
సాక్షి, విశాఖపట్నం: అభ్యర్థుల హాల్ టిక్కెట్‌పై అడ్రస్ సరిగా లేకపోవడంతో సుమారు 150 మంది ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆదివారం పరీక్ష రాయలేకపోయారు. హాల్ టికెట్ వెనక తిమ్మాపురం ఆదర్శ కాలేజీ అని ఉండటంతో భీమిలి రోడ్‌లోని తిమ్మాపురం పరీక్షా కేంద్రానికి కొంత మంది అభ్యర్థులు వెళ్లారు. అక్కడ అధికారులు మీది ఈ పరీక్షా కేంద్రం కాదని చెప్పడంతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు అవాక్కయ్యారు. అసలు రాయాల్సిన పరీక్షా కేంద్రం ఎస్.రాయవరం మండలం తిమ్మాపురంలో ఉందని తెలియడంతో వారికి ఏడుపు ఒక్కటే తక్కువైంది.
అధికారుల తప్పిదానికి తాము బలికావాల్సి వచ్చిందని ఆ పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయం లేదు కాబట్టి తమకు ఇదే సమయానికి ఇక్కడే పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. స్థానికంగా తాము నిర్ణయం తీసుకోలేమని, ఇది ఉన్నాతాధికారులు తీసుకోవాల్సిన విషయం అని అక్కడి అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-3 కేటగిరీలో 1,051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) జరిగింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు 13 జిల్లాల్లో 1,320 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30 వరకు పరీక్ష సమయంగా నిర్ణయించారు.