లీడర్ల గుండెల్లో.. విలీన గుబులు
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తెల్లాపూర్ మున్సిపాలిటీ?
● కలవరపడుతున్న రాజకీయ నాయకులు ● పదవులు కోల్పోతామని ఆవేదన
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ జీహెచ్‌ఎంసీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం స్థానిక నేతలు, ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిలర్లు తమ పదవులు ఎక్కడ కోల్పోతామోనని గుబులు పడుతున్నారు. అలాగే అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి దూరమవుతామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ గ్రామపంచాయతీగా ఉండేది. ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించింది. 17 వార్డులను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులందరూ కౌన్సిలర్లుగా పోటీ చేశారు. ఇదంతా జరిగి సుమారు ఐదేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులకు మరో మూడు నాలుగు నెలల పదవీకాలం ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు కొందరు లీడర్లు సిద్ధమవుతున్నారు. అయితే తెల్లాపూర్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారనే వార్త నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ విలీనమైతే రాజకీయ పదవులు పొందలేమన్న భావనలో కార్యకర్తలున్నారు.
10 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు
తెల్లాపూర్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని పదేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాటి కలెక్టర్ స్థాయి అధికారులు తెల్లాపూర్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు నిరాకరించారు. దాంతో కొంత కాలం తరువాత పంచాయతీ కాస్త మున్సిపాలిటీగా ఏర్పడింది.
తెల్లాపూర్ మున్సిపాలిటీగా..
రామచంద్రాపురం మండలంలోని ఐదు గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామపంచాయతీలను కలిపారు. అయినా గానీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న తెల్లాపూర్‌ను సెమీ అర్బన్‌గా చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.
ఆశ.. నిరాశ
ఐదేళ్లుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ముందు చూపుతో వారి పార్టీల కోసం కష్టపడుతూ వస్తున్నారు. భవిష్యత్‌లో తాము కూడా కౌన్సిలర్‌లుగా పోటీ చేస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండటం కూడా ఇందుకు కారణం. తెల్లాపూర్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం వార్తలు వెలువడటంతో వారు నిరాశకు లోనవుతున్నారు. తాము రాజకీయ పదవులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి వారి సమస్యలను నివేదించేవారు. అవసరమైతే కౌన్సిలర్‌లను నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ జీహెచ్‌ఎంసీలో విలీనమైతే సమస్యలు చెప్పుకోవడం కష్టం అవుతుందనే అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment