
కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
తాడిపత్రి రూరల్: తాడిపత్రి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి కడుపు నొప్పితో ఒకరిద్దరు బాధ పడుతుండటంతో ఇన్‌చార్జ్ మునెమ్మ వారికి ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. శనివారం హిమాంబీ, భాగ్యలక్ష్మి, శ్రావణి, గౌతమి, కావ్య, చిట్టితోపాటు మరో 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం బాధిత విద్యార్థినులందరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం రాగిమాల్ట్ తాగామని, అప్పటి నుంచి ఇలా ఒక్కొక్కరికి కడుపు నొప్పి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్ అయిపోవడంతో బోరు నీటిని తాగుతున్నారు.
ఎందువలన అస్వస్థతకు గురయ్యారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఆర్డీఓ మలోలా, సర్వశిక్షా అభియాన్ పీఓ సుబ్రమణ్యం హుటాహుటిన తాడిపత్రి చేరుకుని తహసీల్దార్ ఎల్లమ్మ, డీఎస్పీ చిదానందరెడ్డి, రూరల్ సీఐ సురేంద్రానాథ్‌రెడ్డి, ఎంఈఓ నాగరాజు, మునిసిపల్ శానినటరీ ఇన్‌స్పెక్టర్ నరసింహారెడ్డిలతో కలిసి ఆస్పత్రికెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కేజీబీవీ చేరుకుని సౌకర్యాలపై ఆరా తీశారు. ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండటం చూసి సిబ్బందిౖపై అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విద్యాలయంలో ఆహారం, తాగునీటిని పరీక్షించేందుకు శాంపిల్స్ తీసుకెళ్లారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చే నివేదికను బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు.