తాగునీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు
విద్యార్థులకూ నీటి వినియోగంపై అవగాహన కల్పించండి
అవసరమైతే పాఠ్యాంశంగా చేర్చండి
ఇంకుడు గుంతలు లేని ఇళ్లను గుర్తించి చర్యలు చేపట్టండి
తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్‌కు వినియోగాన్ని నియంత్రించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: వర్షపు నీటి నిల్వ విధానం (ఇంకుడు గుంతలు, ఆర్‌డబ్ల్యూఎస్‌హెచ్)పై సరైన చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్ మరో బెంగళూరులా తాగునీటికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కలిగించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పింది. తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్ లాంటి వాటికి వినియోగాన్ని నియంత్రించాలంటూ సర్కారుకు పలు సూచనలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా నీటికొరత ఉందని, ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని.. అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం హైకోర్టుకు లేఖ రాశారు. ఇందులోభాగంగా నీటి వినియోగాన్ని నియంత్రించడం, తాగునీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని న్యాయస్థానం పిటిషన్‌గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కీలక సూచనలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందని చట్టప్రకారం నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సిద్ధివర్ధన పేర్కొన్నారు. తాగునీటి సంరక్షణ, నియంత్రణకు సంబంధించిన ఈ పిటిషన్ ద్వారా కోరిన ఉపశమనం.. తీసుకోవాల్సిన చర్యలు వేరని... ఈ నేపథ్యంలో కాలం చెల్లిందన్న వాదన సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ధర్మాసనం చేసిన సూచనలివీ...
► తాగునీటి పరిరక్షణ, పునర్వినియోగం, పంపిణీ లాంటి అంశాలను 3 నుంచి 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలి. 6వ తరగతి విద్యార్థులకు ఇదే అంశాలపై కొంత సిలబస్ స్థాయి పెంచి పాఠ్యాంశంగా చేర్చాలి.
► రాష్ట్రంలోని భూగర్భ జలాలను పరిశీలించి.. అవసరమైతే తాగునీటిని గార్డెనింగ్ వంటి పనులకు వినియోగించడంపై ఆంక్షలు విధించాలి.
► ఇంకుడు గుంతల్లేని నిర్మాణాలను గుర్తించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కసరత్తు చేయాలి.
► పట్టణ, స్థానిక సంస్థల్లో ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎస్ నిబంధనలు అమల్లో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు చేపట్టాలి.
► గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎస్ వ్యవస్థ అవశ్యకతను తెలియజేయడానికి సర్కారు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
► గతేడాది మార్చి 31న జారీచేసిన జీవో 49 అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికి అదనంగా చిన్న నిర్మాణాల్లో సైతం వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి.
► వాల్టా చట్టంలోని నిబంధనల అమలుకు సెక్షన్ 11 ప్రకారం సంబంధిత విభాగం నోటిఫికేషన్ జారీచేయాలి.
► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్‌వెల్స్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయా? లేదా? అనే అంశంపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలన చేపట్టి చర్యలు తీసుకోవాలి.
► పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 43 (6) (2) నిబంబధనలు అమలయ్యేలా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment