
ఓ పక్క స్థూల జాతీయోత్పత్తి రేటు పెరుగుతున్నా మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య సైతం అదేస్థాయిలో ప్రమాదకరంగా పెరుగుతోంది. గత 20 ఏళ్లలో భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఢిల్లీలోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఉన్న సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2018 నివేదిక తేల్చింది. దేశంలో నిరుద్యోగుల స్థాయి క్రమంగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
జనాభాలో ప్రస్తుతం నిరుద్యోగ స్థాయి 5 శాతానికి పెరిగి ఆందోళన రేకెత్తిస్తోంది. ఇందులో అత్యధికంగా 16 శాతం చదువుకున్న యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది. మన దేశంలో గత 20 ఏళ్లలో నిరుద్యోగుల సంఖ్య అత్యధికంగా పెరిగిన సందర్భమిదేనని స్పష్టం చేసింది.
చేతి నిండా పనేదీ!
నిరుద్యోగ సమస్యకంటే పూర్తిస్థాయిలో పనిలేకపోవడం మన దేశాన్ని పట్టిపీడిస్తోంది. అంటే చేతినిండా పనిలేని కారణంగా అతి తక్కువ వేతనాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువత మన దేశంలో 16 శాతం ఉన్నట్లు తేలింది. ఉత్తరాదిలో నిరుద్యోగం ఎక్కువగా నమోదైంది. అయితే ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో నిరుద్యోగుల శాతం ఆ స్థాయిలో పెరగట్లేదని తేల్చింది.
తక్కువ వేతనాలు..
సాధారణ జీవన ప్రమాణానికి సరితూగే వేతనాలు లేని పరిస్థితి దేశంలో ఉంది. అతి తక్కువ జీవన వేతనాల్ని మన స్త్రీ, పురుషులు పొందుతున్నారు. మనదేశంలో స్త్రీలలో 92 శాతం మంది, పురుషుల్లో 82 శాతం మంది నెలకు 10 వేల లోపే సంపాదిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 67 శాతం కుటుంబాల నెలసరి ఆదాయం 2015లో 10 వేలేనని తేల్చింది. జాతీయ పే కమిషన్ నిర్ణయించిన కనీస వేతనం 18 వేల కన్నా కూడా ఇది అతి తక్కువ.
దురదృష్టవశాత్తూ 90 శాతం పరిశ్రమల్లో చివరకు సంఘటితరంగంలో సైతం అతి తక్కువ వేతనాలున్నట్లు ఈ నివేదిక తేల్చి చెప్పింది. అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు పొంతనలేని పరిస్థితులున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. 1970–80ల్లో స్థూలజాతీయోత్పత్తి రేటు 3 నుంచి 4 శాతంగా ఉన్నప్పుడు ఉపాధి వృద్ధిరేటు ఏడాదికి 2 శాతంగా ఉంది. 1990 నుంచి, ప్రధానంగా 2000 సంవత్సరం నుంచి జీడీపీ పెరుగుదల 7 శాతానికి చేరినా ఉపాధి వృద్ధి మాత్రం ఒక్కశాతం కంటే తక్కువే. జీడీపీ రేటు 10 శాతం పెరిగితే ఉద్యోగావకాశాలు మాత్రం ఒక్కశాతం అభివృద్ధినే సూచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment