేశారు. గ్రామాల్లోనే నివాసం ఉంటూ విధుల్లో నిమగ్నమయ్యారు. విధుల్లో చేరినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్నారు. తాజాగా తెలంగాణకు హరితహారం, ఇంకుడు గుంతల తవ్వకాలు, వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ వారికి వేతనాలు రాకపోవడంతో ఇంటిఅద్దె, కుటుంబ పోషణ ఖర్చులతో పాటు ఈ నెలలో పిల్లలకు పాఠశాలల ఖర్చులు మరింత పెరిగి ఆవేదనకు గురవుతున్నారు. ఎలాగూ వేతనాలు వస్తాయనే ఆశతో అప్పులు చేయక తప్పడం లేదని వారు వాపోతున్నారు. ఇంకా మొదలుకాని ప్రక్రియ.. వేతనాల చెల్లింపునకు ముందు ఉద్యోగులకు ఎం ప్లాయిమెంట్ ఐడీ తయారు చేసుకోవాల్సి ఉం టుంది. ఈ వివరాలను జిల్లా పంచాయతీ కార్యాలయానికి, ట్రెజరీకి పంపితేనే వేతనాల చెల్లింపునకు వీలుంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ మండలంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో వేతనాల చెల్లింపు మరింత ఆలస్యమవుతుందని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వివరాలు పంపించాలని ఉన్నతాధికారుల నుంచి తమకెలాంటి ఆదేశాలు అందలేదని ఎంపీడీవోలు చెబుతున్నారు. -
ఊరిలోనే పెళ్లి రిజిస్ట్రేషన్..
సాక్షి, వనపర్తి: ఇప్పటి వరకు వివాహా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రజల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పు లు చేసింది. ఇకపై వివాహం జరిగిన పంచాయతీలోనే కార్యదర్శితో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయంపై అవగాహన కల్పిం చేందుకు శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు జిల్లా వెల్పేర్ అధికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళా శక్తి కేంద్రం మహబూబ్‌నగర్ కో–ఆర్డినేటర్ అరుణ మారిన నిబంధనలు, పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునే అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో పెళ్లిళ్ల రిజిస్ట్రార్‌గా కలెక్టర్, అదనపు రిజిస్టార్‌గా జిల్లా సంక్షేమ అధికారి పని చేస్తారని చెప్పారు. 30రోజుల్లో అయితే ఉచితంగానే.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా సంబంధిత పంచాయతీ కార్యద ర్శితో పెళ్లి కుమారుడుగాని, పెళ్లికూతురుగాని ఎవరి తల్లితండ్రులైనా.. కార్యదర్శి వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఇవ్వాలి. ఈ దరఖాస్తుపై ఇరుపక్షాల సాక్షులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు వయస్సు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కార్యదర్శి పంచాయతీ కార్యాలయంలో పెళ్లిళ్ల రిజిస్టర్లో నమోదు చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ. 100ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన పెళ్లిల వివరాలు మున్సిపల్ కమిషనర్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చట్టబద్దత ఉంటుందన్నారు. కుటుంబానికి వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలు ఈ రిజిస్ట్రేషన్ ఎంతో దోహదపడుతుంది. కార్యక్రమంలో జిల్లా వెల్పేర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షా కేంద్రం అడ్రస్ సరిగా లేకపోవడంతో..
సాక్షి, విశాఖపట్నం: అభ్యర్థుల హాల్ టిక్కెట్‌పై అడ్రస్ సరిగా లేకపోవడంతో సుమారు 150 మంది ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆదివారం పరీక్ష రాయలేకపోయారు. హాల్ టికెట్ వెనక తిమ్మాపురం ఆదర్శ కాలేజీ అని ఉండటంతో భీమిలి రోడ్‌లోని తిమ్మాపురం పరీక్షా కేంద్రానికి కొంత మంది అభ్యర్థులు వెళ్లారు. అక్కడ అధికారులు మీది ఈ పరీక్షా కేంద్రం కాదని చెప్పడంతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు అవాక్కయ్యారు. అసలు రాయాల్సిన పరీక్షా కేంద్రం ఎస్.రాయవరం మండలం తిమ్మాపురంలో ఉందని తెలియడంతో వారికి ఏడుపు ఒక్కటే తక్కువైంది. అధికారుల తప్పిదానికి తాము బలికావాల్సి వచ్చిందని ఆ పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయం లేదు కాబట్టి తమకు ఇదే సమయానికి ఇక్కడే పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. స్థానికంగా తాము నిర్ణయం తీసుకోలేమని, ఇది ఉన్నాతాధికారులు తీసుకోవాల్సిన విషయం అని అక్కడి అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-3 కేటగిరీలో 1,051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) జరిగింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు 13 జిల్లాల్లో 1,320 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30 వరకు పరీక్ష సమయంగా నిర్ణయించారు. -
చెక్‌పవర్ ఏదీ?
పాపన్నపేట (మెదక్) : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉండాలి. కానీ పదవి చేపట్టి రెండు నెలలు గడిచినా చెక్ పవర్‌పై స్పష్టత లేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. నిధులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు జనాభా ప్రాతిపదికన రూ.17,12,71,000 పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. నిధులు మంజూరైనా .. చెక్కుపై రెండో సంతకం ఎవరు పెట్టాలన్న విషయంపై ఇంతవరకు స్పష్టత లేక పోవడంతో చిక్కు వచ్చి పడింది. జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. 2018 జూలై నాటికి పాత సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో 2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. అప్పట్లో గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్పెషల్ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. జనవరి 2019లో గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. చెక్కుపై రెండో సంతకమే చిక్కు .. 2018 ఏప్రిల్ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలన్న నిబంధనలు పొందు పరిచారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త నిబంధన అమలు కాదని అదే నెలలో సర్కార్ ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు ఎప్పటి మాదిరిగా పంచాయతీ కార్యదర్శుల జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటిపోయినా పంచాయతీ నిధుల నుంచి రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్‌లు వాపోతున్నారు. నిధుల వరద.. తీయలేమనే బాధ ఈఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.17,12,71,000 మంజూరయ్యాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలుండగా 7,67,428 జనాభా ఉంది. ఒక్కొక్కరికి రూ.259 చొప్పున నిధులు సంబంధిత పంచాయతీ ఖాతాల్లో పడ్డాయి. ఈ మేరకు వీటి నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా, మోటార్ల కొనుగోలు, రిపేర్లు, వీధి దీపాల నిర్వాహణ, కొనుగోళ్లు, అంతర్గత రోడ్లు తదితర పనులు చేపట్టొచ్చు. ఎండలు మండుతుండడంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మురికి కాల్వలు, విద్యుత్ దీపాల ఏర్పాటు అత్యవసరం కావడంతో చాలామంది సర్పంచ్‌లు సొంతంగా ఖర్చు చేసి పనులు చేయించారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. గతంలో 2018లో స్పెషల్ ఆఫీసర్లు పదవీ బాధ్యతలు చేపట్టగానే అదే సంవత్సరం ఆగస్టులో పంచాయతీరాజ్ కమిషనర్ ఒక ఉత్తర్వు ఇస్తూ.. ప్రత్యేక అధికారి, కార్యదర్శి సంతకాలను అనుమతించా లంటూ స్పష్టత ఇచ్చారని సర్పంచ్‌లు అంటున్నారు. ప్రస్తుతం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అప్పటి లాగానే సర్పంచ్‌తో పాటు కార్యదర్శులకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. గత మార్చి తోనే ఆర్థిక సంవత్సరం ముగిసినందున అప్పు చేసి పనులు చేసిన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. స్పష్టత ఇవ్వాలి సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4 లక్షల పనులు చేపట్టాం. చెక్కు వివాదంతో బిల్లులు రావడం లేదు. పంచాయతీరాజ్ శాఖ స్పందించి ఏదో ఒకటి తేల్చాలి. వేసవి కాలం కావడంతో తాగునీటి సరఫరాపై ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఇబ్బంది కలుగకుండా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. – పి.బాపురెడ్డి, సర్పంచ్, మల్లంపేట త్వరలోనే పరిష్కారం.. గ్రామ పంచాయతీ చెక్కుపై జాయింట్ పవర్ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. అందుకే బిల్లులు పాస్ కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏర్పడింది. దానికనుగుణంగా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. – హనూక్, జిల్లా పంచాయతీ అధికారి -
నిపుణుల కమిటీ చేతుల్లోకి ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షపై తలెత్తిన వివాదంపై నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదే శించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్‌లో ఇచ్చిన 14 ప్రశ్నలతో పాటు, తప్పుగా ఉన్నాయని వివాదం రేగిన 9 ప్రశ్నల విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నిపుణుల కమిటీ అవసరమని స్పష్టం చేసింది. పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్న ప్రశ్నలన్నింటినీ ఈ కమిటీకి నివేదించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసిం ది. అలాగే తుది ‘కీ’ని కూడా ఆ కమిటీ ముందుంచాలంది. నిపుణుల కమిటీ వెలువరించే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే, గిరిజన ప్రాంతాల్లోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 100% గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని, ఆ తర్వాత కూడా ఖాళీలు ఏర్పడితే వాటిని గిరిజన అభ్యర్థులతో భర్తీ చేసే నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీన్ని హైకోర్టు రికార్డ్ చేసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తుది ‘కీ’లో పలు తప్పులున్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఇచ్చారని, అదే విధంగా 9 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయంటూ మరికొంత మంది అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 100% గిరిజనులతోనే భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారించారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కమిటీ ఏర్పాటు ద్వారా మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నారు. గిరిజ ప్రాంతాల్లోని పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం తరపు న్యాయవాది సంజీవ్‌కుమార్ ఇచ్చిన హామీని న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల పరీక్షపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను పరిష్కరించారు. -
పంచాయతీ నిధులు పక్కదారి.. సర్పంచ్ చేతివాటం..
సాక్షి, కైకలూరు: పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. అక్రమార్కులకు అధికారం అండదండలు ఉండటంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావటం లేదు. దీనికి తోడు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్షల నిధులు స్వాహ అవుతున్నాయి. జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో నిధులు గోల్మాల్ అవుతున్నాయి. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదును పంచాయతీకి జమ చేయకపోవడం, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి బిల్లులు పొందడం, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పేరుతో నగుదు కాజేయడం, జిల్లా అధికారుల ఖర్చుల పేరుతో నకిలీ బిల్లులతో నగదు పొందడం వంటి పలు రూపాల్లో పంచాయతీ సొమ్మును కొందరు దిగమింగుతున్నారు. పలువురు సర్పంచ్‌లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్పలంగా ఉండటంతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో అక్రమార్కుల పదవీ కాలం ముగిస్తోంది. భుజబలపట్నం పంచాయతీలో నిధులు స్వాహా కైకలూరు మండలంలో భుజబలపట్నం మేజర్ పంచాయతీలో ఒకటి. పంచాయతీల వనరుల రూపంలో ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. పంచాయతీలో జరిగే అవకతవకలపై గ్రామానికి చెందిన మంతెన రామ్మూర్తిరాజు పదేళ్ల కాలంలో జరిగిన నిధుల వినియోగంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు. దీంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. పంచాయతీ నుంచి డీఎల్పీవో వాహనానికి రూ.17,000 చెల్లించినట్లు ఉంది. ఇవే కాకుండా పలు బిల్లుల్లో తేడాలు ఉన్నాయి. ఈ ఘటనపై మచిలీపట్నం డీఎల్పీవో విచారణ చేసి ఈ నెల 11న పంచాయతీ నిధులు రూ.1,63,516.. ఆర్థిక సంఘం నిధులు రూ.1,39,074 వెరసి రూ.3,02, 590 దుర్వునియోగం అయినట్లు గుర్తించారు. సర్పంచ్‌లకు నోటీసులు భుజబలపట్నం పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మాజీ సర్పంచ్‌లకు, అధికారులకు పంచాయతీశాఖ జిల్లా అధికారులు నోటీసులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు రూ.1,51,295, మాజీ సర్పంచ్ సయ్యపురాజు గుర్రాజు రూ.23,039, మరో మాజీ సర్పంచ్ బి.రామలక్ష్మీ రూ.1,04,087, పూర్వ పంచాయతీ ప్రత్యేకాధికారి హెప్సిబారాణి రూ.24,169 నిధులను చెల్లించాలని నోటీ సులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులు సదరు నగదును చెల్లించాలని నోటీసులో సూచించారు. ఇవే కాకుండా కైకలూరు నియోజకవర్గ పరిధిలో కైకలూరు, కలిదిండి, గుర్వాయిపాలెం, కోరుకొల్లు, వైవాక, దేవపూడి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణలు జరిగాయి. సొమ్ము రికవరీ చేస్తాం భుజబలపట్నం పంచాయతీలో రూ.3,02,590 నిధులు దుర్వినియోగం అయినట్లు మచిలీపట్నం డీఎల్పీవో విచారణలో తేలింది. అందుకు బాధ్యలైన అందరికి నోటీసులు అందించడం జరిగింది. సదరు వ్యక్తుల నుంచి నగదును రీకవరీ చేసుకుంటాం. పంచాయతీ రికార్డులు ఖచ్చితంగా పారదర్వకతతో నిర్వహించాలి. – అరుణ్‌కుమార్, ఈవోపీఆర్డి, కైకలూరు. -
నిరుద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపుకబురు అందించింది. 9355 జూనియర్ పంచాయితీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 10గా నిర్ధారించారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం https://tspri.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. -
పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాల విడుదల
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్, జిల్లా పరిషత్‌లోని నోటీసు బోర్డులో ఉంచారు. మొత్తం 164 పోస్టులకు గాను దాదాపు 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ర్యాంకులను కేటాయించి 1:2 నిష్పత్తి ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు 328 మంది అభ్యర్థులకు పోస్టు ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. ఓసీ కేటగిరీ జనరల్‌కు 48 పోస్టులు రిజర్వు కాగా, వీటిలో 26 మంది బీసీలు మంచి మార్కులు సాధించారు. ఓసీ మహిళకు 26 పోస్టులు రిజర్వు కాగా, వీటిలో కూడా 16 మంది బీసీ మహిళలు మంచి మార్కులు సాధించారు. దీంతో ఆయా విభాగాల్లోని అభ్యర్థులు కొంతమేర ఉత్కంఠకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ఎంపిక కోసం జూన్ 5వ తేదీన ఓసీ జనరల్, మహిళ, బీసీ (ఏ) జనరల్, మహిళా అభ్యర్థులకు, 6వ తేదీన మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించిన జీరాక్స్ కాపీలు, పాస్‌పోర్టు సైజు ఫోటోలను తీసుకొని రావాలని జెడ్పీ సీఈఓ ఏ సూర్యప్రకాష్ సూచించారు. కేటాయించిన రిజర్వేషన్ : ఓసీ జనరల్‌కు 48, ఓసీ మహిళకు 26, బీసీ (ఏ) జనరల్‌కు 8, మహిళకు 4, బీసీ (బీ) జనరల్‌కు 9, మహిళకు 6, బీసీ (సీ) జనరల్‌కు 2, బీసీ (డీ) జనరల్‌కు 7, మహిళకు 4, బీసీ (ఈ) జనరల్‌కు 4, మహిళకు 2, ఎస్సీ జనరల్‌కు 16, మహిళకు 8, ఎస్టీ జనరల్‌కు 6, మహిళకు 4, వీహెచ్ జనరల్‌కు 1, మహిళకు 1, ఓహెచ్ జనరల్‌కు 2, హెచ్‌హెచ్ జనరల్‌కు 1, మహిళకు 1, మాజీ సైనికోద్యోగులకు జనరల్‌కు 2, మహిళలకు 2 పోస్టులు రిజర్వు అయ్యాయి. వెల్లడైన ఫలితాల్లో ఓసీ కేటగిరీలో మొదటి ర్యాంకుకు 269 మార్కులు వచ్చాయి.