వాడిన జుట్టు.. మాసిన బట్టలు
- వారానికి ఒకసారే స్నానం.. కాలకృత్యాల పరిస్థితి నరకం
- మంత్రి కాలవ ఇలాకాలో కేజీబీవీ విద్యార్థినుల అవస్థలు
గుమ్మఘట్ట : చదువులో ప్రథమం.. సౌకర్యాల్లోనే అధమంగా నిలుస్తోంది గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్ట్ వద్ద ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. పది రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య విద్యార్థినులను వేధిస్తుండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. పాఠశాలలో 6 నుంచి 10 వరకు 200 మంది చదువుతున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన బోరుబావిలో రెండు నెలల కిత్రం నీరు అడుగంటిపోయింది. దీంతో విద్యార్థినులకు నీటి కష్టాలు మొదలయ్యాయి.
ప్రతి విద్యార్థినికీ స్నానం, బట్టలు ఉతుక్కోవడానికి రోజుకు కనీసం 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన రోజుకు 10 వేల లీటర్ల నీరు అందుబాటులో ఉండాలి. కానీ 3 వేల లీటర్లు నిలువ చేసే సింటెక్స్ ట్యాంకులు ఉండటంతో మిగులు నీరు అన్ని వేళలా వాటిలో భద్రపరిచేవారు. ప్రస్తుతం కుళాయి ద్వారా రోజుకు వెయ్యి నుంచి 1,500 లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. తరగతులు, సెక‌్షన్ల వారీగా రోజుకు బకెట్ నీటిని మాత్రమే చౌకగా అందిస్తున్నారు. ఈ నీటిలోనే అన్నీ ముగించాలని చెబుతున్నారు. ఫలితంగా మాసిన బట్టలు.. వాడిన జుట్టుతోనే విద్యార్థులు చదువులకు వెళ్తున్నారు. రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతిని«థ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో పిల్లలకు ఇలాంటి కష్టాలు ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత తాగునీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.
మాసిన బట్టలతోనే వెళ్తున్నాం
నీటి ఇబ్బందుల దృష్ట్యా బట్టలను శుభ్రం చేసుకోలేకపోతున్నాం. వారానికి ఓసారి ఇంటికి పంపి శుభ్రం చేయించుకుని రమ్మని చెబుతున్నాం. దీంతో మాసిన బట్టలే దిక్కు అవుతున్నాయి. శాశ్వత నీటి కష్టాలు తీర్చాలి.
– డి.శ్రుతి, 8వ తరగతి విద్యార్థిని
బకెట్ నీరు సరిపోవడం లేదు
బకెట్ నీరు ఏమాత్రం సరిపోడం లేదు. సీజనల్ వ్యాధులు సైతం ముసిరి ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో శుభ్రత పాటించకపోతే వ్యాధుల బారిన పడక తప్పదు. వంతుల వారీగా నీటిని అందిస్తున్నారు.
– ఎం.అంబిక, 10వ తరగతి విద్యార్థిని
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
పాఠశాలలో తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు రోజుల కిత్రం తహసీల్దార్ అఫ్జల్‌ఖాన్, ఎంపీడీఓ జి.మెనెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు, ఎంపీపీ పాలయ్య కూడా పాఠశాలకు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
– షబానాబేగం, ఎస్‌ఓ, బీటీపీ
సమస్య పరిష్కరిస్తాం
విద్యార్థినుల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు సత్వర పరిష్కారం చేపడుతాం. అందుబాటులో ఉన్న ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను తాగునీటికి ఖర్చు చేసేలా సంబంధిత ఎస్‌ఓను ఆదేశిస్తాం. అవసరమైతే ట్యాంకర్ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చుతాం.
– సుబ్రమణ్యం, ఆర్వీఎం, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్