డొంకలబడవంజలో అతిసారతో మంచం పట్టిన సాయమ్మ
♦ కానరాని ప్రభుత్వ వైద్యసేవలు
♦ రోగులను 108లో శ్రీకాకుళం తరలింపు
ఎల్.ఎన్.పేట: మండలంలోని డొంకలబడవంజ గ్రామంలో అతిసార పడగ విప్పింది. ఇప్పటి వరకు పది మంది రోగులను శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలసలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మరో 15 మంది అతిసారతో మంచం పట్టారు. వ్యాధి బారిన పడిన వారిలో కొల్ల చిన్నవాడు, జె.నారాయుడు, పెద్దకోట రామమూర్తి, కొల్ల చిన్నమ్మి, పెద్దకోట సాయమ్మ, గేదెల ద్రాక్షవేణి, పారశెల్లి రామారావుతో పాటు మరో పదిహేను మంది వరకు ఉన్నారు. అతిసార తో మూడురోజులుగా అస్వస్థతకు గురైనా స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది కనీసం స్పందించడం లేదని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు.
ఇదీ వైద్యం దుస్థితి...
డొంకల బడవంజ గ్రామంలో అతిసార వ్యాధితో బాధపడుతున్న పెద్దకోట రామమూర్తిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం లక్ష్మీనర్సుపేట ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తీసుకెళ్లారు. డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది రోగిని పరిశీలించి సిలైన్లు ఎక్కించారు. చీకటి పడుతున్న సమయంలో రోగి ఆరోగ్యం బాగుందని, ఇంటికి వెళ్లిపోవాలని అదే ఆటోలో పంపించేశారు. ఎక్కువ సిలైన్లు ఎక్కిస్తే రోగికి కిడ్నీలో రాళ్లు చేరిపోతాయని భయపెట్టారని రోగి బంధవులు ఆరోపించారు. ఇంటికి వచ్చిన తరువాత రోగి పరిస్థితి విషమించడంతో వెంటనే మరో ఆటోలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించామన్నారు. రోగిని ఇంటికి పంపించే బదులు మరో ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసినా సంతోషించేవార మని, రోగిని ఆదుకునే తీరు ఇదేనా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్యలోపమే కారణం
గ్రామంలో ఒకే వీధి ఉంది. ఈ వీధి ప్రవేశం నుంచి చివారు వరకు పశువుల పెంటకుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ ఇంటి ముందు చూసినా పారిశుద్ధ్యలోపం కనిపిస్తుంది. సీసీ రోడ్లు ఉన్నా కాలువలు లేకపోవడంతో వీధుల్లోనే వాడుకనీరు నిల్వ ఉంటోంది. పారిశుద్ధ్యలోపం వల్లే అతిసార ప్రబలినట్టు గ్రామ పెద్దలు చెబుతున్నారు.