ఆర్టీసీలో షాడో ఎండీ!
► ప్రతి పనికీ ఆయన కటాక్షం కావాల్సిందే..
► ఈడీలు చెప్పినా ఎండీని కలిసేందుకు అనుమతి ససేమిరా
► షాడో దెబ్బకు విలవిలలాడుతున్న ఉద్యోగులు
సాక్షి, అమరావతి బ్యూరో: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది ఆర్టీసీలో ఎండీ పేషీలో పనిచేసే ఓ కీలక అధికారి వ్యవహారం. షాడో ఎండీగా చలామణి అవుతున్న ఈయన కొన్నేళ్లుగా పేషీలోని తిష్ట వేయడంతో వేసుక్కూర్చుకున్నారు. ఆయన కనుసన్నల్లోనే పాలనా వ్యవహారాలు నడిపిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులు ఎండీని కలవాలంటే ముందుగా షాడో ఎండీని ప్రసన్నం చేసుకోవాల్సిందే.
ప్రతి పనికీ ఓ రేటు..
రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్‌గానీ ఇతరత్రా ఉద్యోగులు ఏదైనా పని మీద కార్యాలయంలోకి వస్తే షాడో ఎండీ ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కష్టాల్లో ఉన్నా.. కనికరం లేదు
ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఆర్టీసీ చిరుద్యోగి తాను పని చేసే డిపోలో ఓ అధికారితో వాదనపడ్డాడు. దీంతో ఆయనను సన్పెండ్ చేశారు. ఉద్యోగం పోవడంతోపాటు పక్షవాతానికి గురయ్యారు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. ఉద్యోగం లేక కుటుంబ పోషణ కరువై ఎండీకి తనగోడు విన్నవించుకునేందుకు వచ్చాడు. కానీ షాడో ఎండీ రెండు రోజుల వరకు ఎండీని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. అతని దీనస్థితి చూసి ఇతర ఉద్యోగులు ఎండీని కలిసేందుకు అవకాశం ఇప్పించారు. బస్సులో డ్యూటీ చేసేందుకు ఇబ్బంది కావడంతో ఆన్‌డ్యూటీపై ఆర్టీసీ కార్యాలయంలోనే పని చేసేందుకు ఎండీ అవకాశం కల్పించినా, చివరకు షాడో ఎండీని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఇద్దరు శ్రామిక్ ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు.
డిపోల్లో కాలుష్యం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయి. వారు పని చేసే డిపోలోనే అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో అందులో పని చేసుకొనేందుకు ఓడీ కోసం ఎండీని కలిసేందుకు వచ్చారు. నాలుగు రోజులపాటు పడిగాపులు కాసినా ఎండీని కలిసే అవకాశం షాడో ఎండీ కల్పించలేదు. దీంతో ఊసూరుమంటూ వెళ్లిపోయారు. ఇలా సుమారు 40 మందికిపైగా అనారోగ్య బాధితులు తమ గోడును చెప్పుకొనేందుకు ఎండీ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రాకు చెందిన ఓ చిరుద్యోగి విధి నిర్వహణలో మద్యం సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్లలో వచ్చింది. కానీ ఆ ఉద్యోగి మద్యం సేవించలేదు. చివరకు బ్రీత్ ఎనలైజర్‌లో సాంకేతిక లోపంలో అలా వచ్చినట్లు తేలింది. కానీ ఆ ఉద్యోగిని మాత్రం సస్పెండ్ చేశారు.ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. తనకు జరిగిన అన్యాయం గురించి ఎండీకి చెప్పుకోనేందుకు వచ్చినా అవకాశం రాలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రిటైడ్ ఉద్యోగులు, ప్రమాద బాధిత ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎండీని కలిసేందుకు వస్తుంటారు. ఇక్కడకొచ్చాక రోజుల తరబడి ఎండీ వద్దకు వీలులేక పస్తులతో అల్లాడుతున్నారు.
ఈడీల స్థాయి మాటా బేఖాతరు
ఆర్టీసీలో ఎండీ స్థాయి అధికారి కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు ఇతర జిల్లాల నుంచి ఎంతో మంది ఉద్యోగులు వస్తుంటారు. వారికి ఎండీ కలిసే అవకాశం లేకపోవడంతో స్థానిక అధికారుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వారు ఎండీని కలిసేందుకు సిఫార్సు చేసినా షాడో ఎండీ అడ్డుకుంటున్నారు.
అధికారి మంచి వారైనా..
ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఎండీనే పెద్ద దిక్కు. తన దృష్టికి వచ్చిన సమస్యలను బాస్ పరిష్కరిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఇలాంటి షాడో ఉద్యోగులతో ఎండీపైనా దురాభిప్రాయం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.