జాగ్రత్తల నడుమ ‘కస్తూర్బా’ తరగతులు | AP KGBV Schools Reopen With All Covid Precautions | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 24 2020 8:16 PM | Last Updated on Tue, Nov 24 2020 8:17 PM

AP KGBV Schools Reopen With All Covid Precautions - Sakshi

సాక్షి, అమరావతి: అనాథ, నిరుపేద బాలికలకు విద్యాబుద్ధులు నేర్పే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) తరగతులను ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అనేక జాగ్రత్తలు చేపట్టింది. వసతి గృహాలతో కూడిన ఈ విద్యాలయాల్లో 9వ తరగతి నుంచి 12 వరకు గల విద్యార్థినులకు సోమవారం నుంచి తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ప్రస్తుతం నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో అదనపు గదులు, కిచెన్‌ షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన విద్యాలయాల్లో మాత్రం అక్కడి పరిస్థితుల ఆధారంగా తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ డిసెంబర్‌ నెలాఖరులోగా అన్ని విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేలా సూచనలు జారీ అయ్యాయి. 

రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉండగా.. వాటిలో సుమారు 75 వేల మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమైన కేజీబీవీల్లో పరిపాలనా భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, డైనింగ్‌ హాల్స్‌, కిచెన్‌ షెడ్స్‌ అన్నిటినీ శానిటైజ్‌ చేయించారు. బియ్యం, ఇతర సరుకులు, కూరగాయలు, పాలు, వంట గ్యాస్‌ను ముందే సమకూర్చారు.

నిత్య జాగ్రత్తలు తప్పనిసరి
కేజీబీవీల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశారు. ఉదయం పూట నిర్వహించే అసెంబ్లీని రద్దు చేసి కోవిడ్‌ ప్రతిజ్ఞ చేయించాలి. సిబ్బంది, విద్యార్థినులకు రోజుకు రెండుసార్లు విధిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. రాత్రివేళ విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రతి విద్యాలయంలో ఇద్దరు ఉపాధ్యాయులు, వాచ్‌ ఉమన్లు క్యాంపస్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి సీనియర్‌ సీఆర్‌టీ సమయ పట్టికను సిద్ధం చేయాలి. తరగతులను, విద్యార్థినుల అధ్యయనాన్ని పర్యవేక్షించాలి. వంటగది సిబ్బంది తప్పనిసరిగా హెడ్‌ క్యాప్స్, మాస్క్‌లు, గ్లౌజులు ధరించేలా చూడాలి. అవసరానికి అనుగుణంగా విద్యార్థినులకు గోరు వెచ్చని తాగునీరు, పరిశుభ్రమైన వేడి ఆహారం సమకూర్చాలి. డైనింగ్‌ హాల్‌లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. విద్యార్థినులకు ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి తగిలేలా చూడాలి. పీఈటీ పర్యవేక్షణలో మాత్రమే వ్యక్తిగత వ్యాయామాలు, యోగా చేయాలి. మాస్‌డ్రిల్, ఆటలు అనుమతించరు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పడే విద్యార్థినులకు ప్రత్యేక గది కేటాయించాలి. వారి ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతను పార్ట్‌ టైమ్‌ వైద్యులకు అప్పగించాలి. అలాంటి విద్యార్థినులను సమీప ఆస్పత్రి లేదా పీహెచ్‌సీకి తీసుకువెళ్లాలి. విద్యార్థినుల ఆరోగ్య, భద్రతల పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు రోజుల్లో సిబ్బందికి విధులు అప్పగించాలి. 

పూర్తి జాగ్రత్తలతో..
పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కేజీబీవీలను సిద్ధం చేసేలా ప్రణాళిక ఇచ్చారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతిరోజూ ఇద్దరు చొప్పున టీచర్లకు విడతల వారీగా బాధ్యతలు అప్పగించాం.- పి.లిల్లీ ప్రకాశవాణి, స్పెషలాఫీసర్, కేజీబీవీ, పుల్లల చెరువు, ప్రకాశం జిల్లా

అన్ని చర్యలూ చేపడుతున్నాం
కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ చేపడుతున్నాం. తల్లిదండ్రుల నుంచి విధిగా అనుమతి పత్రాలు తీసుకుని విద్యార్థినులను తరగతులకు అనుమతిస్తాం.- ఎన్‌.దీప్తి రాణి, సీఆర్టీ, కేజీబీవీ, బొల్లాపల్లి, గుంటూరు జిల్లా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement