భయంతో పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థినిలు.
వీరఘట్టం : రేగులపాడు గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో పాఠశాలలోని కిచెన్ రూంలో వంటలు వండుతుండగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు ఉధృతంగా మారాయి. ఈ సమయంలో గ్యాస్ వండుతున్న సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చి తరగతి గదుల్లో ఉన్న విద్యార్థినిలను అప్రమత్తం చేశారు. దీంతో విద్యార్థినిలు హాహాకారాలు చేస్తూ పాఠశాల నుంచి బయటకు వచ్చేయగా, అక్కడే ఉన్న కొంతమంది సిబ్బంది, సీఆర్‌టీలు మేల్కొని ఇసుకను లీకైన గ్యాస్‌సిలిండర్ పైకి వేయడంతో పాటు మంటలు అదుపులోకి రాగానే కిచెన్‌రూంలోని మిగిలిన గ్యాస్ సిలిండర్లును బయటకు నెట్టివేశారు. గ్యాస్ లీకైన సిలెండర్‌లో తక్కువ గ్యాస్ ఉండడంతో ప్రమాదం అదుపులోకి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.