మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్‌లో వివరించారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్‌లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్‌లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు.
ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్‌పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్‌కోడ్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment