తొమ్మిది మంది విద్యార్థినులకు అస్వస్థత | Nine of students to illness | Sakshi
Sakshi News home page

తొమ్మిది మంది విద్యార్థినులకు అస్వస్థత

Published Sat, Jul 4 2015 4:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

తొమ్మిది మంది విద్యార్థినులకు అస్వస్థత

తొమ్మిది మంది విద్యార్థినులకు అస్వస్థత

- కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న కస్తూరిబా బాలికలు  
- నాలుగేళ్ల నుంచి నిషేధిత నీరు తాగుతున్న బాలికలు
- 24 గంటల్లో సాగర్‌నీరు అందిస్తాం : డిప్యూటీ కలెక్టర్
కనిగిరి :
స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ) విద్యార్థినులు తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వివరాలు.. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు కడుపు నొప్పి, విరేచనాలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వీరిని ఏఎన్‌ఎం వసుంధర గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి మందులు ఇప్పించింది. తాత్కాలికంగా ఉపశమనం కలగడంతో తిరిగి కేజీబీవీకి తీసుకెళ్లారు. మరుసటి రోజు 8,7 తరగతులకు చెందిన 9 మందికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఏడో తరగతికి చెందిన త్రివేణి, రాజ్యలక్ష్మి, ఎనిమిదో తరగతికి చెందిన బి.అనుషా, అఖిల, ఉమాదేవి, ఎన్.నాగలక్ష్మి, సుష్మ, రాజ్యలక్ష్మి, ఎన్.మౌనిక ఉన్నారు.

హాస్టల్లో వైద్య శిబిరం
స్థానిక కేజీబీవీ హాస్టల్లో డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎక్కువ మంది విద్యార్థులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు పంపిణీ చేశారు. బోర్‌వాటర్ కావడంతో చాలా మందికి స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు ఆమె తెలిపారు.
 
అధికారుల పరామర్శలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను డిప్యూటీ కలెక్టర్, ఎస్‌ఎస్‌ఎ పీఓ ఎంవీ సుధాకర్ పరామర్శించారు. మంచినీరు వల్లే విద్యార్థినులు అనారోగ్యం బారిన పడ్డారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఆర్‌డ బ్ల్యూఎస్ ఈఈ, డీఈలతో మాట్లాడారు. 24 గంటల్లో కస్తూరిబాకు సాగర్ వాటర్ సరఫరా చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నీటి సమస్యపై సర్పంచ్ సైకం మాలకొండారెడ్డి, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లుతో అధికారులు చర్చించారు. తక్షణ చర్యగా ట్యాంకర్ ద్వారా సాగర్ నీటిని సరఫరా చేయించాలని ఎస్‌ఓ సుజాతాను ఆదేశించారు. విద్యార్థినులను పరామర్శించిన వారిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పి.విజయలక్ష్మి, ఎంఈఓ జి.సుబ్బరత్నం, జీసీడీఓ పి.సరస్వతి, ఐఈ కో ఆర్డినేటర్ డి.వెంకారెడ్డి, సీఎంఓ డి.గంగాధర్, ఏఎల్‌ఎస్ కో ఆర్డినేటర్ ఏసోబు ఉన్నారు.
 
అధికారులతో తల్లిదండ్రుల వాగ్వాదం
బాలికలు అనారోగ్యానికి గురయ్యారని తెలిసి తల్లిదండ్రులు కేజీబీవీకి, ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యం బాగులేకుంటే సమాచారం ఇవ్వరా.. అని అధికారులను ప్రశ్నించారు. తాము టీవీల్లో చూసి హడావుడిగా రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement