కష్టాల..కస్తూరిబా | Kasturba Gandhi Girls Schools KGBV Scheme Fluoride water | Sakshi
Sakshi News home page

కష్టాల..కస్తూరిబా

Published Mon, Aug 4 2014 12:47 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

కష్టాల..కస్తూరిబా - Sakshi

కష్టాల..కస్తూరిబా

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామీణ ప్రాంతాలలోని వెనుకబడిన వర్గాల పిల్లల్లో ప్రాథమికోన్నత విద్యాస్థాయిలో మగపిల్లల కంటే బాలికల నమోదు చాలా తక్కువగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో హాస్టల్ వసతి కల్పిస్తూ కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటు చేశారు. లక్ష్యం బాగానే ఉన్నా.. నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది.  విద్యాలయాలు కష్టాలకు నిలయాలుగా మారాయి. మంచినీరు లేక ఫ్లోరైడ్ నీటిని తాగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వసతుల మధ్య సాగుతున్న ఈ విద్యాలయాల్లో విద్యార్థినుల సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోంది.
 
 విద్యార్థినుల సంఖ్యను పెంచడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉండాలి. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదు. జిల్లాలో 46 కస్తూరిబా బాలికల విద్యాలయాలు ఉండగా కేవలం 7964 మంది విద్యార్థినులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. మౌలిక వసతుల లేమికి తోడు సరిపడా సీఆర్‌టీలు కూడా లేరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటివరకు నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు. ఇష్టానుసారంగా మెనూ పాటిస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదు. నూతన భవనాల్లో సైతం సరైన వసతులు లేక విద్యార్థినులు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా అద్దె భవనాల్లో నిర్వహించే పాఠశాలల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.
 
 మంచినీటి కోసం విద్యాలయంలోని బోరు ద్వారా వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోంది. ఒక్కొక్క విద్యాలయంలో ఒక స్పెషల్ ఆఫీసర్, ఏడుగురు సీఆర్‌టీలు, ఒక పీఈటీ ఉండాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా 27 సీఆర్‌టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టించుకోవడం లేదు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆత్మకూర్(ఎం), తుర్కపల్లి మండలాల్లోని కస్త్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వస తి, విద్యుత్ వసతులు లేక విద్యార్థినులు రెండు మూడు రోజు లకోసారి స్నానాలు చేస్తున్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి సమయాల్లో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థినులకు కాస్మోటిక్ బిల్లులు రాలేదు.  
 
 ువనగిరి నియోజకవర్గంలోని భువనగిరిలో మైనార్టీ, వలిగొండ మండలం లోతుకుంట, భూదాన్‌పోచంపల్లిలో ఉన్న కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంచినీరు, విద్యుత్, ఉపాధ్యాయుల, ఫర్నిచర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.  భువనగిరి, వలిగొండల్లో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. మున్సిపల్ ట్యాంకర్ రెండురోజులకోసారి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫామ్స్, ట్రంక్‌పెట్టెలు, తెలుగు పాఠ్యపుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు.
 
 ేవరకొండ కస్తూరిబా పాఠశాలలో విద్యుత్, నీటి సమస్యలు నెలకొనగా పీఏపల్లి పాఠశాలలోవిద్యార్థినులు బోరింగు నీటిపైనే ఆధారపడ్డారు. విద్యార్థినులకు ప్రభుత్వం సరఫరా చేసే దొడ్డు బియ్యంతోనే వండిపెడుతుండటంతో అన్నం తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి కస్తూరిబా పాఠశాలలో మ్యాథ్స్ పోస్టు, డిండి పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పోస్టు, పీఏపల్లి మండలంలో ఇంగ్లీష్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, డిండి కస్తూరిబా పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో భద్రత కొరవడింది.  
 
 హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో నిరుపయోగంగా ఉన్న వ్యవసాయసబ్ మార్కెట్ యార్డులో పాఠశాలను ఏర్పాటు చేశారు. మేళ్లచెరువులోని పాత ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనంలో కేవలం ఆరు గదులు మాత్రమే ఉండటంతో ఇరుకు గదుల్లో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మరుగుదొడ్లు విద్యార్థినులకు సరిపడా లేకపోవడంతో ఆరుబయటకు వెళుతున్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో నూతన భవనం నిర్మించినప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదు.
 
 పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతోపాటు లోవోల్టేజీ విద్యుత్ సమస్య నెలకొనడం వల్ల తరచు విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల అద్దె భవనంలో ఉంది. మౌలిక సదుపాయాలు లేవు. నిడమనూరు, పెద్దవూర మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొన్నది. ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్‌ను కొనుగోలు చేసి తాగుతున్నారు. పెద్దవూరలోని విద్యాలయానికి వ్యవసాయ విద్యుత్ లైన్‌నుంచి కనెక్షన్ తీసుకోవడంతో పాఠశాలలో రోజుకు 4 గంటలకు మించి కరెంట్ ఉండటం లేదు. రాత్రి సమయంలో విద్యార్థినులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో పాఠశాల చుట్టూప్రహరీలేకోవడంతో విద్యార్థినులకు రక్షణ కరువైంది.
 
 కోదాడ నియోజకవర్గంలో నడిగూడెం, మునగాల, మోతె మండల కేంద్రాల్లో కస్తూరిబా పాఠశాలలున్నాయి. మోతెలోని పాఠశాలకు నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పనిచేయడంలేదు. పీఈటీ పోస్టు ఖాళీగా ఉంది. నడిగూడెం పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు నాలుగే మరుగుదొడ్లు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకుండా బయటనుంచి వచ్చిపోతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల మండలాలలో మూడు కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రధానంగా నీటికొరత తీవ్రంగా ఉంది. మిర్యాలగూడ పాఠశాలలో188 మంది, దామరచర్లలో 200, వేములపల్లిలో 180 మంది విద్యార్థినులు ఉన్నారు. దామరచర్లలో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ బోధించే ఉపాధ్యాయులు లేరు. వేములపల్లి పాఠశాలలో బోరులో సరిపడ నీరులేక విద్యార్థినులు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు.
 
 కిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 200 మందికి గాను 193 మంది ఉన్నారు. ఇక్కడ మౌలిక వసతులలేక తీవ్ర ఇబ్బందులు విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు. ఇంగ్లీష్, జీవవాస్త్రం,భౌతికశాస్త్రం, తెలుగు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద విధంగా కట్టంగూర్‌లోని విద్యాలయంలో లోఓల్టేజీ సమస్య ఉంది.  అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది.
 
 సూర్యాపేట పట్టణంలోని కస్తూరిబా పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. చివ్వెంల మండల కేంద్రంలోని పాఠశాలకు రెగ్యులర్ ఎస్‌ఓ లేడు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు నోట్‌పుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు రాలేదు, పాఠశాలలో వేసిన స్కీంబోరు నుంచి వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాలలో అద్దె భవనంలో తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, మూత్రశాలలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నా వినియోగం లేవు. ుంగతుర్తి నియోజకవర్గంలో 6 కేజీబీవీలు ఉన్నాయి. తిరుమలగిరి, శాలిగౌరారం, నూతనకల్ పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈమూడు పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది.
 
 నూతనకల్, అర్వపల్లిలలో సోషల్ సీఆర్‌టీలు, తిరుమలగిరిలో బయాలాజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా యూనిఫామ్స్ రావడం లేదు. సీఆర్‌టీలకు సరిగా వేతనాలు కూడా లేవు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల వసతి గృహంలో కృష్ణా మంచినీరు లేకపోవడం వల్ల ప్యూరిఫైడ్ నీటికి రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. మునుగోడులోని విద్యాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో రాత్రి సమయంలో విద్యార్థినులు భయం భయంతో ఉంటున్నారు. పాఠశాలల్లో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ శిక్షకులు, క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఇంగ్లీష్, కంప్యూటర్, పీఈటీ ఉపాధ్యాయుల లేరు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement