Girls Schools
-
దెయ్యం ఉందంటూ శాంతి పూజలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం శాంతిపూజలు చేశారు. వసతిగృహంలో దెయ్యం ఉం దంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు. దీంతో ‘శాంతి పూజలు చేశాం. వేదపండితుల సమక్షంలో దెయ్యం పారిపోవాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. దెయ్యం వసతి గృహంవైపు రాకుండా అష్టదిగ్బంధనం చేశాం’ అని మామిడిగూడ ఆదివాసులు తెలిపారు. వసతి గృహంలో ఎలాంటి దెయ్యం లేదని, వదంతులు నమ్మొద్దని కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. కరోనాతోనే పిల్లలు రెండేళ్లు చదువులు నష్టపోవాల్సి వచ్చిందని, మళ్లీ దెయ్యం ఉందనే అపోహలు నమ్మి పిల్లల చదువులకు ఇబ్బందులు కలిగించొద్దని తల్లిదండ్రులను కోరారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తులందరం అండగా ఉంటామని తెలిపారు. -
Andhra Pradesh: చిట్టి చెల్లెమ్మకు 'స్వేచ్ఛ'
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్.. దేశంలోని 28 రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉందని, ఇది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చరిత్రను మార్చే శక్తి రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోందన్నారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా విద్యార్థినులకు రూ.32 కోట్లతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి పోస్టర్ విడుదల చేశారు. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని, వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ‘స్వేచ్ఛ’ ద్వారా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా తక్కువ ధరకే నాప్కిన్స్ సరఫరా చేసేందుకు పీ అండ్ జీ (విస్పర్), నైన్ బ్రాండ్ల ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ... వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో దాదాపు 23 శాతం మంది చిట్టితల్లుల స్కూల్ చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టంగా చెప్పారు. ఇటువంటి పరిస్ధితులు మారాలి. చిట్టి తల్లులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తగిన అవగాహన కల్పించాలి బడికి వెళ్లే బాలికలు ఇబ్బంది పడకుండా పాఠశాలల్లో నాడు – నేడు పథకం ద్వారా బాత్రూమ్లు బాగు చేయడం దగ్గర నుంచి శుభ్రమైన నీటి సరఫరాతోపాటు ఇవాళ ప్రారంభిస్తున్న స్వేచ్ఛ కార్యక్రమం కూడా అందులో భాగంగానే చేపట్టాం. దేవుడి సృష్టిలో భాగమైన రుతుక్రమానికి సంబంధించిన అంశాలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే ధోరణి మారాలి. ఈ పరిస్ధితి తొలగిపోయి ఇటువంటి విషయాల్లో చిట్టితల్లులకు తగిన అవగాహన కల్పించాలి. నెలకు ఒకసారి అవగాహన సదస్సు ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 7 నుంచి 10వ తరగతి బాలికల కోసం నెలకు ఒకసారి కచ్చితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. నెలకు ఒకసారి జరిగే ఈ ఓరియెంటేషన్ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్న మహిళా అధ్యాపకురాలితో పాటు సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు కూడా పాలు పంచుకోవాలని ఆదేశిస్తున్నాం. కలసికట్టుగా.. జేసీ – ఆసరా పర్యవేక్షణలో దీంతోపాటు దిశ యాప్ డౌన్లోడ్ గురించి కూడా మహిళా పోలీసు బాలికలకు అవగాహన పెంపొందించాలి. ఇవన్నీ మహిళా శిశు సంక్షేమ, విద్య, ఆరోగ్యశాఖలు కలసికట్టుగా చేపట్టాలి. ఈ మొత్తం కార్యక్రమం ప్రతి జిల్లాలో జేసీ – ఆసరా పర్యవేక్షణలో జరగాలి. నాణ్యమైన, బ్రాండెడ్ నాప్కిన్స్ ఉచితంగా స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మందికిపైగా 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న టీనేజ్ బాలికలకు రూ.32 కోట్ల వ్యయంతో నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందచేస్తాం. ప్రొక్టర్ అండ్ గాంబిల్, హైజీన్ అండ్ హెల్త్ కేర్‌కు చెందిన విస్పర్ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్తో పాటు గోరఖ్‌పూర్ (యూపీ)కు చెందిన ప్రఖ్యాత నైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా నాప్కిన్స్ సరఫరా చేస్తోంది. ఒక్కొక్క చిట్టితల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా అందజేస్తారు. ఎండాకాలంలో వేసవి సెలవుల కంటే ముందే ఒకేసారి పాఠశాలలో పంపిణీ చేస్తారు. సురక్షితంగా డిస్పోజ్‌కు ఇన్సినరేటర్లు స్వేచ్ఛ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నాం. సంబంధిత విద్యాసంస్థలో ఈ మొత్తం కార్యక్రమం అమలు బాధ్యతను నోడల్ అధికారి పర్యవేక్షిస్తారు. వినియోగించిన శానిటరీ నాప్కిన్స్ సురక్షితంగా డిస్పోజ్, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా భస్మం చేసేందుకు ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేశాం. స్కూళ్లలో కూడా బాత్రూమ్లలోనే ఇన్సినరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపాల్టీలలో ప్రత్యేకంగా డస్ట్బిన్లు అందుబాటులో ఉంటాయి. ఎలా డిస్పోజ్ చేయాలన్నది చాలా ముఖ్యం కాబట్టి దానిపై నోడల్ ఆఫీసర్ తగిన అవగాహన కల్పించాలి. చేయూత దుకాణాల ద్వారా గ్రామాల్లో.. స్కూళ్లు, కళాశాలల్లో పంపిణీ చేయడంతోపాటు గ్రామ స్ధాయిలో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవే నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించే కార్యక్రమం చేపడుతున్నాం. ఆయా దుకాణాల్లో ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. చేయూత ద్వారా దుకాణాలు నిర్వహిస్తున్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్ధికంగా మరో వనరు లభిస్తుంది. నిర్వహణకు ప్రత్యేక నిధి రాష్ట్రవ్యాప్తంగా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మనబడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా రూపురేఖలు మార్చేలా నిరంతరం నీటి సరఫరాతో కూడిన బాత్రూమ్లను చిట్టితల్లుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే తొలిదశ నాడు – నేడు కింద 15,715 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తయింది. జూలై 2023 నాటికి అన్ని పాఠశాలల్లో నిర్మాణాలు పూర్తవుతాయి. టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్మాస్టర్తో కూడిన పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశాం. మహిళా సాధికారతలో మనమే ముందు.. మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాల కంటే మనం ముందున్నాం. వైఎస్సార్ అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ రుణాలు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఇళ్ల పట్టాలు, వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా మనది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వమని ఈ రెండున్నరేళ్ల పాలన చూసిన తర్వాత ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ (దిశ స్పెషల్ ఆఫీసర్) కృతికా శుక్లా, సర్వ శిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రి సెల్వి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్‌రెడ్డి, మెప్మా డైరెక్టర్ వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గురుస్సాక్షాత్ అపర కీచక!
సాక్షి, రంపచోడవరం(తూర్పుగోదావరి) : మంచి చదువు లభిస్తుందనే కొండంత ఆశతో ఆదివాసీ బాలికలు ఆశ్రమ పాఠశాలల్లో చేరుతున్నారు. అయితే వారికి విద్య నేర్పాల్సిన గురువులే అత్యాచారాలకు పాల్పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో 50 సంవత్సరాల లోపు ఉపాధ్యాయులను నియమించరాదనే నిబంధన ఉంది. అయితే అది రంపచోడవరం ఐటీడీఏలో అమలుకు నోచుకోవడం లేదు. దాంతో 40 ఏళ్ల లోపు వయసుగలవారు ఉపాధ్యాయులుగా, వార్డెన్లుగా ఉంటున్నారు. వారిలో చాలామంది విద్యార్థినులను లొంగదీసుకోవడం, అబార్షన్లు చేయించడం పరిపాటిగా మారింది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ నిందితులను సస్పెండ్ చేయడం వంటి స్వల్ప శిక్షలు వేసి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు. దీంతో ఇలాంటి నేరాలు చేసేందుకు వారు వెనుకాడడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 93 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 34 గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలు. ఆశ్రమ కళాశాలల్లో బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోవడం లేదు. తాజాగా వై రామవరం మండలం దాలిపాడు గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై వార్డెన్ అత్యాచారాలు చేసి, పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తీవ్రంగా స్పందించారు. వార్డెన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా జైలుకు పంపించారు. గతంలో బోదులూరు, యార్లగడ్డ, టేకులవీధి, చింతూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని పెండింగ్ విచారణ పేరుతో తిరిగి విధుల్లో తీసుకున్నారు. ఆ వ్యవహారాల్లో ‘డబ్బులు’ కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు సంఘటనల్లో బాలికలపై లైంగిక వేధింపులు నాలుగు గోడలకే పరిమితమవుతున్నాయి. అడపాదడపా మాత్రమే బయటకు వస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమం పట్టని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైది. లోతట్టు ప్రాంతంలో కొంత మంది వార్డెన్లు గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. పనిదినాల్లో నిరంతరం ఆశ్రమ పాఠశాలలో ఉండాల్సిన వార్డెన్లు రాత్రి పూట కొన్ని చోట్ల ఉండడం లేదు. అక్కడే ఉండే ఏఎన్ఎంలు, నాల్గో తరగతి సిబ్బందికి అప్పగించి వెళ్లిపోతున్నారు. ప్రక్షాళన చేయాలి ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కొంత మంది అధికారుల తీరుతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఆశ్రమ పాఠశాలలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాలిపాడు ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న సంఘటనను తీవ్రంగా పరిగణించాలి. గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి. –నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే -
బాలికలకు భరోసా..
భూపాలపల్లి అర్బన్: మానసిక వేధింపులు, లింగవివక్షకు గురవుతూ ఎవరికీ చెప్పలేక తమలోతాము కుంగిపోతున్న బాలికల్లో చైతన్యం నింపి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర విద్యాశాఖ నడుంబిగించిం ది. ప్రభుత్వ పాఠశాలల్లో యుక్తవయసు బాలికలు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడానికి బాలిక సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలు లింగవిక్షతోపాటు పలురకాల మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల ఈ సమస్యల ను ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారు. మరోవైపు యుక్త వయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా ఆరో గ్యం, పరిశుభ్రతపై అవగహన కొరవడుతోంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి బాలికల్లో ఆత్మవిశ్వసాన్ని నింపుతూనే వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జీవన నైపుణ్యాలు పెంచేలా సమగ్ర శిక్ష అభియాన్ బాలిక సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలను ఇందుకు ఎంచుకుంది. మొదటి విడతలతో జిల్లాలోని 20 కస్తూరిబా పాఠశాలలతో పాటు భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కాటారం, ఏటూరునాగారం మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో జిల్లాలోని పలు కస్తూరిబా విద్యాలయల్లో వివిధ అంశాలపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ ప్రస్తుతం ఈ క్లబ్‌ల ఏర్పాటుకు ఎంతో ఉపయోగపడుతోంది. 15 మంది సభ్యులతో కమిటీ బాలిక సాధికారత క్లబ్లో భాగంగా 13 నుంచి 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా కస్తూరిబా విద్యాలయ స్పెషల్ అధికారి చైర్మన్‌గా, గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ కన్వీనర్‌గా, ప్రతి తరగతి నుంచి ఇద్దరు ప్రతిభ కలిగిన బాలికలతో మొత్తం 10 నుంచి 12 మంది సభ్యులు, అలాగే ఎక్స్టర్నల్ సభ్యులుగా సమీపంలోని పోలీసుస్టేషన్ నుంచి మహిళా కానిస్టేబుల్ ఉంటారు. ఈ క్లబ్‌లు ప్రతినెలా మొదటి శుక్రవారం సమావేశమై పాఠశాలతో పాటు గ్రామంలోని బాలికల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గుర్తించిన సమస్యలపై సమీక్షిస్తారు. క్లబ్ లక్ష్యాలు.. యుక్త వయసు బాలికల్లో వచ్చే శారీరక మార్పులు, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సంరక్షణ, లింగవివక్ష, జీవన నైపుణ్యాలు వంటి వాటిపై ఈ క్లబ్‌ల ద్వారా అవగహన కల్పిస్తారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు తదితర సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి క్లబ్‌లు చర్యలు తీసుకుంటాయి. విద్యార్థినులను ఎవరైనా మానసికంగా వేధించినా, చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా రు. ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి అమలు.. బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న సాధికారత క్లబ్‌లను డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేస్తాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. బాలికల ప్రయోజనం కోసమే రాష్ట్ర విద్యాశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. – పి.నిర్మల, ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారిణి -
పేరుకే సంస్థానాధీశుల కోట..!
- పాపన్నపేట పాఠశాలలో అన్నీ సమస్యలే - బాలికల పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి... పాపన్నపేట: సంస్థానాధీశుల కోట...పాపన్నపేట . ఆరున్నర దశాబ్దాలు గల సరస్వతీ నిల యంలో అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆరు గదుల్లో 704 మంది విద్యార్థులు కూర్చోలేక సతమతమవుతున్నారు. బాలికల పాఠశాల కోసం ప్రతిపాదనలు పంపి యేడేళ్లు కావస్తున్నా...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మండల కేంద్రమైన పాపన్నపేట బస్టాండ్ పక్కనే కొబ్బరి తోటలో 65యేళ్ల క్రితం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాలం మారుతున్న కొద్దీ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే...ఇక్కడ మాత్రం పెరుగుతోంది. సక్సెస్ పాఠశాలగా కొనసాగుతున్న ఈ పాఠశాలలో 704 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 397 మంది బాలురు, 307మంది బాలికలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఇరుకైన గదుల్లో కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠాలు కూడా సరిగా వినలేక పోతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆరుబయటే విద్యనభ్యసిస్తున్నారు. వర్షం పడితే వారికి సెలవులే.. పాఠశాల పాత భవనం పూర్తిగా శిథిలమై ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటీవల ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో నిర్మించిన ఆరు గదుల్లో తరగతులు కొనసాగుతుండగా, పాత పాఠశాల భవనంలో హెచ్ఎం రూం, కార్యాలయం, స్టాఫ్ రూం, సైన్స్‌ల్యాబ్ నిర్వహిస్తున్నారు. కాగా పాఠశాల గదులపై పెంకులు ఊడిపోయి గోడలు బీటలు వారాయి. ఎప్పుడేమి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. పాఠశాలలో ఉన్న రెండే రెండు టాయిలెట్లు సరిపడక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు బయటకు వెళ్లక తప్పడం లేదు. కిచెన్ షెడ్డు లేకపోవడంతో చెట్లకిందనే వంట చేసి పెడుతున్నారు. వర్షం పడితే వంటలు చేసేసిబ్బంది బాధలు వర్ణనాతీతం. ప్రతిపాదనలు పంపి ఆరేళ్లు బాలికల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆరేళ్లు కావొస్తున్నా..ఇంత వరకు మంజూరుకు నోచుకోలేదు. ఇక్కడ 307 మంది విద్యార్థినులు కిక్కిరిసిన గదుల్లో విద్యార్థులతో కలిసి కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలుఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించి బాలికల పాఠశాల మంజూరు చేయాలని మాజీ విద్యా కమిటీ చైర్మన్ భవాని కిషన్ విజ్ఞప్తి చేశారు. -
తొమ్మిది మంది విద్యార్థినులకు అస్వస్థత
- కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న కస్తూరిబా బాలికలు - నాలుగేళ్ల నుంచి నిషేధిత నీరు తాగుతున్న బాలికలు - 24 గంటల్లో సాగర్‌నీరు అందిస్తాం : డిప్యూటీ కలెక్టర్ కనిగిరి : స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ) విద్యార్థినులు తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వివరాలు.. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు కడుపు నొప్పి, విరేచనాలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వీరిని ఏఎన్ఎం వసుంధర గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి మందులు ఇప్పించింది. తాత్కాలికంగా ఉపశమనం కలగడంతో తిరిగి కేజీబీవీకి తీసుకెళ్లారు. మరుసటి రోజు 8,7 తరగతులకు చెందిన 9 మందికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఏడో తరగతికి చెందిన త్రివేణి, రాజ్యలక్ష్మి, ఎనిమిదో తరగతికి చెందిన బి.అనుషా, అఖిల, ఉమాదేవి, ఎన్.నాగలక్ష్మి, సుష్మ, రాజ్యలక్ష్మి, ఎన్.మౌనిక ఉన్నారు. హాస్టల్లో వైద్య శిబిరం స్థానిక కేజీబీవీ హాస్టల్లో డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎక్కువ మంది విద్యార్థులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు పంపిణీ చేశారు. బోర్‌వాటర్ కావడంతో చాలా మందికి స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు ఆమె తెలిపారు. అధికారుల పరామర్శలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను డిప్యూటీ కలెక్టర్, ఎస్ఎస్ఎ పీఓ ఎంవీ సుధాకర్ పరామర్శించారు. మంచినీరు వల్లే విద్యార్థినులు అనారోగ్యం బారిన పడ్డారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఆర్డ బ్ల్యూఎస్ ఈఈ, డీఈలతో మాట్లాడారు. 24 గంటల్లో కస్తూరిబాకు సాగర్ వాటర్ సరఫరా చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నీటి సమస్యపై సర్పంచ్ సైకం మాలకొండారెడ్డి, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లుతో అధికారులు చర్చించారు. తక్షణ చర్యగా ట్యాంకర్ ద్వారా సాగర్ నీటిని సరఫరా చేయించాలని ఎస్ఓ సుజాతాను ఆదేశించారు. విద్యార్థినులను పరామర్శించిన వారిలో డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.విజయలక్ష్మి, ఎంఈఓ జి.సుబ్బరత్నం, జీసీడీఓ పి.సరస్వతి, ఐఈ కో ఆర్డినేటర్ డి.వెంకారెడ్డి, సీఎంఓ డి.గంగాధర్, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ ఏసోబు ఉన్నారు. అధికారులతో తల్లిదండ్రుల వాగ్వాదం బాలికలు అనారోగ్యానికి గురయ్యారని తెలిసి తల్లిదండ్రులు కేజీబీవీకి, ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యం బాగులేకుంటే సమాచారం ఇవ్వరా.. అని అధికారులను ప్రశ్నించారు. తాము టీవీల్లో చూసి హడావుడిగా రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కష్టాల..కస్తూరిబా
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామీణ ప్రాంతాలలోని వెనుకబడిన వర్గాల పిల్లల్లో ప్రాథమికోన్నత విద్యాస్థాయిలో మగపిల్లల కంటే బాలికల నమోదు చాలా తక్కువగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో హాస్టల్ వసతి కల్పిస్తూ కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటు చేశారు. లక్ష్యం బాగానే ఉన్నా.. నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాలయాలు కష్టాలకు నిలయాలుగా మారాయి. మంచినీరు లేక ఫ్లోరైడ్ నీటిని తాగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వసతుల మధ్య సాగుతున్న ఈ విద్యాలయాల్లో విద్యార్థినుల సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోంది. విద్యార్థినుల సంఖ్యను పెంచడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉండాలి. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదు. జిల్లాలో 46 కస్తూరిబా బాలికల విద్యాలయాలు ఉండగా కేవలం 7964 మంది విద్యార్థినులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. మౌలిక వసతుల లేమికి తోడు సరిపడా సీఆర్టీలు కూడా లేరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటివరకు నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు. ఇష్టానుసారంగా మెనూ పాటిస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదు. నూతన భవనాల్లో సైతం సరైన వసతులు లేక విద్యార్థినులు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా అద్దె భవనాల్లో నిర్వహించే పాఠశాలల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. మంచినీటి కోసం విద్యాలయంలోని బోరు ద్వారా వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోంది. ఒక్కొక్క విద్యాలయంలో ఒక స్పెషల్ ఆఫీసర్, ఏడుగురు సీఆర్టీలు, ఒక పీఈటీ ఉండాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా 27 సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టించుకోవడం లేదు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆత్మకూర్(ఎం), తుర్కపల్లి మండలాల్లోని కస్త్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వస తి, విద్యుత్ వసతులు లేక విద్యార్థినులు రెండు మూడు రోజు లకోసారి స్నానాలు చేస్తున్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి సమయాల్లో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థినులకు కాస్మోటిక్ బిల్లులు రాలేదు. ువనగిరి నియోజకవర్గంలోని భువనగిరిలో మైనార్టీ, వలిగొండ మండలం లోతుకుంట, భూదాన్‌పోచంపల్లిలో ఉన్న కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంచినీరు, విద్యుత్, ఉపాధ్యాయుల, ఫర్నిచర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. భువనగిరి, వలిగొండల్లో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. మున్సిపల్ ట్యాంకర్ రెండురోజులకోసారి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫామ్స్, ట్రంక్‌పెట్టెలు, తెలుగు పాఠ్యపుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. ేవరకొండ కస్తూరిబా పాఠశాలలో విద్యుత్, నీటి సమస్యలు నెలకొనగా పీఏపల్లి పాఠశాలలోవిద్యార్థినులు బోరింగు నీటిపైనే ఆధారపడ్డారు. విద్యార్థినులకు ప్రభుత్వం సరఫరా చేసే దొడ్డు బియ్యంతోనే వండిపెడుతుండటంతో అన్నం తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి కస్తూరిబా పాఠశాలలో మ్యాథ్స్ పోస్టు, డిండి పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పోస్టు, పీఏపల్లి మండలంలో ఇంగ్లీష్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, డిండి కస్తూరిబా పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో భద్రత కొరవడింది. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో నిరుపయోగంగా ఉన్న వ్యవసాయసబ్ మార్కెట్ యార్డులో పాఠశాలను ఏర్పాటు చేశారు. మేళ్లచెరువులోని పాత ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనంలో కేవలం ఆరు గదులు మాత్రమే ఉండటంతో ఇరుకు గదుల్లో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు విద్యార్థినులకు సరిపడా లేకపోవడంతో ఆరుబయటకు వెళుతున్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో నూతన భవనం నిర్మించినప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదు. పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతోపాటు లోవోల్టేజీ విద్యుత్ సమస్య నెలకొనడం వల్ల తరచు విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల అద్దె భవనంలో ఉంది. మౌలిక సదుపాయాలు లేవు. నిడమనూరు, పెద్దవూర మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొన్నది. ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్‌ను కొనుగోలు చేసి తాగుతున్నారు. పెద్దవూరలోని విద్యాలయానికి వ్యవసాయ విద్యుత్ లైన్నుంచి కనెక్షన్ తీసుకోవడంతో పాఠశాలలో రోజుకు 4 గంటలకు మించి కరెంట్ ఉండటం లేదు. రాత్రి సమయంలో విద్యార్థినులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో పాఠశాల చుట్టూప్రహరీలేకోవడంతో విద్యార్థినులకు రక్షణ కరువైంది. కోదాడ నియోజకవర్గంలో నడిగూడెం, మునగాల, మోతె మండల కేంద్రాల్లో కస్తూరిబా పాఠశాలలున్నాయి. మోతెలోని పాఠశాలకు నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పనిచేయడంలేదు. పీఈటీ పోస్టు ఖాళీగా ఉంది. నడిగూడెం పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు నాలుగే మరుగుదొడ్లు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకుండా బయటనుంచి వచ్చిపోతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల మండలాలలో మూడు కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రధానంగా నీటికొరత తీవ్రంగా ఉంది. మిర్యాలగూడ పాఠశాలలో188 మంది, దామరచర్లలో 200, వేములపల్లిలో 180 మంది విద్యార్థినులు ఉన్నారు. దామరచర్లలో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ బోధించే ఉపాధ్యాయులు లేరు. వేములపల్లి పాఠశాలలో బోరులో సరిపడ నీరులేక విద్యార్థినులు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. కిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 200 మందికి గాను 193 మంది ఉన్నారు. ఇక్కడ మౌలిక వసతులలేక తీవ్ర ఇబ్బందులు విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు. ఇంగ్లీష్, జీవవాస్త్రం,భౌతికశాస్త్రం, తెలుగు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద విధంగా కట్టంగూర్‌లోని విద్యాలయంలో లోఓల్టేజీ సమస్య ఉంది. అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. సూర్యాపేట పట్టణంలోని కస్తూరిబా పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. చివ్వెంల మండల కేంద్రంలోని పాఠశాలకు రెగ్యులర్ ఎస్ఓ లేడు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు నోట్‌పుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు రాలేదు, పాఠశాలలో వేసిన స్కీంబోరు నుంచి వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాలలో అద్దె భవనంలో తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, మూత్రశాలలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నా వినియోగం లేవు. ుంగతుర్తి నియోజకవర్గంలో 6 కేజీబీవీలు ఉన్నాయి. తిరుమలగిరి, శాలిగౌరారం, నూతనకల్ పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈమూడు పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది. నూతనకల్, అర్వపల్లిలలో సోషల్ సీఆర్టీలు, తిరుమలగిరిలో బయాలాజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా యూనిఫామ్స్ రావడం లేదు. సీఆర్టీలకు సరిగా వేతనాలు కూడా లేవు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల వసతి గృహంలో కృష్ణా మంచినీరు లేకపోవడం వల్ల ప్యూరిఫైడ్ నీటికి రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. మునుగోడులోని విద్యాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో రాత్రి సమయంలో విద్యార్థినులు భయం భయంతో ఉంటున్నారు. పాఠశాలల్లో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ శిక్షకులు, క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఇంగ్లీష్, కంప్యూటర్, పీఈటీ ఉపాధ్యాయుల లేరు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి.