గంట్యాడ కేజీబీవీ పాఠశాలలో చదువులో నిమగ్నమైన బాలికలు
బాలికల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు ఆవిర్భవించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఆంగ్లమాధ్యమానికి అప్‌గ్రేడ్ అయ్యారు. ఐదేళ్లుగా ఎలాగోలా వంటబట్టించుకున్నా...పబ్లిక్ పరీక్షలు తొలిసారిగా రాస్తున్నారు. శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో రకరకాలుగా ప్రణాళికలు రూపొందించిన అధికారులు వాటిని పక్కాగా అమలుచేస్తున్నారు.
విజయనగరం అర్బన్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న పదోతరగతి విద్యార్థినులు మెరుగైన వార్షిక ఫలితాలు సాధన కోసం సర్వశిక్షాభియాన్(ఎస్‌ఎస్‌ఏ) యంత్రాంగం కుస్తీ పడుతోంది. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన తరువాత ఈ ఏడాదే తొలిసారిగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల ఫలి తాల్లో ఏమాత్రం తేడా రాకుండా ఉండాలనే లక్ష్యంతో ఎస్‌ఎస్‌ఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. జిల్లాలోని 33 కేజీబీవీల్లో విద్యార్థుల సామర్థ్యాలపై ఇప్పటికే అంచనావేసి ప్రత్యేక తర్ఫీదులను ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో ఇంతవరకు జరిగిన వివిధ రకాల పరీక్షల్లో ప్రదర్శించిన సామర్థ్యాలకు అనుగుణంగా తరగతిలో విద్యార్థులను విభజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఇటీవల సబ్జెక్ట్‌లోని రెండేసి చాప్టర్ల వారీగా టెస్ట్‌లు పెట్టారు. వీటి ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఒక్కో కేజీబీవీలలో 5 నుంచి 6 శాతం వంతున జిల్లా వ్యాప్తంగా 360 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరందరినీ పాస్ చేయించేం దుకు శ్రద్ధ చూపుతున్నారు. ఎస్‌ఎస్‌ఏ పీఓ నుంచి సెక్టోరియల్ అధికారి వరకు ఒక్కో అధికారి ఒక్కో కేజీబీవీని దత్తత తీసుకొని అక్కడి వెనుకబడిన విద్యార్థినుల ఉత్తర్ణత బాధ్యతను తీసుకున్నారు. రోజూ నిర్వహించే ఉద్యోగ విధులతోపాటు అదనంగా ఈ బాధ్యత నిర్వర్తించాలి. సబ్జెక్ట్ వారిగా మాదిరీ ప్రశ్నపత్రాలను తయారు చేసి వాటి ద్వారా వెనుకబడినవారికి తర్ఫీదు ఇస్తున్నారు. టాప్ ఫైవ్ విద్యార్థులను ఒక చోటకు చేర్చి 10/10 సాధన కోసం శిక్షణ ఇస్తున్నారు.
పరీక్షకు హాజరుకానున్న 1,139 మంది విద్యార్థినులు
వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు కేజీబీ వీల నుంచి 1,045 మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. కేజీబీవీల పరిధిలోని ఉపాధ్యాయులు రూపొం దించిన ప్రత్యేక ప్రశ్నావళితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గతేడాది సాధించిన 92.3 శాతం ఉత్తీర్ణత కంటే మెరుగైన ఫలితాలకోసం ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. విద్యార్థినుల్లో పరీక్షపై భయం పోగొట్టే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థాయిలో మానసికోల్లా స కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి వారిని గౌరవించే కార్యక్రమం విద్యాలయం స్థాయిలో చేపట్టారు. ఇలాంటి వాటి ద్వారా వారిలో పరీక్షలంటే భయం పోతుందని ఎస్‌ఎస్‌ఏ అధికారులు అంటున్నారు.
ఉత్తీర్ణతా శాతంపెంపునకు ప్రణాళికలు
కేజీబీవీల్లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గతేడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాం. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత సాధించాం, ఈ ఏడాది సీసీఈ విధానం అమలులో ఉండడంతో ఏమాత్రం తగ్గకుండా శతశాతం ఫలితాలకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్, ఈ నెల 24 నుంచి జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యం తెలుస్తుంది. తద్వారా బోధనపై శ్రద్ధపెడతాం.
ఇంగ్లిష్ మాధ్యమంపైభయాన్ని పోగొట్టాం
నాలుగేళ్లక్రితం ఆరోతరగతిలో ఇంగ్లిష్ మాధ్యమం మొదలైంది. తొలి బ్యాచ్ పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది రాస్తున్నారు. వీరికి తొలి రోజుల్లో ఇంగ్లిష్ మాధ్యమమంటే భయం ఉం డేది. దీనిని పోగొట్టడానికి ఏడా ది బోధనలో అధిక ప్రాధాన్యమిచ్చాం. దీనివల్ల ఫలితా లను మెరుగవుతాయన్న నమ్మకం ఉంది. – బలగ జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, గంట్యాడ
ఫలితాలకోసం ప్రత్యేక కార్యాచరణ
కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతుండగా సాయంత్రం 5.30 గంటల వరకు చివరి తరగతిని నిర్వహిస్తారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయరు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వినిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలి తెలుసుకోవాలనే దానిపై శ్రద్ధ తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment