Tellapur
-
ప్రాపర్టీ ధరల పెరుగుదలలో కోకాపేట అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట బంగారం కంటే ఖరీదైపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం, నివాసం ఉండటం డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలలో దేశంలోనే కోకాపేట రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 89 శాతం మేర పెరుగుదల నమోదు కాగా.. బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్‌లో 53 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో ఈ ప్రాంతంలో ధర చదరపు అడుగుకు రూ.4,750గా ఉండగా.. 2024 నాటికి రూ.9 వేలకు పెరిగింది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఖరీదు కావడంతో విల్లాల కంటే ఎక్కువగా హైరైజ్ భవనాలనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకూ కోకాపేట బడ్జెట్ హోమ్స్ దొరికేవి కానీ, ఇప్పుడు 40 అంతస్తుల స్కై స్క్రాపర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిష్టంగా 8 వేల చదరపు అడుగు నుంచి గరిష్టంగా 16 వేల చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు.ధర రూ.2.5 కోట్లకు పైమాటే.. గత ఐదేళ్లలో కోకాపేటలో దాదాపు 12,920 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ఇందులో అల్ట్రా లగ్జరీ గృహాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన యూనిట్ల వాటా 52 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 30 శాతం మధ్య, ప్రీమియం విభాగం యూనిట్లు, రూ.1.5–2.5 కోట్ల మధ్య ఉన్న లగ్జరీ గృహాల వాటా 19 శాతంగా ఉంది.బాచుపల్లిలో బూమ్.. బాచుపల్లిలో కూడా రియల్టీ మార్కెట్ బూమ్‌లో ఉంది. ఇక్కడ గత ఐదేళ్లలో ధరలు 57 శాతం పెరిగాయి. 2019లో ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.3,690 ఉండగా.. 2024 నాటికి రూ.5,800లకు పెరిగాయి. మిడ్, ప్రీమియం విభాగానికి బాచుపల్లి కేంద్రంగా మారింది. 2019లో తెల్లాపూర్‌లో ధర చదరపు అడుగుకు రూ.4,819గా ఉండగా.. 2024 నాటికి 53 శాతం వృద్ధి రేటుతో రూ.7,350కు పెరిగాయి. తెల్లాపూర్‌లో గత ఐదేళ్లలో 18,960 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 66 శాతం ప్రీమియం, 34 శాతం లగ్జరీ విభాగం గృహాలే.చదవండి: మాట మార్చిన నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని.. సంపన్న వర్గాల ఆసక్తి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో రద్దీ పెరగడంతో ఇక్కడి వారు కోకాపేటకు మారుతున్నారు. ఈ ప్రాంతం హై ప్రొఫైల్, ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డెస్టినేషన్‌గా మారింది. – ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్మౌలిక వసతులే మెయిన్ ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటమే బాచుపల్లి హైలైట్. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌తో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ప్రవాసులు, ఉన్నత హోదా ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
లీడర్ల గుండెల్లో.. విలీన గుబులు
జీహెచ్ఎంసీ పరిధిలోకి తెల్లాపూర్ మున్సిపాలిటీ? ● కలవరపడుతున్న రాజకీయ నాయకులు ● పదవులు కోల్పోతామని ఆవేదన రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం స్థానిక నేతలు, ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిలర్లు తమ పదవులు ఎక్కడ కోల్పోతామోనని గుబులు పడుతున్నారు. అలాగే అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి దూరమవుతామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ గ్రామపంచాయతీగా ఉండేది. ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించింది. 17 వార్డులను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులందరూ కౌన్సిలర్లుగా పోటీ చేశారు. ఇదంతా జరిగి సుమారు ఐదేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులకు మరో మూడు నాలుగు నెలల పదవీకాలం ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు కొందరు లీడర్లు సిద్ధమవుతున్నారు. అయితే తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారనే వార్త నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ విలీనమైతే రాజకీయ పదవులు పొందలేమన్న భావనలో కార్యకర్తలున్నారు.10 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలుతెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పదేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాటి కలెక్టర్ స్థాయి అధికారులు తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు నిరాకరించారు. దాంతో కొంత కాలం తరువాత పంచాయతీ కాస్త మున్సిపాలిటీగా ఏర్పడింది.తెల్లాపూర్ మున్సిపాలిటీగా..రామచంద్రాపురం మండలంలోని ఐదు గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామపంచాయతీలను కలిపారు. అయినా గానీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న తెల్లాపూర్‌ను సెమీ అర్బన్‌గా చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.ఆశ.. నిరాశఐదేళ్లుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ముందు చూపుతో వారి పార్టీల కోసం కష్టపడుతూ వస్తున్నారు. భవిష్యత్‌లో తాము కూడా కౌన్సిలర్లుగా పోటీ చేస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండటం కూడా ఇందుకు కారణం. తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం వార్తలు వెలువడటంతో వారు నిరాశకు లోనవుతున్నారు. తాము రాజకీయ పదవులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి వారి సమస్యలను నివేదించేవారు. అవసరమైతే కౌన్సిలర్లను నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీలో విలీనమైతే సమస్యలు చెప్పుకోవడం కష్టం అవుతుందనే అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి’
సాక్షి, సంగారెడ్డి: బీజేపీ వాళ్ళకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీష్ రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని సెటైర్లు వేశారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణి కార్యక్రమం శనివారం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు పేదల సొంతమయ్యాయని పేర్కొన్నారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయని, పనిచేయవని విమర్శించారు. హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్ హాల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. చదవండి: మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు? ‘బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు, బండి పొతే బండి ఇస్తామన్నారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు. బండి లేదు గుండు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారా ? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్‌ను ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? - మంత్రి శ్రీ @BRSHarish.#DignityHousing pic.twitter.com/Uddlkvy64E — BRS Party (@BRSparty) September 2, 2023