
తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.
విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.