ప్రతీకాత్మక చిత్రం
► కొత్తపేటకు చెందిన సత్యనారాయణ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేటు స్కూల్‌లో సోషల్ టీచర్‌గా ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. కరోనాకు ముందు నెలసరి వేతనం రూ.16 వేలు వచ్చేది. కరోనా నేపథ్యంలో యాజమాన్యం నష్టాలను సాకుగా చూపి వేతనాన్ని రూ.12 వేలకు తగ్గించింది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నా రూ.12 వేల వేతనాన్నే కొనసాగిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే పని చేయండి..లేకుంటే రిజైన్ చేయొచ్చని యాజమాన్యం సెలవిచ్చింది.
► ఉప్పల్‌కు చెందిన సునీత సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు స్కూల్‌లో రూ.15 వేల వేతనంపై ఆంగ్లం టీచర్‌గా పనిచేసేది. కరోనా నేపథ్యంలో తొలగింపునకు గురైంది. తాజాగా నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా తిరిగి విధుల్లో తీసుకునేందుకు నిరాకరించారు. మరో స్కూల్‌కు వెళ్లి సంప్రదించగా నెలసరి వేతనం రూ.6 వేలు ఇస్తామని సెలవిచ్చారు. ఇది వీరిద్దరికి ఎదురైన సమస్య కాదు...ఇప్పుడు మహానగరంలోని వేలాది మంది ప్రైవేటు టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య.
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు టీచర్లకు ఉపాధి తిప్పలు తప్పడం లేదు. కరోనా వైరస్‌తో వేతనాలు కోతబడి, ఉద్యోగాలు కోల్పోయి బజారున పడగా, తాజాగా ప్రైవేటు విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. కరోనా నేపథ్యంలో తగ్గించిన వేతనాలను పెంచేందుకు, విధుల నుంచి తొలగించిన టీచర్లను తిరిగి చేర్చుకుంనేందుకు విద్యా సంస్థలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు తక్కువ జీతాలతో కొత్త వారిని భర్తీ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాథమిక తరగతుల టీచర్లకు రూ.ఐదు వేల నుంచి ఏడు వేల వరకు, ఉన్నత తరగతుల టీచర్లకు రూ.8 నుంచి 12 వేల వరకు వేతనాలు స్లాబ్‌గా నిర్ణయించి అమలు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో గతంలో ఉద్యోగాలు కొల్పోయిన టీచర్లు దిక్కుతోచక తక్కువ వేతనాలపై కూడా పని చేసేందుకు ముందుకు వస్తున్నారు.
ప్రైవేటుపై ఆసక్తి
మొన్నటి వరకు సర్కారు స్కూల్స్‌లో విద్యా వాలంటీర్లుగా పనిచేసిన అభ్యర్థులు సైతం ప్రైవేటు స్కూల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలోబడులు మూతపడటంతో విద్యావాలంటీర్లు తొలగింపునకు గురయ్యారు. గత విద్యా సంవత్సరం ఆలస్యంగా పాఠశాలలు పునప్రారంభమైనా విద్యా వాలంటీర్ల భర్తీ జరగలేదు. దీంతో వీరంతా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ మరింత పెరిగింది. (క్లిక్: నెలలోనే 2,500 నకిలీ వేలిముద్రలు.. రూ. 40 లక్షలు హాంఫట్)
బతుకులు ఆగం..
కరోనా కష్టకాలంలో ప్రైవేటు టీచర్ల బతుకులు ఆర్థికంగా చిధ్రమయ్యాయ. ఆర్ధిక కష్టాలు భరించలేక కొందరు తనువు చాలించగా, మరికొందరు భారంగా బతుకు బండిలాగిస్తున్నారు. మరికొందరు వలస వెళ్లారు. నెలవారి ఖర్చులు తగ్గించుకున్నా పూట గడవని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. కొందరు కూరగాయలు, పండ్ల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. బడ్జెట్ స్కూల్స్‌తో పాటు కార్పొరేట్ స్కూల్స్ టీచర్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. రోజంతా చాకిరీ చేయిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వేతనాలు మాత్రం పెంచడం లేదు. మరోవైపు పిల్లల నుంచి ఫీజులు దారుణంగా పెంచి వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment