
1,133 కొత్త కొలువులు
♦ 2008 నుంచి ప్రారంభించిన 81 జూనియర్ కాలేజీలకు పోస్టులు మంజూరు
♦ ఉర్దూ మీడియం సెల్ఫ్ ఫైనాన్స్ సెక్షన్లకు 69 లెక్చరర్ పోస్టులు
♦ పార్ట్‌టైం లెక్చరర్ల వేతనాలు రెండింతలు పెంపు
♦ పార్ట్ టైం ల్యాబ్ అటెండర్ల వేతనాలు రూ.3,900 నుంచి రూ.7,800కు పెంపు
♦ ఎస్‌ఎస్‌ఏ, కేజీబీవీ ఉద్యోగుల వేతనాలు కూడా..
♦ 11,839 మంది ఉద్యోగులకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: విద్యా శాఖలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. 2008 తర్వాత ప్రారంభిం చిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,133 పోస్టులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంజూరు చేశారు. వీటితోపాటు సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధన, బోధనేతర సిబ్బంది గౌరవ వేతనాల పెంపునకు గురువారం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 2008 తర్వాత పలు దఫాలుగా 81 జూనియర్ కాలేజీలను ప్రారంభించినా.. వాటికి కావల్సిన బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేయలేదు. దాంతో పూర్తిగా కాంట్రాక్టు విధానంలో బోధన, బోధనేతర సిబ్బందితోనే ఆ కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇది ఇబ్బందికరంగా ఉందని, రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 1,133 పోస్టులను మంజూరు చేసింది.
‘సెల్ఫ్ ఫైనాన్స్’ నుంచి ఉర్దూ మీడియం సెక్షన్లకు విముక్తి
రాష్ట్రంలోని 15 ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడుస్తున్న 21 సెక్షన్లకు సంబంధించి 69 జూనియర్ లెక్చరర్ పోస్టులను కూడా సీఎం మంజూరు చేశారు. ఈ కోర్సుల వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని గమనించిన ప్రభుత్వం.. ఆ కోర్సులకు అవసరమైన 69 పోస్టులను మంజూరు చేసింది. ఇందుకు ఏటా ఖర్చయ్యే రూ. 1.86 కోట్లను ప్రభుత్వమే భరించనుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమించే ఒక్కో ఉర్దూ మీడియం జూనియర్ లెక్చరర్‌కు ఇక నుంచి రూ.27వేల వేతనం అందనుంది.
పార్ట్‌టైం ఉద్యోగులకూ..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 63 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల వేతనాలను ఒక్కో పీరియడ్‌కు రూ.150 నుంచి రూ.300కు పెంచారు. అంటే ఒక్కో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ నెలకు 72 పీరియడ్ల లెక్కన ఇప్పటివరకు రూ.10,800 వేతనం పొందుతుండగా.. ఇకపై రూ.21,600 అందుతాయి. 52 మంది పార్ట్‌టైం ల్యాబ్ అటెండర్ల వేతనాన్ని రూ.3,900 నుంచి రూ.7,800కు పెంచారు. అలాగే ఎస్‌ఎస్‌ఏ, కేజీబీవీల్లో పనిచేస్తున్న దాదాపు 11,839 మంది సిబ్బందికి గౌరవ వేతనాలు పెంచారు.