ఆ మేడం వస్తే మేం వెళ్లిపోతాం! | KGBV ADILABAD School Students Opposing Special Officer Suspension | Sakshi
Sakshi News home page

ఆ మేడం వస్తే మేం వెళ్లిపోతాం!

Published Wed, Apr 6 2022 11:39 PM | Last Updated on Thu, Apr 7 2022 8:39 AM

KGBV ADILABAD School Students Opposing Special Officer Suspension - Sakshi

కేజీబీవీలో చదువుతున్న విద్యార్థులు

ఆదిలాబాద్‌: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు మారడం లేదు.  గతనెల  జిల్లా కేంద్రంలోని రూరల్‌ కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 90 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు కన్నీరుమున్నీరు కాగా, కలెక్టర్‌ విచారణ చేపట్టి రూరల్‌ కేజీబీవీ ప్రత్యేక అధికారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

అయితే ఎస్‌వోపై సస్పెన్షన్‌ ఎత్తివేయించేందుకు కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈమేరకు విద్యార్థులతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎస్‌వోను తిరిగి విధుల్లోకి తీసుకుంటే తాము ఈ పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

చికెన్, బిస్కెట్లు పెడతామని..
ఫుడ్‌ పాయిజన్‌ తర్వాత పరిస్థితి మారిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువుతోపాటు నాణ్యమైన భోజనం పెడుతున్నారని పేర్కొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం పాఠశాలలో పనిచేసే స్వీపర్‌ కవిత, వంటచేసే సిబ్బంది సుందరమ్మ, సరస్వతి, అనిత బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు చేయించారని విద్యార్థులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాలలో డ్యూటీ సీఆర్టీ మాత్రమే ఉన్నారు.

వీరితోపాటు ఈ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి చికెన్‌ తింటారా.. బిస్కెట్లు కావాల అని అడిగి 7, 8వ తరగతి విద్యార్థులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే మీకు చికెన్, బిస్కెట్లు తెప్పించడానికని వారిని నమ్మించారు.

అయితే గతంలో ఎప్పుడూ ఇలా సంతకం పెట్టించలేదని, కొత్తగా ఎందుకు పెట్టిస్తున్నారని మరికొంతమంది అడిగారు. ఈ సిబ్బంది సస్పెన్షన్‌కు గురైన ఎస్‌వోకు మద్దతుగా సంతకాలు చేయించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరితోపాటు ఓ దళిత సంఘానికి చెందిన నాయకుడు ఫుడ్‌పాయిజన్‌ జరిగిన సమయంలో విద్యార్థులకు మద్దతుగా నిలవగా, ప్రస్తుతం ఎస్‌వోకు మద్దతుగా విద్యార్థులతో సంతకాలు పెట్టించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంటున్నారు.

‘మీరు రెండు సంవత్సరాలు ఉండి వెళ్లిపోతారు.. పాత టీచర్‌ను తీసుకుంటే మీకేం ఇబ్బంది’ అని విద్యార్థులను ప్రశ్నించారని తెలిపారు. నిబంధనల ప్రకారం కేజీబీవీలోకి ఎవరినీ అనుమతించరాదు. అయినా అక్కడ పనిచేసే సిబ్బందిని బెదిరించి సదరు నాయకుడు క్యాంపస్‌లోనికి వచ్చి విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.  

తల్లిదండ్రుల ఆందోళన..
కేజీబీవీలో విద్యార్థినిలను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కేజీబీవీ వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను, అక్కడ పనిచేసే సిబ్బందిని నిలదీశారు. తమకు తెలియకుండా తమ పిల్లలతో తెల్లకాగితంపై ఎందుకు సంతకాలు తీసుకున్నారని నిలదీశారు.  తమ పిల్లలకు ఏమైన జరిగితే వారే బాధ్యులని హెచ్చరించారు. ఎస్‌వోను తిరిగి ఈ పాఠశాలలో తీసుకుంటే తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్న సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇక్కడ  చదువుకోం
మా పాత మేడం ఉన్నప్పుడు సరిగా మాకు భోజనం పెట్టేవారు కాదు. నాసిరకం భో జనం, కలుషిత నీరు అందించారు. దీంతో తాము అనారోగ్యం బారిన పడ్డాం. ఫుడ్‌ పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యాం. ఆ మేడం సస్పెండ్‌ అయినప్పటి నుంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.  మళ్లీ ఆమె వస్తే మేం ఇక్కడ చదువుకోం.             
– నిక్షిత, విద్యార్థిని

బలవంతంగా సంతకాలు..
రెండు రోజుల కింద స్వీపర్, అటెండర్‌ నన్ను గేటు దగ్గరికి పిలిచి ఒక తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారు. ఎందుకోసమని అడిగితే చికెన్, బిస్కెట్లు ఎంతమంది తింటారనేది రాసుకుంటున్నామని చెప్పారు. వారు ఒత్తిడి చేయడంతో నాకు తోచక సంతకం చేశాను.     
– ప్రసన్న, విద్యార్థి

విద్యార్థులతో మాట్లాడాను
కేజీబీవీ విద్యార్థులతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడాను. సిబ్బందికి ఈ విషయమై హెచ్చరించాను. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాను.   
– ప్రణీత, డీఈఓ, ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement