డయేరియాతో బాధపడుతూ గచ్చుపై పడుకున్న విద్యార్థినులు
ఎల్‌ఎన్‌పేట కేజీబీవీలో 24 మంది బాధితులు
వైద్య, విద్యాశాఖాధికారుల పరిశీలన
ఎల్.ఎన్.పేట : లక్ష్మీనర్సుపేట కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఒకరిద్దరే బాధితులు ఉండగా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 24కు చేరింది. ఈ విషయమై సమీపంలోని ప్రభుత్వ ప్రా«థమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఏఎన్‌ఎం మందులు ఇచ్చారని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థినులు చెప్పారు. ఎప్పటికప్పుడు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం తెలియజేస్తున్నామని కేజీబీవీ ప్రత్యేకాధికారి ఎస్.లలితకుమారి తెలిపారు. టి.మాధవి, పి.లత, ఇ.శ్రావణి, భవాని, సుమతి, అనూరాధ, ఎం.సుభాషిణిలతో పాటు పలువురు డయేరియా బారిన పడ్డారు. సమస్య తీవ్రంగా కావడంతో విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశారు. ఆయన స్పందించి జిల్లా ఎపిడమిక్ అధికారి డాక్టర్ గిరిధర్‌ను తక్షణమే కేజీబీవీకి పంపించారు. ఆయన వచ్చిన తర్వాత వైద్యసిబ్బంది చేరుకున్నారు.
అధ్వానంగా పరిసరాలు..
పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, డ్రమ్‌లో పురుగులతో కలిసిన నీరు ఉండటం, మేడపై ట్యాంకులపై మూతల్లేకపోవడం వల్లే అతిసార ప్రబలిందని జిల్లా ఎపిడమిక్ అధికారి డాక్టర్ గిరిధర్ విలేకర్లకు చెప్పారు. వంటగదిలోనూ పరిశుభ్రత లోపించిందని చెప్పారు. ఆహార పదార్థాలపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ వివరాలన్నింటినీ కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.
మినరల్ వాటర్ సరఫరా చేయాలి: డీఈఓ
కేజీబీవీ విద్యార్థినులకు ప్రతిరోజు మినరల్ వాటర్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.దేవానందరెడ్డి ఎస్‌ఓను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎందుకు మినరల్ వాటర్ ఇవ్వలేదని ప్రశ్నించారు. వర్షాకాలంలో కనీసం మరిగించిన నీరైనా ఇవ్వాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
కుళాయి నీరే వాడుతున్నాం: ఎస్‌ఓ
మేడపైనుంచి వర్షం నీరు పడుతున్నప్పుడు పట్టేందుకు డ్రమ్ ఉంచామని, ట్యాంకుల్లో నీరు స్నానాలకు, బాత్‌రూం అవసరాలకు మాత్రమే వాడుతున్నామని ఎస్‌ఓ తెలిపారు. వంటకు, తాగేందుకు పంచాయతీ నుంచి వస్తున్న కుళాయి నీటినే వాడుతున్నామని చెప్పారు.