సమస్యల్లో కేజీబీవీ టీచర్లు
-
సకాలంలో అందని వేతనాలు
-
కనీస వసతులు కరువే
-
డిమాండ్ల సాధనకు టీచర్ల పోరాటం
-
4న హైదరాబాద్‌లో మహాధర్నా
నిజామాబాద్ అర్బన్:
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం కొన్నేళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా, వారి మొర అలకించిన వారు, సమస్యలు తీర్చిన వారే లేరు. రాత్రింబవళ్లు విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్లకు సరైన సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతనాల సమస్య వేధిస్తూనే ఉంది. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కేజీబీవీ టీచర్లు యూనియన్‌గా ఏర్పడి డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ, 4వ తేదీన హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 36 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. పదవ తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉంటున్నారు. వీరికి కేజీబీవీ టీచర్లు మెరుగైన విద్య, వసతులు అందిస్తూ సక్రమంగా చూసుకుంటున్నారు. కేజీబీవీలు చాలా చోట్ల ఊరికి దూరంగా ఉండడం, ప్రధానంగా మహిళా టీచర్లు కావడంతో కేజీబీవీలో ఉండేందుకు, వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె ఇళ్లలో కొనసాగుతున్న కేజీబీవీల్లో సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న వీరికి రూ.14 వేల వేతనం ఇస్తున్నారు. అది కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
– వివిధ శాఖలలో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లే కేజీబీవీ టీచర్లను కూడా క్రమబద్ధీకరించాలి.
– పదో పీఆర్సీ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్ల వేతనం రూ.37 వేలు, ఉపాధ్యాయుల వేతనం రూ.28 వేలు, పీఈటీలకు రూ.22 వేలు, అకౌంటెంట్‌కు రూ.20 వేలు, ఏఎన్‌ఎంకు రూ.18 వేల మేర పెంచాలి.
– ఆకస్మిక సెలవులు 20, ప్రత్యేక ఆసస్మిక సెలవులు 7 మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
– వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
– హెల్త్‌కార్డుల మంజూరీతో పాటు వేసవి సెలవుల్లోనూ వేతనం ఇవ్వాలి.