దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం
సాక్షి, కడప కల్చరల్ : కడప రాయుని సన్నిధిలో పని చేస్తున్న పదకొండు మంది చిరుద్యోగులు చాలీ చాలని జీతంతో బతుకులీడుస్తున్నారు. ఒకటి రెండు కాదు 19 ఏళ్లుగా నెలకు రూ. 5010ల జీతంతోనే జీవితం కొనసాగిస్తున్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల పరిధిలోకి వెళ్లినా ఫలితం లేక.. ఆ నిత్య దైవ సేవకులు కఠిన పేదరికంతో ‘ఏ దేవుడైనా కరుణించకపోతాడా!’ అన్న ఆశతో జీవచ్ఛవాలుగా కాలం గడుపుతున్నారు.
దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం 2006లో టీటీడీలో విలీనమైంది. ఆ నిర్ణయం ఆలయంలో పనిచేస్తున్న దిగువ స్థాయి ఉద్యోగులకు శాపంగా మారింది. 19 సంవత్సరాలుగా కేవలం రూ. 5 వేల జీతంతో కుటుంబా లను పోషించుకోలేక ఒక ఉద్యోగి ఆకలి చావుకు గురికాగా, ఇంకొకరికి మతి చలించింది. మరొకరు ఎటు వెళ్లిపోయారో తెలియదు. ఒక ఉద్యోగికి జబ్బు చేసి చికిత్స పొందే ఆర్థికస్థితి లేక మరణించారు. వీరి కుటుంబాలన్నీ ప్రస్తుతం రోడ్డున పడ్డాయి. ఎప్పుడైనా తమకు మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో ఈ ఆలయానికి చెందిన 11 మంది చిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
కోర్టు సూచించినా....
తమకు టీటీడీ టైం స్కేల్ ఇవ్వాలని కోరుతూ ఈ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లగా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా సంబంధిత ఏ అధికారి ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలో ఇలాంటి విలీన ఆలయాల్లోనే మిగతా అందరూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చిన టీటీడీ తమను మాత్రం ఉపేక్షించడం ఎందుకో తెలియదని వాపోతున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన దేవదాయశాఖ ఉద్యోగులు ప్రస్తుతం మంచి హోదాలో రూ. 60 వేలకు పైగా జీతాలు తీసుకుంటూ ఉండగా...నిత్యం స్వామి, అమ్మవార్ల ఆరాధనలో గడుపుతున్న తాము మాత్రం ఉండీ లేని ఉద్యోగాలతో...కేవలం రూ. 5 వేలతో కుటుంబాలను లాక్కురాక చస్తూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రే దిక్కు
అడిగిన వారిని, అడగని వారిని కూడా అర్హతను బట్టి మంచి జీతాలు ఇచ్చి కొత్త ఉత్సాహం ఇస్తున్న కడప వాసి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే తమ కష్టాలను తొలగిస్తారని ఆశిస్తున్నట్లు దేవునికడప ఆలయ చిరుద్యోగులు తెలుపుతున్నారు. తమ ఆకలి బాధలను ఆయన తప్పక అర్థం చేసుకుని ఆదుకుంటారన్న నమ్మకం ఉందంటున్నారు. ఇన్నేళ్లు దైవ సేవలో గడిపిన తమను ఆదుకునేందుకు దేవుడే ఆయనను పంపినట్లు ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ఇలా జరిగింది...
దేవునికడప ఆలయం దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉండేది. 2006లో టీటీడీ పరిధిలోకి వెళ్లింది. తమ జీవితాలు మరింత బాగుపడతాయని ఆలయ చిరుద్యోగులు సంతోషించారు. కానీ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా టీటీడీ గుర్తించలేదు. టైం స్కేల్ ఇవ్వలేదు. సొసైటీగా ఏర్పడితే ఔట్‌సోర్సింగ్ కింద గుర్తిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగాలను రెన్యూవల్ చేయించుకుంటూ నెలకు రూ. 5010 జీతంతో గడుపుతున్నారు. దేవునికడప ఆలయానికి సంబంధించి మొత్తం 11 మంది చిరుద్యోగులు ఉన్నారు.
వారిలో పి.కృష్ణమూర్తి సీనియర్ అర్చకులు. తమను టీటీడీ ఉద్యోగులుగా గుర్తించాలని పలుమార్లు తిరుపతికి వెళ్లి అధికారులందరికీ మొర పెట్టుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకూ అర్జీలు ఇచ్చారు. జిల్లావాసి టీటీడీ చైర్మన్ అయినా ఫలితం లేకపోయింది. ఏ దేవుడూ వారిని కరుణించలేదు. ప్రస్తుతం తమ ఆశలన్నీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment