నిపుణుల కమిటీ చేతుల్లోకి ‘పంచాయతీ’ | HC Of Telangana Orders To Submit Written Test Key To A Skilled Committee | Sakshi
Sakshi News home page

నిపుణుల కమిటీ చేతుల్లోకి ‘పంచాయతీ’

Published Thu, Feb 14 2019 2:27 AM | Last Updated on Thu, Feb 14 2019 5:22 AM

HC Of Telangana Orders To Submit Written Test Key To A Skilled Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షపై తలెత్తిన వివాదంపై నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదే శించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్‌లో ఇచ్చిన 14 ప్రశ్నలతో పాటు, తప్పుగా ఉన్నాయని వివాదం రేగిన 9 ప్రశ్నల విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నిపుణుల కమిటీ అవసరమని స్పష్టం చేసింది. పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్న ప్రశ్నలన్నింటినీ ఈ కమిటీకి నివేదించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసిం ది.

అలాగే తుది ‘కీ’ని కూడా ఆ కమిటీ ముందుంచాలంది. నిపుణుల కమిటీ వెలువరించే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే, గిరిజన ప్రాంతాల్లోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 100% గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని, ఆ తర్వాత కూడా ఖాళీలు ఏర్పడితే వాటిని గిరిజన అభ్యర్థులతో భర్తీ చేసే నిమిత్తం నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీన్ని హైకోర్టు రికార్డ్‌ చేసుకుంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే తుది ‘కీ’లో పలు తప్పులున్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఇచ్చారని, అదే విధంగా 9 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయంటూ మరికొంత మంది అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 100% గిరిజనులతోనే భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారించారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కమిటీ ఏర్పాటు ద్వారా మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నారు. గిరిజ ప్రాంతాల్లోని పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం తరపు న్యాయవాది సంజీవ్‌కుమార్‌ ఇచ్చిన హామీని న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల పరీక్షపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను పరిష్కరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement