diaharia
-
కుమ్మరిపాడులో డయేరియా
సోంపేట: పాలవలస పంచాయతీ కుమ్మరిపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. తిన్న ఆహారం, నీరు కలుషితం కావడంతో సుమారు 40 మంది డయేరియా బారిన పడ్డారని కొర్లాం వైద్యాధికారులు తెలిపారు. కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చికిత్సలు చేయడంతో పాటు, కుమ్మరిపాడు గ్రామంలో కొర్లాం పీహెచ్సీ వైద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించి రోగులకు సలహాలు సూచనలు అందించారు. కొర్లాం ఆస్పత్రిలో నారాయణరావు, మాధవరావు, తిరుపతమ్మ, వరలక్ష్మి, కాంతమ్మ తదితర 40 మందికి వైద్య పరీక్షలు చేశారు. కుమ్మరిపాడు గ్రామంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. గ్రామంలో ఆదివారం ఓ విందుభోజనం ఆరగించిన తర్వాత ఇలా జరిగిందని గ్రామస్తులు పలువురు చెబుతున్నారు. నిల్వ ఉన్న పదార్థాలు వినియోగించడం వల్ల, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల డయేరియా వ్యాపించిందని వైద్యాధికారులు పేర్కొన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగమని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని రోగులకు సూచించారు. గ్రామంలోని బావుల్లో వైద్య సిబ్బంది క్లోరినేషన్ చేశారు. -
డయేరియా విజృంభణ
ఎల్ఎన్పేట కేజీబీవీలో 24 మంది బాధితులు వైద్య, విద్యాశాఖాధికారుల పరిశీలన ఎల్.ఎన్.పేట : లక్ష్మీనర్సుపేట కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఒకరిద్దరే బాధితులు ఉండగా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 24కు చేరింది. ఈ విషయమై సమీపంలోని ప్రభుత్వ ప్రా«థమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఏఎన్ఎం మందులు ఇచ్చారని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థినులు చెప్పారు. ఎప్పటికప్పుడు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం తెలియజేస్తున్నామని కేజీబీవీ ప్రత్యేకాధికారి ఎస్.లలితకుమారి తెలిపారు. టి.మాధవి, పి.లత, ఇ.శ్రావణి, భవాని, సుమతి, అనూరాధ, ఎం.సుభాషిణిలతో పాటు పలువురు డయేరియా బారిన పడ్డారు. సమస్య తీవ్రంగా కావడంతో విషయాన్ని కలెక్టర్కు తెలియజేశారు. ఆయన స్పందించి జిల్లా ఎపిడమిక్ అధికారి డాక్టర్ గిరిధర్ను తక్షణమే కేజీబీవీకి పంపించారు. ఆయన వచ్చిన తర్వాత వైద్యసిబ్బంది చేరుకున్నారు. అధ్వానంగా పరిసరాలు.. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, డ్రమ్లో పురుగులతో కలిసిన నీరు ఉండటం, మేడపై ట్యాంకులపై మూతల్లేకపోవడం వల్లే అతిసార ప్రబలిందని జిల్లా ఎపిడమిక్ అధికారి డాక్టర్ గిరిధర్ విలేకర్లకు చెప్పారు. వంటగదిలోనూ పరిశుభ్రత లోపించిందని చెప్పారు. ఆహార పదార్థాలపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ వివరాలన్నింటినీ కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. మినరల్ వాటర్ సరఫరా చేయాలి: డీఈఓ కేజీబీవీ విద్యార్థినులకు ప్రతిరోజు మినరల్ వాటర్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.దేవానందరెడ్డి ఎస్ఓను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎందుకు మినరల్ వాటర్ ఇవ్వలేదని ప్రశ్నించారు. వర్షాకాలంలో కనీసం మరిగించిన నీరైనా ఇవ్వాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కుళాయి నీరే వాడుతున్నాం: ఎస్ఓ మేడపైనుంచి వర్షం నీరు పడుతున్నప్పుడు పట్టేందుకు డ్రమ్ ఉంచామని, ట్యాంకుల్లో నీరు స్నానాలకు, బాత్రూం అవసరాలకు మాత్రమే వాడుతున్నామని ఎస్ఓ తెలిపారు. వంటకు, తాగేందుకు పంచాయతీ నుంచి వస్తున్న కుళాయి నీటినే వాడుతున్నామని చెప్పారు. -
డొంకలబడవంజలో అతిసార
♦ కానరాని ప్రభుత్వ వైద్యసేవలు ♦ రోగులను 108లో శ్రీకాకుళం తరలింపు ఎల్.ఎన్.పేట: మండలంలోని డొంకలబడవంజ గ్రామంలో అతిసార పడగ విప్పింది. ఇప్పటి వరకు పది మంది రోగులను శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలసలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మరో 15 మంది అతిసారతో మంచం పట్టారు. వ్యాధి బారిన పడిన వారిలో కొల్ల చిన్నవాడు, జె.నారాయుడు, పెద్దకోట రామమూర్తి, కొల్ల చిన్నమ్మి, పెద్దకోట సాయమ్మ, గేదెల ద్రాక్షవేణి, పారశెల్లి రామారావుతో పాటు మరో పదిహేను మంది వరకు ఉన్నారు. అతిసార తో మూడురోజులుగా అస్వస్థతకు గురైనా స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది కనీసం స్పందించడం లేదని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఇదీ వైద్యం దుస్థితి... డొంకల బడవంజ గ్రామంలో అతిసార వ్యాధితో బాధపడుతున్న పెద్దకోట రామమూర్తిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం లక్ష్మీనర్సుపేట ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తీసుకెళ్లారు. డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది రోగిని పరిశీలించి సిలైన్లు ఎక్కించారు. చీకటి పడుతున్న సమయంలో రోగి ఆరోగ్యం బాగుందని, ఇంటికి వెళ్లిపోవాలని అదే ఆటోలో పంపించేశారు. ఎక్కువ సిలైన్లు ఎక్కిస్తే రోగికి కిడ్నీలో రాళ్లు చేరిపోతాయని భయపెట్టారని రోగి బంధవులు ఆరోపించారు. ఇంటికి వచ్చిన తరువాత రోగి పరిస్థితి విషమించడంతో వెంటనే మరో ఆటోలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించామన్నారు. రోగిని ఇంటికి పంపించే బదులు మరో ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసినా సంతోషించేవార మని, రోగిని ఆదుకునే తీరు ఇదేనా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యలోపమే కారణం గ్రామంలో ఒకే వీధి ఉంది. ఈ వీధి ప్రవేశం నుంచి చివారు వరకు పశువుల పెంటకుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ ఇంటి ముందు చూసినా పారిశుద్ధ్యలోపం కనిపిస్తుంది. సీసీ రోడ్లు ఉన్నా కాలువలు లేకపోవడంతో వీధుల్లోనే వాడుకనీరు నిల్వ ఉంటోంది. పారిశుద్ధ్యలోపం వల్లే అతిసార ప్రబలినట్టు గ్రామ పెద్దలు చెబుతున్నారు. -
పర్లలో విజృంభించిన డయేరియా
♦ మంచాన పట్టిన వృద్ధులు, చిన్నారులు ♦ చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి పరుగులు పర్ల(చీపురుపల్లి రూరల్): చీపురుపల్లి మండలంలో కొన్నాళ్లుగా విజృంభిస్తున్న డయేరియా పూర్తిస్థాయిలో అదుపులోకి రాక ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం మండలంలోని పేరిపి గ్రామంలో డయేరియా వ్యాపించడంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యసిబ్బంది గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి డయేరియాను అదుపులోకి తీసుకువచ్చారు. మరలా అదే సమస్యతో మండలంలోని పర్ల గ్రామం డయేరియాతో మంచాన పట్టింది. గ్రామంలో ప్రజలు వాంతులు, విరేచనాలతో మంచాన పడి ఉన్నారు. మరి కొంత మంది రోగులు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన పదిహేను మంది చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. వీరిలో ఇద్దరిని విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ఇటీవల తరుచూ వర్షాలు కురవటంతో సీజనల్ పరంగా డయేరియా వ్యాపించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. -
అతిసారతో వ్యక్తి మృతి
గోపాలపురం (సారవకోట) : గుమ్మపాడు పంచాయతీ గోపాలపురం గ్రామంలో అతిసారతో వృద్ధుడు యజ్జల లచ్చయ్య మృతి చెందగా పలువురు బాధపడుతున్నారు. యజ్జల లచ్చయ్యకు నాలుగు రోజుల క్రితం అతిసారం సోకి బుడితి సీహెచ్సీలో వైద్య సేవలు పొంది ఆదివారం ఇంటికి చేరుకున్నాడు. సోమవారం మృతి చెందాడు. ఈయనకు భార్య చిన్నమ్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారులున్నారు. గ్రామానికి చెందిన ముచ్చ లచ్చమ్మ, బొమ్మాళి గన్నెమ్మ, శిమ్మ అన్నపూర్ణ, పొట్నూరు సుశీలతో పాటు మరో ఆరుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరిని నరసన్నపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు. గ్రామంలో పారిశుధ్య లోపం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు తెలిపారు.