కన్నీటి కష్టాలు
కేజీబీవీల్లో నీటికి కటకట!
► అల్లాడుతున్న విద్యార్థినులు, ఉద్యోగులు
►మూడు రోజులకోసారి స్నానం..దుస్తులు ఉతుక్కోవడం లేదు
►బహిర్భూమికీ ఆరుబయటకే
ఈ చిత్రం గుమ్మఘట్ట మండలంలోని బీటీపీలో ఉన్న కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయది. పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు అడుగంటడంతో పంచాయతీ బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా అవి విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కొళాయి నీటిని డ్రమ్ముల్లో నిల్వచేసి ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం...నీరు తక్కువగా ఉండడంతో బాలికలంతా పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి పాఠశాలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది.
అనంతపురం ఎడ్యుకేషన్ : లేపాక్షి కేజీబీవీలో 200 మంది విద్యార్థినులతో పాటు 15–18 మంది ఉద్యోగులు ఉన్నారు. భూగర్భజలాలు అడుగంటి ఉన్న ఒక్కబోరూ ఇటీవల ఎండిపోయింది. దీంతో రోజూ ఒక ట్యాంకరు నీళ్లు వస్తున్నాయి. అవి సరిపోకపోవడంతో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా దుస్తులు ఉతుక్కోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా లేపాక్షి ఒక్కటే కాదు జిల్లాలో చాలా కేజీబీవీల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భజలాలు అడుగంటడం...ప్రత్యామ్నాయ మార్గాలు పెద్దగా ఉపయోగపడకపోవడంతో కొన్ని కేజీబీవీల్లోని విద్యార్థులు మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గుమ్మఘట్ట, హిందూపురం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కనగానపల్లి, పరిగి, తనకల్లు, కుందుర్పి, అగళి కేజీబీవీల్లోని విద్యార్థులు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఒక మనిషికి రోజు అవసరాల కోసం కనీసం 70 లీటర్ల నీరు అవసరం. అయితే కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇందులో సగం కూడా దొరకడం లేదు.
మూడు రోజులకోసారి స్నానం
నీటి కొరత కారణంగా కొన్ని కేజేబీవీల్లో విద్యార్థినులు మూడు రోజుకోసారి స్నానం చేస్తున్నారు. తరగతి గదిలో చమట వాసన భరించలేకున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కోవడం లేదు. దీంతో మాసిన దుస్తులను వేసుకుంటున్నారు. గుమ్మఘట్ట కేజీబీవీలో నీటి సమస్య కారణంగా తరగతుల వారీగా వంతుల ప్రకారం స్నానాలు చేస్తున్నారు. అంటే వారంలో తొలిరోజు 6వ తరగతి, ఆతర్వాతి రోజు 7వ తరగతి ఇలా వంతుల వారీగా స్నాలకు నీళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక శెట్టూరు కేజీబీవీలో బోరు ఎండిపోగా ఇటీవల మండలస్థాయి ‘మీకోసం’ కార్యక్రమంలో స్వయంగా స్పెషలాఫీసర్ ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం నీటి సమస్య ఉంది కదా ‘సర్దుకోవాలి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. నీటి సమస్య తీవ్రతరం కావడంతో చాలా కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు. దీంతో విద్యార్థినులు బహిర్భూమికోసం ఆరుబయటకు వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కేజీబీవీల్లో నీటి కష్టాలను తప్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధిగమిస్తాం
వేసవికాలం ప్రారంభం కాగానే చాలాప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయి. నీటి సమస్య అధికంగా ఉంటుంది. అయితే విద్యార్థినులెవరూ ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని ఆదేశించాం. నీటి సమస్య ఉన్నచోట అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థినీ ఇబ్బంది పడకుండా చూస్తాం.
– సుబ్రమణ్యం, పీఓ ఎస్‌ఎస్‌ఏ