సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని వివిధ విభాగాల్లో 15 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న, మిగిలిపోయిన దాదాపు 1000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాల్లో డీఈవోలు అక్టోబర్ 3న నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. అలాగే వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23న రాత పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (యూఆర్‌ఎస్), 84 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌వో), కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), అకౌంటెంట్, నర్సు పోస్టులను, ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, ఐఈఆర్‌పీ పోస్టులను భర్తీ చే యనుంది. అలాగే 391 పాత కేజీబీవీల్లోనూ ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. సీఆర్‌టీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి, మెరిట్‌తోపాటు రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా వాటిని భర్తీ చేయాలని వెల్లడించింది. మొత్తంగా అక్టోబర్ 30లోగా ఈ పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. జిల్లా యూనిట్‌గా డీఈవోలు నోటిఫికేషన్లను జారీ చేయాలని వెల్లడించింది.
జిల్లా ఎంపిక కమిటీ ఏర్పాటు..: ఈ పోస్టుల భర్తీకి జిల్లా ఎంపిక కమిటీలను ఏర్పాటు చేసింది. మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఈ నియా మకాలను చేపట్టాలని వివరించింది. ఈ కమిటీకి చైర్ పర్సన్‌గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా డీఈవో వ్యవహరిస్తారు. సభ్యులుగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ, ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తే నేషనల్ ఇన్‌ఫర్మాటిక్ సెంట ర్‌కు చెందిన డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్, డైట్ ప్రిన్సిపాల్ లేదా అతని ప్రతినిధి కమిటీలో సభ్యులుగా ఉంటారు.
భర్తీ చేయనున్న పోస్టులివే..: జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామర్, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సిస్టమ్ అనలిస్టు, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో/మండల రీసోర్సు సెంటర్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్, మండల రీసోర్సు సెంటర్‌లో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్సు పర్సన్
యూఆర్‌ఎస్‌లలో.. కేజీబీవీల్లో.. స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీ, పీఈటీ, అకౌంటెంట్, నర్సు.
ఇదీ షెడ్యూలు (అక్టోబర్ నెలలో..)
3న: నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
7న: దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
10న: దరఖాస్తుల స్క్రూటినీ
11న: రాత పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత పొందిన వారి జాబితా ప్రకటన
23న: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహణ
28న: ఫలితాల ప్రకటన
30న: ఎంపికైన వారిని విధుల్లోకి తీసుకోవడం