
ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన.. తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇకనుంచి ఇంటర్ కూడా కొనసాగించనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం అంగీకరించి.. ఇంటర్ బోధనకు సిద్ధమైంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్య అందుతుండగా.. ఇక నుంచి ఇంటర్ వరకు బోధించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరమైన నిధులు విడుదల చేస్తుండగా.. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
కరీంనగర్‌ఎడ్యుకేషన్: డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బాలికల విద్య సబ్ కమిటీ సమావేశం గత డిసెంబర్‌లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌ను కలిసి కేజీబీవీల్లోఇంటర్ వరకు విద్యను పొడగించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. తాజాగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరుగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు జరుగనున్నాయి.
జిల్లాలో 11 కేజీబీవీలు
కరీంనగర్ జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 5,370 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితోపాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజనం మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండుసార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, ఇతర స్నాక్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా న్యాప్‌కిన్స్, కాస్మోటిక్ కిట్లను అందిస్తున్నారు. భవనాలు నిర్మించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పది తర్వాత చదువు కొనసాగించే వీలు
కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలామంది ఇంటర్ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం.. సొంత గ్రామాలకు వెళ్లిపోవడం.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది.
ఎట్టకేలకు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీలను ఇంటర్ విద్య వరకు పొడిగిస్తామని పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే ఇంటర్ చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2100 మంది ఉన్నారు. ఉత్తీర్ణులైన వారందరికీ ప్రయోజనం చేకూరనుంది.
విద్యార్థులకు ప్రయోజనం– అనురాధ, ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి
ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరుగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదో తరగతి వరకే విద్య అందుతోంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్ అభ్యసించకుండా చదువు మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆనంతరం ఇక్కడే చదువుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment