పేరుకే సంస్థానాధీశుల కోట..!
- పాపన్నపేట పాఠశాలలో అన్నీ సమస్యలే
- బాలికల పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి...
పాపన్నపేట: సంస్థానాధీశుల కోట...పాపన్నపేట . ఆరున్నర దశాబ్దాలు గల సరస్వతీ నిల యంలో అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆరు గదుల్లో 704 మంది విద్యార్థులు కూర్చోలేక సతమతమవుతున్నారు. బాలికల పాఠశాల కోసం ప్రతిపాదనలు పంపి యేడేళ్లు కావస్తున్నా...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మండల కేంద్రమైన పాపన్నపేట బస్టాండ్ పక్కనే కొబ్బరి తోటలో 65యేళ్ల క్రితం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు.
కాలం మారుతున్న కొద్దీ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే...ఇక్కడ మాత్రం పెరుగుతోంది. సక్సెస్ పాఠశాలగా కొనసాగుతున్న ఈ పాఠశాలలో 704 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 397 మంది బాలురు, 307మంది బాలికలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఇరుకైన గదుల్లో కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠాలు కూడా సరిగా వినలేక పోతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆరుబయటే విద్యనభ్యసిస్తున్నారు. వర్షం పడితే వారికి సెలవులే.. పాఠశాల పాత భవనం పూర్తిగా శిథిలమై ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటీవల ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో నిర్మించిన ఆరు గదుల్లో తరగతులు కొనసాగుతుండగా, పాత పాఠశాల భవనంలో హెచ్‌ఎం రూం, కార్యాలయం, స్టాఫ్ రూం, సైన్స్‌ల్యాబ్ నిర్వహిస్తున్నారు.
కాగా పాఠశాల గదులపై పెంకులు ఊడిపోయి గోడలు బీటలు వారాయి. ఎప్పుడేమి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. పాఠశాలలో ఉన్న రెండే రెండు టాయిలెట్లు సరిపడక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు బయటకు వెళ్లక తప్పడం లేదు. కిచెన్ షెడ్డు లేకపోవడంతో చెట్లకిందనే వంట చేసి పెడుతున్నారు. వర్షం పడితే వంటలు చేసేసిబ్బంది బాధలు వర్ణనాతీతం.
ప్రతిపాదనలు పంపి ఆరేళ్లు
బాలికల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆరేళ్లు కావొస్తున్నా..ఇంత వరకు మంజూరుకు నోచుకోలేదు. ఇక్కడ 307 మంది విద్యార్థినులు కిక్కిరిసిన గదుల్లో విద్యార్థులతో కలిసి కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలుఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించి బాలికల పాఠశాల మంజూరు చేయాలని మాజీ విద్యా కమిటీ చైర్మన్ భవాని కిషన్ విజ్ఞప్తి చేశారు.