కరాటేలో తలపడుతున్న లహరి అనిత, లలితా భవాని
కొనకనమిట్ల: మహిళల రక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు అంతులేకుండా పోతున్నాయి. సమాజంలో నేర స్వభావం పెరుగుతున్న కొద్ది.. ఆడవారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పటం అవసరం. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటారు.. ఆ కోవలోనే అక్కాచెల్లెళ్లు లహరి అనిత, లిలతా భవానిలు తైక్వాండో (కరాటే) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఇటీవల విశాఖపట్టణంలో నిర్వహించిన పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి సత్తాచాటారు.
ఉపాధ్యాయుల ప్రోత్సాహమే
కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న లహరి అనిత, లలితా భవానిలు క్రీడలలో మంచి ప్రతిభ కనబరచడంతో పాఠశాల ప్రత్యేకాధికారి ఆర్.సురేఖ, పాఠశాల పీఈటీ వనజలతలు తమ విద్యార్థినులను కరాటే దిశగా ప్రోత్సహించి వారికి మంచి తర్ఫీదునిచ్చారు. అంతకు ముందు కరాటేలో రాజు మాస్టర్ దగ్గర మెళకువలు నేర్చుకున్న అహరి అనిత, లలితా భవానిలు కరాటే విద్యపై మక్కువ చూపించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన పోటీలతో పాటు రాష్ట్ర స్థాయిలో వైజాగ్‌లో జరిగిన 13 జిల్లాల కేజీబీవీల కరాటే (తైక్వాండో) పోటీల్లో గొట్లగట్టు కేజీబీవి బాలికలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సత్తాచాటారు. అక్కడ కేజీబీవీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్, కామేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, నారాయణ, విద్యాశాఖ జేడీ శ్రీనివాసులు, సర్వశిక్ష అభియాన్ పీఓ ఎం.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కేజీబీవీ బాలికలు అవార్డులు మెమెంటోలు అందుకున్నారు.
జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలి..
జాతీయస్థాయి పోటీలలో పాల్గొనాలనేది తమ లక్ష్యమని అక్కాచెల్లెళ్లు లహరి అనిత, లలితా భవాని అన్నారు. కరాటేతో పాటు కబడ్డీ అంటే ఇష్టమని కబడ్డీ పోటీల్లో కూడా ప్రావీణ్యం ఉంది. పాఠశాల జోనల్ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాం. మంచి క్రీడాకారిణిలుగా పేరుతెచ్చుకోవాలన్నదే లక్ష్యం.. తైక్వాండోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లహరి అనిత, లలిత భవానిలను, తర్ఫీదునిచ్చిన పీఈటీ వనజలతను, పాఠశాల ప్రత్యేకాధికారి సురేఖను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment