గ్రామస్తులకు సలహాలు అందిస్తున్న వైద్య సిబ్బంది
సోంపేట: పాలవలస పంచాయతీ కుమ్మరిపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. తిన్న ఆహారం, నీరు కలుషితం కావడంతో సుమారు 40 మంది డయేరియా బారిన పడ్డారని కొర్లాం వైద్యాధికారులు తెలిపారు. కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చికిత్సలు చేయడంతో పాటు, కుమ్మరిపాడు గ్రామంలో కొర్లాం పీహెచ్‌సీ వైద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించి రోగులకు సలహాలు సూచనలు అందించారు. కొర్లాం ఆస్పత్రిలో నారాయణరావు, మాధవరావు, తిరుపతమ్మ, వరలక్ష్మి, కాంతమ్మ తదితర 40 మందికి వైద్య పరీక్షలు చేశారు. కుమ్మరిపాడు గ్రామంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేశారు. గ్రామంలో ఆదివారం ఓ విందుభోజనం ఆరగించిన తర్వాత ఇలా జరిగిందని గ్రామస్తులు పలువురు చెబుతున్నారు. నిల్వ ఉన్న పదార్థాలు వినియోగించడం వల్ల, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల డయేరియా వ్యాపించిందని వైద్యాధికారులు పేర్కొన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగమని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని రోగులకు సూచించారు. గ్రామంలోని బావుల్లో వైద్య సిబ్బంది క్లోరినేషన్ చేశారు.