వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి
ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు
మీడియా సమావేశంలో టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడిచినా, ఉద్యోగుల సమస్యల పట్ల సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడం ఇదే మొదటిసారి అని, ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం టీఎన్‌జీఓ కార్యాలయంలో టీజేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి వినతులు సమరి్పస్తున్నా, స్పందన మాత్రం రావడం లేదన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని డీఏలు మంజూరు చేస్తుందని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూశారని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి తీపికబురు రాలేదని చెప్పారు. ఆర్థిక సంబంధిత అంశాలే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా పరిష్కరించాల్సిన సమస్యలు కూడా ఉన్నాయని, కనీసం వాటి పట్ల అయినా సీఎం చొరవ తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. ఉద్యోగుల సమస్యలు వినే తీరిక ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని తెలిపారు.
సీఎస్ శాంతికుమారిని కలిసేందుకు జేఏసీ తరఫున ప్రయత్నాలు చేసినా, ఆమె సమయం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ నెల 23న మంత్రివర్గ సమావేశమున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆ రోజు ఉద్యోగుల సమస్యల పట్ల నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. లేకుంటే దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతామని, వారం రోజుల్లో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాల అభిప్రాయాలు స్వీకరించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని సీఎం సూచించడంతో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల తరఫున వినతులు ఇచ్చామన్నారు. ఉద్యోగ జేఏసీతో కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని, ఉద్యోగులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను సైతం ప్రభుత్వం నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం శుభపరిణామమే అయినా, సప్లిమెంటరీ, మెడికల్ తదితర బిల్లులన్నీ పెండింగ్‌లో నెలల తరబడి ఉంటున్నాయని, హెల్త్ కార్డుల అంశం తేలలేదన్నారు. ఇప్పుడు సంఘాల మాటలు కూడా ఉద్యోగులు వినే పరిస్థితి లేకుండా పోతోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలపై జోక్యం చేసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేత సదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున వినతిపత్రాన్ని అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment