హరీష్.. పెద్ద సవాల్! | Harish .. biggest challenge! | Sakshi
Sakshi News home page

హరీష్.. పెద్ద సవాల్!

Published Tue, Jul 1 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

హరీష్.. పెద్ద సవాల్!

హరీష్.. పెద్ద సవాల్!

- ప్రతిష్టాత్మకంగా ఆ రెండు పథకాలు..
- ‘గొలుసు కట్టు’తో దశమార్చేందుకు యత్నం
- వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ కోసం ఎలా పోరాడారో.. వచ్చిన తెలంగాణను బంగారుమయం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అంతే తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. గొలుసుకట్టు చెరువులు, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మకమైన ఈ రెండు పథకాలను విజయవంతంచేయడానికి అహర్నిశలు పాటుపడుతున్నారు. అడ్డంకులు ఎదురవుతాయని తెలిసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతున్నారు. పై పథకాల ఫలాల రుచిని మెతుకుసీమ ప్రజలకు చూపిస్తానని చెప్తున్నారు. ఈ మహా సంకల్ప యజ్ఞంలో ప్రజల సహకారం ఉంటే సాధించి తీరతానని హరీష్ అంటున్నారు.
 
తెలంగాణ సంస్కృతిలో గొలుసుకట్టు చెరువులు ఓ భాగం. కానీ  నిజాం రాజుతో పాటే ఈ గొలుసుకట్టు చెరువులు అంతర్థానమైపోయాయి. ఎన్నికల మేనిఫెస్టోలో గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరిస్తామని గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. 67 ఏళ్లుగా కబ్జాకు గురై అవశేషాలు కూడా కోల్పోయిన చెరువులను గుర్తించడం ఎలా? గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా? చెరువు భూముల స్వాధీనం అంటే తేనె తుట్టెను కదిపినంతగా భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ సమస్య.. సవాల్‌గా మారింది. నీటిపారుదల శాఖమంత్రిగా హరీష్‌రావు సవాల్‌ను స్వీకరించారు. ఇందుకు నాందిగా మెతుకుసీమలోనే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు తొలి అడుగుపడింది.
 
చిన్న నీటిపారుదల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో 100 ఎకరాలకు పైగా సాగు నీరు అందించే చెరువులు 582 వరకు ఉన్నాయి. వీటి ద్వారా 1.28 లక్షల ఎకారలకు సాగు నీరు అందించవచ్చు. 100 ఎకరాలకులోపు సాగు నీరు అందించే చెరువులు 6,207 వరకు ఉన్నాయి. ఈ చెరువుల ద్వారా 1.16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ, వీటిలో దాదాపు 70 శాతం చెరువులు(ఎఫ్‌టీఎల్.. ఫుల్ ట్యాంక్ లెవల్) కబ్జాకు గురి అయ్యాయని, పట్టణ ప్రాంతాల్లో నేతలు, రియల్ వ్యాపారులు కబ్జాపెట్టి ప్లాట్లు చేసి అమ్ముకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలుగా మార్చుకున్నారని అధికారులు తేల్చారు.

మరి కొన్ని చెరువుల అలుగులు, తూములు కబ్జాకు గురి అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యలను అధిగమించి గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేయడం సలువుకాదని అధికారులు నిరాసక్తత వ్యక్తం చేశారు. ‘కలిసి ప్రయత్నం చేద్దాం.. ఫలితం ఎందుకు రాదో చూద్దాం... నీళ్లు చేరే పది చెరువులు చూడండి. ప్రయోగాత్మకంగా పనులు మొదలు పెడదాం. నేను మీకు అండగా నిలబడతా’ అని హరీష్ చెప్పడంతో జిల్లా యంత్రాంగం చెరువుల సర్వే పనుల్లో నిమగ్నమైంది. గొలుసుకట్టు చెరువుల స్వరూపాన్ని వెలికిపట్టుకునే పనిలో పడ్డారు.
 
తేనె తుట్టెను పట్టేస్తారా..!
మెతుకుసీమలో వక్ఫ్ బోర్డుకు 36 వేల ఎకరాల భూమి ఉండేది. ఇనాం భూముల ఆదాయంతో ఉర్సు, ఉత్సవాలతో దర్గాలు జోరుమీదుండేవి. ఇప్పుడా జోరు లేదు. దర్గా, మసీదుల ఆస్తులు కబ్జా కోరల్లో పడి కరిగిపోయాయి. రికార్డులు మాయమయ్యాయి. 66 ఏళ్లుగా వక్ఫ్ భూములపై అజమాయిషీ లేదు. ఎక్కడికక్కడా కబ్జా పెట్టారు.

ఎవరికి అందినకాడికి వారు దోచుకున్నారు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ వక్ఫ్ భూముల వ్యవహారం తేనెతుట్టెలా మారింది. ఏ పాలకులూ ఈ తుట్టెను తట్టిలేపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడా తుట్టెను తట్టిలేపేందుకు మంత్రి హరీష్‌రావు ముందుకొచ్చారు. మెదక్ జిల్లా నుంచే సర్వే మొదలు పెట్టేందుకు అధికారులు కదిలారు. పాత రికార్డుల బూజు దులిపారు.

ఒక్కొక్క పేజీని తిప్పేస్తే తొలి సర్వేలోనే జిల్లాలో 26 వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నట్లు తేలింది. రెండోసారి సర్వే చేస్తే మరో 10 వేల ఎకరాలు తేలుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో సగభాగం జిల్లాలో ఉన్నట్లు తేలింది. అయితే ఈ భూమిలో 80 శాతం కబ్జా పాలైపోయింది. ఈ భూమిని సామాన్యుని నుంచి భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా నేతల వరకు అనుభవిస్తున్నారు.  
 
వ్యాపారులు, బడా నేతలు ఆయన మీద రాజకీయ కుట్రకు వ్యూహం పన్నేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినా వెనుకడుగు వేసేది లేదంటున్నారు మంత్రి హరీష్‌రావు. ఆ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్థానిక ప్రాంతంలోని ముస్లింల అభివృద్ధికి, యువతకు ఉపాధి, విద్యపై ప్రాముఖ్యనిస్తూ ఖర్చు చేస్తామని మంత్రి చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో ప్రజలు తమను అర్థం చేసుకుంటారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తరతరాలుగా పెరిగిపోతున్న అక్రమాల పుట్టను ప్రజా సంక్షేమం కోసం పెకిలిస్తామని అంటున్న మంత్రి సంకల్పానికి అండగా నిలబడాలని జిల్లాప్రజానీకం కోరుకుంటోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement