సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి
అనంతపురం అర్బన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఏపీ జేఏసీ (అమరావతి) రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక కృష్ణ కళామందిర్‌లో జరిగిన జేఏసీ సమావేశానికి, జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల అంశాలపై ప్రభుత్వం శ్రద్ధం పెట్టడం లేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని సాధించుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫణిపేర్రాజు, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యోగేశ్వరరెడ్డి, ప్రభుత్వ డైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.