Private school teachers
-
ప్రైవేటు టీచర్ల ‘ఉపాధి’ తిప్పలు
► కొత్తపేటకు చెందిన సత్యనారాయణ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేటు స్కూల్లో సోషల్ టీచర్‌గా ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. కరోనాకు ముందు నెలసరి వేతనం రూ.16 వేలు వచ్చేది. కరోనా నేపథ్యంలో యాజమాన్యం నష్టాలను సాకుగా చూపి వేతనాన్ని రూ.12 వేలకు తగ్గించింది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నా రూ.12 వేల వేతనాన్నే కొనసాగిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే పని చేయండి..లేకుంటే రిజైన్ చేయొచ్చని యాజమాన్యం సెలవిచ్చింది. ► ఉప్పల్‌కు చెందిన సునీత సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు స్కూల్లో రూ.15 వేల వేతనంపై ఆంగ్లం టీచర్‌గా పనిచేసేది. కరోనా నేపథ్యంలో తొలగింపునకు గురైంది. తాజాగా నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా తిరిగి విధుల్లో తీసుకునేందుకు నిరాకరించారు. మరో స్కూల్‌కు వెళ్లి సంప్రదించగా నెలసరి వేతనం రూ.6 వేలు ఇస్తామని సెలవిచ్చారు. ఇది వీరిద్దరికి ఎదురైన సమస్య కాదు...ఇప్పుడు మహానగరంలోని వేలాది మంది ప్రైవేటు టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు టీచర్లకు ఉపాధి తిప్పలు తప్పడం లేదు. కరోనా వైరస్‌తో వేతనాలు కోతబడి, ఉద్యోగాలు కోల్పోయి బజారున పడగా, తాజాగా ప్రైవేటు విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. కరోనా నేపథ్యంలో తగ్గించిన వేతనాలను పెంచేందుకు, విధుల నుంచి తొలగించిన టీచర్లను తిరిగి చేర్చుకుంనేందుకు విద్యా సంస్థలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు తక్కువ జీతాలతో కొత్త వారిని భర్తీ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాథమిక తరగతుల టీచర్లకు రూ.ఐదు వేల నుంచి ఏడు వేల వరకు, ఉన్నత తరగతుల టీచర్లకు రూ.8 నుంచి 12 వేల వరకు వేతనాలు స్లాబ్‌గా నిర్ణయించి అమలు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో గతంలో ఉద్యోగాలు కొల్పోయిన టీచర్లు దిక్కుతోచక తక్కువ వేతనాలపై కూడా పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రైవేటుపై ఆసక్తి మొన్నటి వరకు సర్కారు స్కూల్స్‌లో విద్యా వాలంటీర్లుగా పనిచేసిన అభ్యర్థులు సైతం ప్రైవేటు స్కూల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలోబడులు మూతపడటంతో విద్యావాలంటీర్లు తొలగింపునకు గురయ్యారు. గత విద్యా సంవత్సరం ఆలస్యంగా పాఠశాలలు పునప్రారంభమైనా విద్యా వాలంటీర్ల భర్తీ జరగలేదు. దీంతో వీరంతా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ మరింత పెరిగింది. (క్లిక్: నెలలోనే 2,500 నకిలీ వేలిముద్రలు.. రూ. 40 లక్షలు హాంఫట్) బతుకులు ఆగం.. కరోనా కష్టకాలంలో ప్రైవేటు టీచర్ల బతుకులు ఆర్థికంగా చిధ్రమయ్యాయ. ఆర్ధిక కష్టాలు భరించలేక కొందరు తనువు చాలించగా, మరికొందరు భారంగా బతుకు బండిలాగిస్తున్నారు. మరికొందరు వలస వెళ్లారు. నెలవారి ఖర్చులు తగ్గించుకున్నా పూట గడవని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. కొందరు కూరగాయలు, పండ్ల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. బడ్జెట్ స్కూల్స్‌తో పాటు కార్పొరేట్ స్కూల్స్ టీచర్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. రోజంతా చాకిరీ చేయిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వేతనాలు మాత్రం పెంచడం లేదు. మరోవైపు పిల్లల నుంచి ఫీజులు దారుణంగా పెంచి వసూలు చేస్తున్నారు. -
కరోనా కష్టకాలం; వీరి బతుకులు ఆగమాగం
హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన ఖైసర్ ఓ ప్రైవేట్ స్కూల్లో అయిదేళ్లుగా సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. నెలసరి వేతనం రూ.16 వేలు. ప్రైవేట్‌గా హోం ట్యూషన్లతో మరో రూ.5వేల వరకు సమకూరేది. కుటుంబం నెలసరి ఖర్చులకు అతికష్టంగానే సరిపోయేది. కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరం స్కూల్స్ మూత పడి విద్యా బోధన ఆన్‌లైన్‌కు పరిమితమైంది. దీంతో ఫీజులు వసూలు కావడం లేదంటూ స్కూల్ యాజమాన్యం కొందరికి ఉద్వాసన పలికింది. మరికొందరి టీచర్ల వేతనంలో 25 శాతం కోత విధించింది. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికాలేదన్న సంతోషం మిగిలినా.. అదనపు ఆదాయం సమకూరే హోం ట్యూషన్లకు అవకాశం కూడా లేక ఆర్థిక పరిస్ధితులు భారంగా తయారయ్యాయి. అయినా కేవలం రూ.12 వేలతో కుటుంబ పోషణ కష్టంగా తయారైనా బతుకు బండిలాగక తప్పలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా తిరిగి విద్యా బోధన ఆన్‌లైన్‌కే పరిమితమైంది. పాఠశాల యాజమాన్యం ఫీజులు వసూలు కావడం లేదంటూ ఉపాధ్యాయుల వేతనాలకు కోత పెట్టింది. దీంతో నెలసరి వేతనం రూ.8 వేలకు పరిమితమైంది. కుటుంబ అవసరాలకు కష్టంగా మారింది. ఇది ఒక ఖైసర్ ఆర్థిక సమస్య కాదు.. మహానగరంలోని వేలాది మంది ప్రైవేటు టీచర్లది ఇదే దుస్థితి. సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ప్రైవేట్ టీచర్ల బతుకులు ఆర్థికంగా ఛిద్రమయ్యాయి. గడ్డు పరిస్థితులకు తాళలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడడం విషాదకరం. ప్రాంణాంతక వైరస్ గత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ టీచర్లు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. నెలవారీ ఖర్చులు తగ్గించుకున్నా పూట గడవని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. బతుకు బండి లాగడానికి కొందరు కూరగాయలు, పండ్లు అమ్మకాలకు కూడా కొనసాగిస్తున్నారు. చిల్లర వర్తకులుగా మారి ఇంటిని గట్టెక్కిస్తే చాలు అంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాల్లో కొనసాగుతున్న టీచర్ల పరిస్థితి చాలీచాలని వేతనాలతో దయనీయంగా తయారైంది. కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి చేరింది. బడ్జెట్ స్కూల్స్‌తో పాటు కార్పొరేట్ స్కూల్స్ టీచర్లు కూడా ఆర్థిక కష్టాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో బోధిస్తున్నవారి జీతాలు సగం మేర కత్తెర పడ్డాయి. వస్తువులు తాకట్టు పెట్టి.. కొన్ని స్కూళ్లు పలువురి ఉపాధ్యాయులకు ఉద్వాసన పలికితే.. మరికొన్ని వేతనాల్లో కోత పెట్టాయి. దీంతో కుటుంబం నడిచే పరిస్థితి లేకపోవడంతో కొందరు నగలు నట్రా తాకట్టు పెట్టారు. మహా నగరంలోని సుమారు 72 శాతం మంది టీచర్లు... తమ విలువైన నగలు, వస్తువులు తాకట్టు పెట్టడమే కాకుండా బంధువుల నుంచి అప్పులు చేసినట్లు ఓ ఎన్జీఓ సంస్ధ సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. సుమారు 83 శాతం మంది టీచర్లు... అయిదు నెలల ఇంటి అద్దెలు బకాయి పడ్డారు. కరోనా వాళ్ల జీవితాలపై ఎంత పెను ప్రభావం చూపిందో స్పష్టమవుతోంది. రెండు నెలలకు పరిమితం.. ప్రైవేటు టీచర్లకు సర్కార్ ఆర్థిక సాయం కేవలం రెండు నెలలకు పరిమితమైంది. గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బందికి 2వేల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసి చేతులు దులుపుకొంది. అది కూడా సగానికి పైగా టీర్లకు అందలేదన ఆరోపణలు లేకపోలేదు. -
ప్రైవేట్ టీచర్ల ఖాతాల్లో రూ.41 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల పాలైన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 వేల ఆపత్కాల సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం ఆమె ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభించారు. మే నెలకు సంబంధించి 2,04,743 మంది టీచర్లు, సిబ్బంది అకౌంట్లలో రూ. 40,94,86,000లను జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను పెద్దమనసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేక పోయినా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. స్కూళ్లు తిరిగి తెరిచే వరకు ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ సాయం కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. కరోనా సమయంలో ప్రత్యేక ఛానళ్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహించడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో.. ప్రైవేట్ టీచర్లకు ఎంత కష్టం
సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 900లకు పైగా పాఠశాలల్లో 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కరోనా కారణంగా 3 నెలలుగా యాజమాన్యాలు జీతాలు చెల్లించక పోవడం, విద్యాసంవత్సరం ప్రారంభమైనా బడులు తెరుచుకోక పోవడంతో కుటుంబ పోషణకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తూ అరిగోస పడుతున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించే తమకు ఇంతటి కష్టం వస్తుందనుకోలేదంటూ ఆవేదన చెందుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం కొందరు దినసరి కూలీలుగా మారగా మరికొందరు ఆటోలు నడుపుతూ, వ్యవసాయ పనులకు వెళ్తూ, కట్టెలు అమ్ముకుంటూ, కులవృత్తులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్పందించి, ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మార్చి నెల వరకే చెల్లింపు లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు మార్చి నెల వరకే వేతనాలు చెల్లించి, చేతులు దులుపుకున్నాయి. పాఠశాలలు ప్రారంభమైతేనే జీతాలు అనే ధోరణిలో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే ఉపాధ్యాయులను తొలగిస్తుండగా మరికొన్ని చోట్ల అడ్మిషన్ల పేరిట టార్గెట్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించి, గురువులుగా గుర్తింపు పొందిన వారు నేడు కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 10 శాతం మంది ఆన్లైన్లో బోధన ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్లో క్లాస్‌లను చెప్పడం ప్రారంభించాయి. ఒక్కో బడిలో 10 శాతం మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. ఇలా ఆన్లైన్లో బోధించేవారికి వేతనాలు ఇచ్చేందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మిగతా ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టైలరింగ్ పని చేస్తున్నా.. మాది పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల. బీఎస్సీ, బీఈడీ చేసిన. పదేళ్లుగా పలు ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేస్తున్నాను. లాక్డౌన్ కారణంగా మూతపడిన పాఠశాల ఇప్పటికీ తెరుచుకోలేదు. మాకు యాజమాన్యాలు ఏప్రిల్, మే నెలల వేతనాలు ఇవ్వలేదు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో టైలరింగ్ పని చేస్తున్నా. ప్రభుత్వం స్పందించి, ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి. – బాలవేణి రాణి, ప్రైవేట్ టీచర్ బీడీలు చుడుతున్నా.. మాది రేకుర్తి పరిధిలోని సాలెగనర్. నేను ఎంఏ బీఈడీ చేసిన. ఆరేళ్లుగా ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నా. కరోనా కారణంగా జూన్ నెల గడిచిపోతున్నా పాఠశాల తెరుచుకోలేదు. మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీడీలు చుట్టడం నాకు తెలిసిన పని కావడంతో ప్రస్తుతం అదే చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. – నౌసీన్, ప్రైవేట్ టీచర్ మాస్కులు కుడుతున్నా.. మాది కొండపల్కల గ్రామం. నేను ఎంఏ. బీఈడీ చదివిన. 20 ఏళ్లుగా ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. మార్చి నెల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో మాస్కులు కుడుతూ కాలం వెల్లదీస్తున్నా. ఈ విపత్కర కాలంలో పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం వేతనాలు అందించి ఆదుకోవాలి. – పచ్చునూరి శ్రీనివాస్, ప్రైవేట్ టీచర్ కూలీ పనులకు వెళ్తున్నా.. మా స్వగ్రామం తిమ్మాపూర్. బీఏ బీఈడీ చదివిన. 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకోక పోవడంతో కూలీ పనులకు వెళ్తున్నా. కరోనా వైరస్ ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలను ఆగం చేసింది. కుటుంబ పోషణ భారమవుతోంది. ప్రభుత్వం మాపై దయచూపి, ఆర్థికసాయం అందించి అండగా నిలవాలి. – వినయ్‌కుమార్, ప్రైవేట్ టీచర్ -
టీచర్ ఫెయిల్..!
కేంద్రం చెప్పిందిది.. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించి ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఎడ్, టెట్ అర్హతలు తదితర అన్ని వివరాలను తీసుకోవాలి. వీటిని ఆధార్‌తో అనుసంధానం చేసి ఒక పాఠశాలలో పనిచేసే టీచర్ మరో పాఠశాలలో లేకుండా చూసేందుకు (డూప్లికేషన్) ఆన్లైన్ లింకేజీ చేయాలని స్పష్టం చేసింది. 2010లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను అమల్లోకి తెచ్చినపుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలంటే సదరు అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించా లన్న నిబంధనను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) విధించింది. అయితే ప్రభుత్వాలు ఇన్నాళ్లూ ఆ నిబంధన విషయంలో సీరియస్‌గా వ్యవహరించలేదు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్లో 950 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో దాదాపు 35 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో 10 మంది వరకు టీచర్లకు నెలవారీ వేతనం రూ.10 వేల లోపే. కారణం వారిలో ఎక్కువ మందికి డీఎడ్ లేదా బీఎడ్ లేకపోవడం, ఇంకొందరు టెట్‌లో అర్హులు కాకపోవడం. ఇలాంటి టీచర్లు రాష్ట్రంలో వందల స్కూళ్లలో వేల సంఖ్యలో పనిచేస్తున్నట్లు విద్యా శాఖ అం చనా. ఐఐటీ చదువులు.. సింగిల్ డిజిట్ ర్యాంకులు అంటూ ఆకర్షణీయంగా ఎరవేస్తాయి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు. వేలకు వేలు ఫీజులు చెల్లించి పిల్లలను చేరి్పస్తే ఆశించిన చదువులు మాత్రం రావడం లేదు. ఎందుకలా అంటే.. అందులో శిక్షణ పొం దిన ఉపాధ్యాయులే ఉండరు. ఏదో ఇంటరో.. డిగ్రీ సర్టిఫికెటో పట్టుకుని టీచర్లుగా పనిచేస్తుంటారు. ఇలాంటి వారికి వేతనం కూడా రూ.10వేల లోపే. ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో అక్రమాలకు తావులేకుండా ఆధార్‌ను అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఆధార్‌తో లింక్... ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆధార్ ఆధారిత టీచర్ల లెక్కలు ఇకపై ప్రైవేటు స్కూళ్లు చెప్పాల్సిందే. 2019–20 విద్యాశాఖ లెక్కల సేకరణలో (యూ–డైస్) కచ్చితంగా ఆ వివరాలు ఇవ్వాల్సిందే. విద్యార్థుల సంఖ్యకు, ఉపాధ్యాయులకు సంఖ్య సరిపోలాల్సిందే. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉందా? లేదా? అడ్డగోలు ప్రవేశాలు చేపడుతున్నారా? అన్నది తేల్చేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్ధమైంది. దీంతో అర్హతల్లేని టీచర్లకు చెక్ పడనుంది. అర్హులైన వారితోనే బోధన చేపట్టేలా కార్యాచరణను అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నవంబర్ నుంచి చేపట్టనున్న 2019–20 యూ–డైస్లో ప్రైవేటు పాఠశాలకు చెందిన టీచర్ల సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందేనని, అదీ ఆన్లైన్లో ఆధార్‌తో లింక్ చేయడం డూప్లికేషన్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. పక్కాగా చర్యలు చేపట్టినా.. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే వారు కచి్చతంగా సుశిక్షితులైన వారే ఉండాలని కేంద్రం 2017 ఆగస్టులో స్పష్టం చేసింది. 2019, మార్చి 31 నాటికి పాఠశాలల్లో పని చేసే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన వారై ఉండాలని సూచించింది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో పని చేస్తున్న వారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఉపాధ్యాయ విద్యను అభ్యసించేలా అవకాశం కల్పించింది. అయితే పాఠశాలల్లో వారు బోధిస్తున్నట్లు సరి్టఫై చేసిన వారికే ప్రవేశాలు కల్పించింది. మొదట్లో 3,905 మంది మాత్రమే అన్ట్రైన్డ్ టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసినా, ఓపెన్ స్కూల్లో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత ఉందంటూ ఆధారాలతో 17 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకుని చదువుకున్నారు. రికార్డుల్లో లేని వారు 33 వేలపైనే.. పాఠశాలల రికార్డుల్లో లేకపోయినా టీచర్లుగా పని చేస్తున్న వారు మరో 33 వేల మందికి పైగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. వారికి ఉపాధ్యాయ విద్య అర్హతలు లేనందున రికార్డుల్లో చూపడం లేదు. మరోవైపు మరికొంత మందికి తక్కువ వేతనాలు ఉండటంతో వోచర్ పేమెంట్ల సరిపుచ్చుతున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. ఇక టెట్‌లో అర్హత సాధించని వారైతే 64 శాతం ఉన్నట్లు విద్యాశాఖ పరిశీలనల్లోనే తేలింది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో విద్యా బోధన చేస్తున్న టీచర్ల లెక్కలను పక్కాగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. -
పేరుకు బడిపంతులు చేతల్లో బానిస
దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వేల పాఠశాలలు, కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు. అందులో ఎవరు చదువు చెబుతున్నారు. వారి అర్హతలు ఏమిటి, వారికి ఇస్తున్న వేతనాలు ఏమిటి, వారి జీవన ప్రమాణాలు ఏమిటని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం విషాదకరం. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ముగిసిం దంటే చాలు ఉన్న ఉపాధ్యాయులు వచ్చే సంవత్సరం కొనసాగుతారో లేదో తెలియని దుస్థితి. కొత్త విద్యాసంవత్సరం ఉద్యోగంలో కొనసాగాలంటే విధిగా 50 మంది విద్యార్థులను తాను పని చేస్తున్న పాఠశాలల్లో అడ్మిషన్లు చేయించాలి. అలా చేయకపోతే ఉద్యోగం ఊడినట్లే లెక్క. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరమైన పరిస్ధితుల్లో ఉన్నాయి. విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి 12 నెలల ఫీజులు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. కానీ అక్కడే పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలలే వేతనాలు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో వేలాది పాఠశాలలు, వందలాది ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో లక్షలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర పనిలో ఉన్నారు. వీరిని సరుకుగా మార్చి వేల కోట్లు లాభాలు చేకూర్చే వ్యాపారంగా మార్చారు. భావి భవిష్యత్ నిర్మాతలను తయారు చేసే గురువులకు కడుపులు పస్తు పెడితే ఏ అలోచనతో వారు విద్యార్థులకు చదువు చెబుతారో కూడా అర్ధం చేసుకోని స్థాయికి వ్యవస్థ దిగజారింది.ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది బోధన, భోధనేతర సిబ్బందిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరిలో 70 శాతానికి పైగా ఈఎస్ఐ, పీఎఫ్ విధానం అమలు కావటం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు హెల్త్ కార్డులను ఇవ్వాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. – ఎస్. నూర్‌మహమ్మద్ మొబైల్ : 94900 98057 -
పిల్లలను బడిలో చేర్పిస్తేనే జీతం..!
కందుకూరు రూరల్/నాగులుప్పలపాడు: పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో నీరుపేద చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. జూన్ నెలలో ప్రారంభమయ్యే 2018–19 విద్యా సంవత్సరానికి గత నెల రోజుల నుంచే విద్యార్థుల అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి కార్పొరేట్ పాఠశాలలు. కార్పొరేట్ యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలా... లేక బయటకు రావాలా అనే సందిగ్ధంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. జిల్లాలో దాదాపు 30 కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1500 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇచ్చిన టార్గెట్లు చేస్తేనే జీతాలు... కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నెల రోజుల నుంచి ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఊళ్లోలోకి పంపించారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వాళ్లలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు...ఏం చదువుతున్నారు..ఎక్కడ చదువుతున్నారు.. అని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఒక సారి మా పాఠశాలలో వసతులు చూడండి... ఫీజులు చూడండి, రీజల్టు చూడండని ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా వారి ఇళ్ల దగ్గర వారినో, బంధువుల పిల్లల్నో తమ స్కూల్లో చేర్చేలా చూడమంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగోలా వారికి ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేస్తేనే మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఇస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు పెట్టాయి. ఒక్కొక్కరు 10 నుంచి 15 మంది పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలో చేర్పిం చాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకపోతే జీతం రాదు. ఆ తర్వాత పాఠశాలలో ఉద్యోగం ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పటికే కొందరికి జీతాలు నిలిపివేసినట్లు సమాచారం. ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు వచ్చే అరకొర జీతాలు నిలిపేయడంతో పిల్లలను చేర్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆకర్షణలతో మోసపోతున్న తల్లిదండ్రులు పాఠశాలల గురించి చెప్పే ప్రత్యేకతలను విన్న తల్లిదండ్రులు ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలల కంటే కార్పొరేట్ స్కూల్లో ఆకర్షణీయమైన యూనిఫాం, విశాలమైన తరగతి గదులు, వేర్వేరుగా మరుగుదొడ్లు, పరిమితికి లోబడి విద్యార్థుల సంఖ్య, కరెంట్ పోతే జనరేటర్ సౌకర్యం, తక్కువ ఖర్చుతో బస్ సౌకర్యం, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, రోజు వారి టెస్ట్‌లు, ప్రతి రోజులు స్టడీ అవర్లు, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్‌లు, ప్రతి పండగ సెలబ్రేషన్, ఆటల, పాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు బదిలీ అయితే అదే చోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్ స్కూళ్ల సిబ్బంది చెప్తారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్ ఫీజు కట్టించుకునే వరకు కేవలం పాఠశాల ఫీజు మాత్రమే చెప్తారు. ఫీజు చెల్లించిన తర్వాత బస్ ఫీజు, యూనిఫాం ఫీజు, బుక్స్ ఫీజు అంటూ ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్లో ఫిక్స్ చేసిన ఫీజులని చెప్తున్నారు. అవి అన్ని బ్రాంచ్‌ల్లో ఒకటిగానే ఉంటాయి. వీటిని మార్చేందుకు వీలు కాదు. కచ్చితంగా ఆన్లైన్లో చూపించే ఫీజు చెల్లించాలి. ఇలా నిబంధనలు పెడతారు. అప్పుడు ముందుగా క్యాంపెన్లు తిరిగి పిల్లలను చేర్పిన ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఒత్తిళ్లు పెరుగుతాయి. అప్పుడు అలా చెప్పారు.. ఇప్పుడు ఇలా చెప్తున్నారని గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు కార్పొరేట్ కాలేజీలపై దృష్టిపెట్టి ఉపాధ్యాయులపై వేధింపులు నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయినుల పరిస్థితి మరింత దయనీయం: పిల్లల్ని చేర్చాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. మహిళా ఉపాధ్యాయినుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొం త మంది అయితే యాజమాన్యాల ఒత్తిడి భరించలేక 2 నెలల జీతం వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. విద్యార్థుల అడ్మిషన్ పనిలో పడి చాలా చోట్ల ఏప్రిల్ నెలలో అసలు పాఠశాలలే జరగడం లేదు. ఇదిలా ఉంటే నాగులుప్పలపాడు మండల కేంద్రంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్చాలంటూ ఉపాధ్యాయులపై టార్గెట్ పెట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఈ పాఠశాలలో పని చేస్తున్న మహిళా టీచర్లను రాత్రి 10 గంటల వరకు కూడా క్యాంపెయిన్ పేరుతో పాఠశాలలో ఉండమని చెప్పడం తరువాత వారిని లైంగికంగా వేధించడం మొదలైంది. పాఠశాల యాజమాన్యంలోని ఓ వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ఒక మహిళా టీచర్‌ను కొంత కాలం నుంచి అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు పాఠశాలలో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఉపాధ్యాయురాలు ఫోన్ సంభాషణను రికార్డు చేసి తన బంధువులకు వినిపించి వారి సాయంతో లైంగిక వేధింపులపై అడిగేందుకు వెళ్లగా..మీకు చేతనైంది చేసుకోండని చెప్పి వారిపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సంకోచించిన సదరు ఉపాధ్యాయురాలు చివరకు శుక్రవారం తన సర్టిఫికెట్లు, తనకు రావాల్సిన 3 నెలల జీతం ఇవ్వాలని యాజమాన్యాన్ని అడిగింది. అయినా సర్టిఫికెట్లు ఇవ్వం, జీతం ఇచ్చేది లేదు..దిక్కున్న చోట చెప్పుకో అంటూ తీవ్రమైన దుర్భాషలాడారని బాధితురాలు వాపోయింది. ఈ పాఠశాలలో మహిళా టీచర్లపై వేధింపులు ఇదేం కొత్త కాదు. గతంలో ఇలాంటి వేధింపులతో చాలా మంది టీచర్లు నోరు మెదపకుండా పాఠశాల మానివేశారు. ఇదే విషయమై నాగులుప్పలపాడు ఎంఈవో జి.శేషయ్యను వివరణ అడగగా> మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో మహిళా టీచర్లపై వేధిస్తున్నారన్న విషయంలో తాను సీరియస్ గా స్పందిస్తానని యాజమాన్యం వైపు నుంచి ఇలాంటి చర్యలు ఉంటే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మా దృష్టికి రాలేదు జీతాల సమస్య సాధారణంగా సంస్థాగతంగా జరుగుతుంది. విద్యార్థులను చేర్చాలంటూ ఒత్తిడి తేవడం సరికాదు. జీతాలు ఇవ్వకుండా నిలిపివేయడంపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తే తదుపరి చర్యలను చేపడతాం. -వీఎస్.సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
కావలిరూరల్: పెద్దలు పెళ్లికి నిరాకరించండంతో ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. కావలి రూరల్ ఎస్సై జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బుడంగుంట కాలనీకి చెందిన నాగమణి, గాయత్రినగర్‌కు చెందిన ఆదిల్లు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన నాగమణి కుటుంబసభ్యులు ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటివద్దనే ఉంచారు. తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాగమణి ఆదిల్‌కు సమాచారం అందించింది. ఈ క్రమంలో వారు ఆదివారం కావలి డీఎస్పీ కె.రఘును కలిశారు. ఆయన నాగమణి, ఆదిల్ తల్లిదండ్రులతో మాట్లాడాలని రూరల్ ఎస్సైని ఆదేశించారు. దీం తో పుల్లారావు ఇరువురి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదిల్ కుటుంబసభ్యులు వివాహానికి అంగీకరించారు. నాగమణి కుటుంబసభ్యులు తమ నిర్ణయం చెప్పకపోవడంతో కొంత సమయం ఇచ్చారు. -
పారితోషికం ఇవ్వకుంటే సర్వే చేయం
ఖమ్మం : ఈనెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు పారితోషికం ఇవ్వాల్సిందేనని జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు డిమాండ్ చేశారు. లేదంటే సర్వే నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కుటుంబ సమగ్ర సర్వేకు సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు జిల్లాలో లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాలలో గురుఆరం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వేలో పాల్గొంటే తమకు పారితోషికం ఎంతిస్తారని అధికారులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి అధికారులు స మాధానమిస్తూ ఎవరికి ఏమీ ఇచ్చేది లేదని, స్వచ్ఛందంగానే సర్వే నిర్వహించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు శిక్షణ బహిష్కరించి బయటకు వచ్చారు. ఉన్నత చదువులు చదివిని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి సర్వేలో పాల్గొన్న ప్రైవేట్ ఉద్యోగులకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాబు, రవీందర్, నరేష్, శేషురాం తదితరులు పాల్గొన్నారు.