నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
- ఆర్వీఎం నియామకాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు వారిని తిరిగి దొడ్డిదారిలో విధుల్లోకి తీసుకొంటూ రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్న రాష్ట్ర ప్రాజెక్టు అధికారి అనుమతితోనే చేపట్టాల్సి ఉంటుంది. అయితే మామూళ్లు దండుకొని దర్జాగా కోరిన చోట పోస్టింగ్‌లు ఇస్తున్నారు.
గత మార్చిలో ములుగు కస్తూర్బాగాంధీ బాలిక హాస్టల్ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అప్పట్లో జిల్లా ఆర్వీఎం పీఓ ప్రకటించారు. అయితే అధికారులకు మామూళ్లు ముట్టడంతో జేసీడీఓ స్థాయి అధికారితో పాటు కార్యాలయంలోని ప్రధాన విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి డబ్బులు దండుకొని ఆ ప్రత్యేకాధికారికి చిన్న కొడూర్ మండలం అల్లీపూర్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు.
చిన్న కోడూర్ మండలం అల్లీపూర్‌లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారి తనకు దూరమవుతున్నందున ములుగు బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆమెకు అక్కడ కాకుండా రాయికోడ్‌కు బదిలీ చేశారు. నంగునూర్ మండల పరిధిలోని నర్మెటలో పనిచేస్తున్న హాస్టల్ ప్రత్యేక అధికారిపై విద్యార్థులు ఆరోపణలు చేయడంతో సిద్దిపేట ఆర్డీఓ విచారణ చేపట్టారు. దాని ఆధారంగా ఆమెను సెస్పెండ్ చేశారు. అనంతరం జేసీడీఓ ప్రకాశ్‌రావు శాఖా పరమైన విచారణ చేపట్టి ఆమెను తొలగించారు.
అయితే 45 రోజుల తరువాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఇవి కేవలం కొన్ని ఉదహారణలు మాత్రమే. అయితే కింది స్థాయి సిబ్బందిని తొలగించి, తిరిగి తీసుకోవడంలో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్య్రతేకాధికారుల వ్యవహరమే కాకుండా సీఆర్టీలో సైతం డబ్బులు దండుకొని బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై జేసీడీఓ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఓలు తమ తప్పును ఒప్పుకోవడంతో కలెక్టర్ వారిని తీసుకోవాలని సూచించడంవల్లే తీసుకున్నామన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నియమకాలు
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తుంపు పొందిన ఏజెన్సీల ద్వారానే నియమించాలి. అయితే నిబంధనలను పట్టించుకోకుండా డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా నియమాకాలు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం ఏజెన్సీల ద్వారానే నియమించడం జరుగుతుందని సమాచార హక్క చట్టం కింద ఆర్వీఎం శాఖకు చెందిన జేసీడీఓ పేర్కొన్నారు. చిన్నకోడూర్ కేజీబీవీలో స్థానిక నాయకులు, ఆర్వీఎం జిల్లా అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే తీసుకోవడం జరిగిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు స్థానిక ఎంఈఓ,ఎంపీడీఓ, ఎస్‌ఓ తదితరులు కుమ్మకై అడ్వయిజరీ కమిటీ పేరుతో డబ్బులు తీసుకొని అర్హత లేని వారిని నియమించారనే ఆరోపణలు వచ్చాయి.
స్పందించని పీఓ
ఎస్‌ఓలను తిరిగి విధుల్లో తీసుకునే విషయంలో ముడుపులు తీసుకుంటున్నారనే విషయమై పీఓను వివరణ కోరే ందుకు ప్రయత్నించినా స్పందించలేదు.