మున్సిపల్ కార్యాలయం భవనం
- గ్రేడ్-1 మున్సిపల్‌లో 55 పోస్టులు ఖాళీ
- ఏ విభాగం చూసినా.. బాధ్యులే కరువు
- ఉన్నవారిని సరెండర్ చేసి.. నియామకాలు నిలిపివేత
- రెగ్యులర్ అధికారులు లేక ప్రజలకు ఇక్కట్లు
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో ప్రధానమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇన్‌చార్జీలే బాధ్యతలు మోస్తున్నారు. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోలందరూ డిప్యుటేషన్లపై వస్తుండటంతో అక్రమాలకు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
రెగ్యులర్ కమిషనర్ కరువు
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీకి నిత్యం ప్రముఖుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రధాన రహదారిని శుభ్రం చేయడం, లైనింగ్ (సున్నం) తదితర పనులు చేయాల్సి ఉంటుంది. దీని పర్యవేక్షణకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణను 2014లో నల్లగొండ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
అదే సమయంలో ప్రత్యేకాధికారి పాలనలో మున్సిపాలిటీ ఉండగా.. సంగారెడ్డి ప్రత్యేకాధికారి, జేసీ శరత్ ఇన్‌చార్జి కమిషనర్ వీరారెడ్డి సూచనల మేరకు ఎస్సైను అక్కడి నుంచి తొలగించారు. కానీ, ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరూ నియమితులు కాలేదు. అనంతరం టౌన్‌ప్లానింగ్ అధికారి నర్సింగరావును కొంతకాలం జోగిపేట నగర పంచాయతీకి ఇన్‌చార్జిగా టీపీఎస్ హోదాలో పంపించారు.
అక్కడ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని సరెండర్ చేశారు. ఆయన స్థానంలోనూ ఎవరూ రాలేదు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అప్పటి ఇన్‌చార్జి కమిషనర్ వీరారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కృష్ణారెడ్డిని సంగారెడ్డి కమిషనర్‌గా నియమించారు. కానీ, ఆరు నెలలు తిరగకుండానే కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆయన పనితీరుపై అసంతృప్తితో ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఆయన స్థానంలో డిప్యూటీ ఇంజినీర్ గయసోద్దీన్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన సైతం పనిచేయడం లేదని ఆగ్రహించిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్.. గయసోద్దీన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి సాయిలుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉన్నారు. అనంతరం అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టర్ కోరడంతో జెడ్పీ సీఈఓ మధుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
కానీ, ఆరు నెలలు తిరగకుండానే బదిలీపై వెళ్లారు. దీంతో మరోసారి ఇన్‌చార్జి కమిషనర్‌గా సాయిలు నియమితులయ్యారు. నెలరోజులకే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున అదనపు సంయుక్త కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు అప్పగించారు. రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు రెగ్యులర్ కమిషనర్‌ను ఇవ్వలేకపోయారు.
ఫలితంగా అభివృద్ధి పనులు నిలిచిపోవడమేకాకుండా, పరిపాలన పరంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏ విభాగంలోనూ రెగ్యులర్ ఉద్యోగులు లేనందున ఆర్థిక పరమైన విషయాల్లో ఎవరికి అదనపు బాధ్యతలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బిల్లుల వసూలు బాధ్యతను అప్పగించగా భారీ అవనీతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
మున్సిపాల్‌లో ఖాళీల వివరాలు
సక్రమంగా పనిచేయడం లేదంటూ ఒక వైపు ఉన్నతాధికారులు.. మరో వైపున పాలకవర్గ సభ్యులు అధికారులను సరెండర్ చేశారు. కానీ, వారి స్థానంలో ఎవరినీ నియమించడం లేదు. ఫలితంగా మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, టీపీఆర్వో, నాలుగు సీనియర్ స్టెనోగ్రాఫర్లు‡ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెజిటెడ్ పోస్టులు మూడూ ఖాళీగా ఉన్నాయి.
నాన్‌గెజిటెడ్ పోస్టులు 58, నాల్గవ తరగతి ఉద్యోగులు 66కు కేవలం 24 మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ఇంకా 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా టౌన్‌ప్లానింగ్ సెక‌్షన్‌లో 9, ఇంజినీరింగ్ విభాగంలో 13, శానిటేషన్ విభాగంలో పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్, 2 శానిటరీ జవాన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.